• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మారిన కెసిఆర్: తొక్కుతానని అన్నారు, వాటి ప్రాపకం కోసం పాకులాడుతున్నారు

By Pratap
|

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వ్యవహారశైలి తెలంగాణ ప్రజలను ఆశ్చర్యానికే కాకుండా ఆవేదనకు కూడా గురి చేస్తోంది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్నంత స్థిరచిత్తంతో ఆయన ప్రస్తుతం లేరనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఆంధ్ర మీడియాపై నిప్పులు చెరిగిన కెసిఆర్ ఇప్పుడు ఆ మీడియా ప్రాపకం కోసం పాకులాడుతున్నారనే అభిప్రాయం కలుగుతోంది. ఈనాడు రామోజీ రావు పట్లనే కాకుండా ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ పట్ల కూడా ఆయన వైఖరి మారింది.

అలా మారిందని చెప్పడానికి నిదర్శనాలు అవసరం లేకుండా పోయింది. ఆంధ్ర మీడియాను అణచేయాలని ఎవరూ అనరు గానీ అంతగా దాని ప్రాపకం కోసం పాకులాడాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న తెలంగాణ ప్రజల నుంచి వస్తోంది.

ఆ రోజు తొక్కిస్తానని అన్నారు...

ఆ రోజు తొక్కిస్తానని అన్నారు...

తనకు వ్యతిరేకంగా పనిచేస్తూ వస్తున్న ఆంధ్ర మీడియాపై అప్పట్లో కెసిఆర్ నిప్పులు చెరిగారు. ఆంధ్ర మీడియాను అధోపాతాళానికి తొక్కేస్తానని అప్పట్లో అన్నారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తర్వాత కూడా ఆ మాట అన్నారు. తెలంగాణ పట్ల అవమానకరంగా వ్యవహరించిందంటూ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి కేబుల్స్ కత్తిరించేశారు. ఎబిఎన్ ప్రసారాలు తెలంగాణలో జరగకుండా చేశారు.

అందులోనే కాలు పెట్టారు...

అందులోనే కాలు పెట్టారు...

నిజంగానే కెసిఆర్ వేమూరి రాధాకృష్ణ పట్ల కసిగా ఉన్నారని అనుకుంటే తప్పేనని ఇటీవలి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. పాత అవమానాలను, వెక్కిరింపులను మరిచిపోయి కెసిఆర్ ఏకంగా ఆంధ్రజ్యోతి కార్యాలయంలోనే అడుగు పెట్టారు. ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డు దాడికి గురై, ధ్వంసమైతే పట్టించుకోని కెసిఆర్ ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్ధమైతే స్పందించారు. దగ్ధమైన కార్యాలయాన్ని సందర్శించి, సానుభూతి వాక్యాలు పలికారు. అంతేకాదు, సంచికలు ఎలా తెచ్చారని ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు.

ఈనాడు రామోజీ రావుతో...

ఈనాడు రామోజీ రావుతో...

ఈనాడు అధినేత రామోజీ రావుతో మొదట్లోనే రాజీకి వచ్చారు. రామోజీ రావు ఆధ్యాత్మిక నగరం స్కెచ్‌తో సచివాలయంలోకి అడుగు పెట్టగానే వరాలు ఇచ్చేశారు. ఆధ్యాత్మిక నగరానికి భూమిని కేటాయించడానికి ముందుకు వచ్చారు. ఇటీవల రామోజీరావుకు వందల ఎకరాలు కేటాయిస్తూ జీవో కూడా ఇచ్చారు. రామోజీ రావు నివాసంలో కూడా అడుగు పెట్టారు.

కెటిఆర్ స్వయంగా అంగీకరించారు...

కెటిఆర్ స్వయంగా అంగీకరించారు...

ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పేరుకుపోతుందని చెప్పడానికి ప్రత్యేకంగా నిదర్శనాలు అక్కరలేదు. నమస్తే తెలంగాణ కార్యాలయంలో అడుగు పెట్టి పత్రిక తీరుతెన్నులపై సమీక్షించిన కెసిఆర్ తనయుడు కెటి రామారావు స్వయంగా ఆ విషయాన్ని అంగీకరించారు. నమస్తే తెలంగాణ ఆంధ్ర మీడియా కన్నా మెరుగ్గా తమ వార్తాకథనాలను ఇవ్వలేని అసమర్థతో కొట్టుమిట్టాడుతోందని ఆయన అభిప్రాయపడుతూ క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే విషయాన్ని అంగీకరించిన విషయం ప్రచారంలో ఉన్నదే. అయితే, ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎక్కడైనా సహజమని ఆయన సర్దిచెప్పేందుకు ఆయన ప్రయత్నించారు కూడా.

ఆంధ్రా మీడియాను పక్కన పెట్టుకుంటే...

ఆంధ్రా మీడియాను పక్కన పెట్టుకుంటే...

ఆంధ్ర మీడియాను తన పక్కన పెట్టుకుంటే, వాటి ప్రాపకం సంపాదించుకుంటే అంతా మెరుగ్గా ఉంటుందనే అభిప్రాయంతో కెసిఆర్ ఉన్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్ర మీడియాను తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటికి అనుకూలంగా మారారని కెసిఆర్ భావిస్తున్నారా అనేది ప్రశ్న. అదే సమయంలో ఆంధ్ర మీడియా తనకు వ్యతిరేకంగా పనిచేయకపోతే, తనకు వ్యతిరేకంగా వార్తాకథనాలు రాయకపోతే అంతా సజావుగానే ఉందని తెలంగాణ ప్రజలు నమ్ముతారని కెసిఆర్ అనుకుంటున్నారా అనేది సమాధానం దొరకని ప్రశ్నేమీ కాదు. ఆంధ్ర మీడియాను తెలంగాణ ప్రజలు ఇప్పటికీ విశ్వసించడం లేదనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు.

పథకాల తీరుతెన్నులు...

పథకాల తీరుతెన్నులు...

కెసిఆర్‌ ఏది చేసినా భారీగానే చేస్తారు. నమస్తే తెలంగాణ పత్రిక పెట్టిన సమయంలో గానీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చేసిన కార్యక్రమాలు గానీ అందుకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఉద్యోగులకే కాదు, యావత్తు తెలంగాణ ప్రజలకు, తెలంగాణలోని అన్ని వర్గాలకు ఆయన ఇచ్చిన హామీలు చిన్నవేమీ కాదు. అయితే, చాలా పథకాలు ఇప్పటికీ అమలులోకి రాలేదని ఎవరిని అడిగిన చెబుతారు. అవి కాగితాలకే పరిమితమయ్యాయని చెప్పాల్సిన పని లేదు. కొన్ని వెసులుబాట్లు కల్పించినంత మాత్రాన పరిస్థితి కెసిఆర్ చెప్పినంతగా మారిందని, మారుతుందని నమ్మడానికి వీలు లేని పరిస్థితులే ఉన్నాయి. రైతు సమస్యలు తీరలేదు. ముస్లిం రిజర్వేషన్లు అమలులోకి వస్తాయనే నమ్మకం లేదు. క్రమ క్రమంగా కెసిఆర్ తాను చెప్పిన పథకాలను అమలు చేస్తారనే నమ్మకం సన్నగిల్లుతూ వస్తోంది. ఈ స్థితిలో ఆంధ్ర మీడియా ఆయనను కాపాడుతుందా అనేది వేయిన్నోక్క ప్రశ్నగానే మిగులుతుంది. అవకాశం చిక్కితే కెసిఆర్‌పై విరుచుకుపడడానికి అది కాచుకుని కూర్చుకుంటుందనే విషయం అబద్ధమేమీ కాకపోవచ్చు.

పదవులతో సరిపెడితే....

పదవులతో సరిపెడితే....

తనపై వ్యతిరేకత ప్రదర్శిస్తున్న తెలంగాణ నాయకులను ఆయన పదవుల ద్వారా ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ తనకు వ్యతిరేకంగా కార్యాచరణకు పూనుకుని, పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో ఆయన కార్పోరేషన్ పదవులను భర్తీ చేస్తూ వచ్చారు. పదవుల కోసం వేచి చూస్తున్న వారు జారిపోతారేమోననే ఉద్దేశంతోనే ఆయన పదవుల పంపకం చేసినట్లు భావిస్తున్నారు. ఇటీవల కూడా ఇద్దరికి ఆయన పదవులు ఇస్తానని హామీ ఇచ్చి కోదండరామ్‌కు దూరం చేసినట్లు భావిస్తున్నారు.

జగన్ అలా చేస్తున్నారు...

జగన్ అలా చేస్తున్నారు...

తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాను ఎదుర్కోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్న కాలంలోనే సాక్షి మీడియాకు శ్రీకారం చుట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను తిట్టిపోశారు. ఆ తర్వాత ఎప్పుడూ వాటి ప్రాపకం కోసం పాకులాడిన సందర్భాలు లేవు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వైయస్ జగన్ తన సాక్షి మీడియాను వాటికి ధీటుగానే నడిపిస్తున్నారు. రాజకీయ వ్యూహచతురతలో గానీ మాటకారితనంలో గానీ జగన్ కెసిఆర్‌కు సరిరాకపోవచ్చు గానీ పోరాడడంలో ఆయన వెనుకంజ వేయలేదు. ఒకవేళ అధికారం వస్తే వెనుకంజ వేస్తారని చెప్పడానికి కూడా ఏమీ లేదు.

నమస్తే తెలంగాణపై నమ్మకం పోయిందా...

నమస్తే తెలంగాణపై నమ్మకం పోయిందా...

నిజానికి, ఆంధ్ర మీడియా తెలంగాణ వ్యతిరేక వార్తాకథనాలను సహించలేకనే కెసిఆర్ నమస్తే తెలంగాణ పత్రికకు శ్రీకారం చుట్టారు. ఉద్యమానికి, తెలంగాణకు భరోసా ఇవ్వడానికి ఆ పత్రిక పనిచేస్తుందని తెలంగాణ ప్రజలు కూడా విశ్వసించారు. కానీ, అది క్రమంగా క్షీణదశకు చేరుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. పత్రికలో పెద్ద తలకాయల మార్పులు చేర్పులూ మరింతగా పరిస్థితిని దిగజారుస్తున్నాయని అంటున్నారు. తనకు సన్నిహితంగా మెలుగుతూ వచ్చినవారి చేత దాన్ని నడిపించాలనే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప కాస్తా దూరంగా తన పట్ల అభిమానంతోనూ, తెలంగాణ పట్ల నిబద్ధతతోనూ పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులను గుర్తించి, వారికి అప్పగించడం పట్ల ఆయన ఆసక్తి ఉన్నట్లు కనిపించడం లేదు. తెలంగాణ టుడే ఇంగ్లీష్ పత్రిక పరిస్థితి కూడా అంత గొప్పగా ఏమీ లేదని అంటున్నారు. ఈ స్థితిలోనే ఆయన ఆంధ్ర మీడియా ప్రాపకం కోసం పాకులాడుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.

కెసిఆర్ తప్పటడుగులు....

కెసిఆర్ తప్పటడుగులు....

తెలంగాణ ఉద్యమ కాలానికి, అధికారం వచ్చిన తర్వాత పరిస్థితికి చాలా తేడా ఉందనే విషయాన్ని కెసిఆర్ గుర్తిస్తున్నట్లు లేరు. తెలంగాణ కోసం పనిచేసినవారిని పక్కన పెడుతూ తనకు సన్నిహితంగా ఉంటూ తన ప్రాపకం కోసం పాకులాడినవారిని మాత్రమే ఆయన చేరదీస్తున్నారనే అభిప్రాయం క్రమంగా బలపడుతూ వస్తోంది. తనకు మాత్రమే సన్నిహితంగా ఉండేవారికి, తనకు వ్యతిరేకంగా పనిచేస్తూ అవతలి శిబిరంలో చేరడానికి సిద్ధపడినట్లు సంకేతాలు ఇచ్చినవారికి ఆయన పదవులు ఇస్తున్నారు. కానీ, అసలు విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రాబల్యం క్రమంగా పోతుందని, తెలంగాణ కోసం పనిచేయనివారికి అంతగా ప్రాధాన్యం ఉండదని భావించిన తెలంగాణ ఉన్నత శ్రేణి వర్గం తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ ఉన్నత శ్రేణి వర్గం కెసిఆర్‌ను తెలంగాణ ఉద్యమ కాలంలో పదవులు, ఇతరాలు ఏవీ ఆశించకండానే బలపరిచింది. ఆ వర్గం అసంతృప్తి తననేమీ చేయలేదనే అతి విశ్వాసం కెసిఆర్‌కు ఉంటే ఉండవచ్చు. కానీ అది ఎన్నికల నాటికి ఏ రూపమైనా తీసుకునే వాతావరణమే ఉంది.

పదవులు పొందినవారు...

పదవులు పొందినవారు...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నతశ్రేణి వర్గానికి చెందినవారు ప్రభుత్వ సంస్థలన్నింటికీ దూరంగానే ఉంటూ వచ్చారు. ఒక రకంగా ప్రభుత్వ సంస్థలను వారు తిరస్కరించారు. కొద్ది మంది తెలంగాణ వాళ్లు చెలాణిలో ఉంటే ఉండవచ్చు గాక ప్రయోజనాలు మాత్రం ఆంధ్ర ప్రాంత ఉన్నత శ్రేణి వర్గమే పొందుతూ వచ్చింది. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో సంస్థల అధిపతులుగా కెసిఆర్ పక్కనే ఉంటూ వచ్చినవారు నియమితులవుతూ వస్తున్నారు. వీరు ఉద్యమ కాలంలో తమ వెన్నంటే నడిచిన సహచరులను కూడా ఖాతరు చేయడం లేదు. కనీసం వారితో సంబంధాల మాట అటుంచి, వారు నిర్వహిస్తున్న సంస్థల్లో అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా పరిస్థితి మారుతోంది. ఇది మరో వర్గంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేని ఓ కొత్త లక్షణం ఇప్పుడు పాదుకునే ప్రమాదం ఉంది. చాలా మంది ఇప్పుడు ప్రభుత్వ సంస్థల్లో అడుగు పెట్టాలని చూస్తున్నారు. వారికి అవకాశం లేకుండా పోతోంది. వివిధ ప్రభుత్వ సంస్థల అధిపతుల చేత తిరస్కారానికి గురవుతున్న వర్గానికి మింగుడు పడని విషయంగా ఉంది. ఆంధ్ర ప్రాంత ప్రాబల్యం మళ్లీ వివిధ సంస్థల్లో నెలకొంంటున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇది క్రమంగా కెసిఆర్‌ పట్ల ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. తెలంగాణకు చెందిన వారందరినీ కలుపుకుని పోయే గుణం లోపించిందనేది ఇక్కడ ప్రధాన విషయం.

English summary
It seems Telangana CM and Telangana Rastra Samithi (TRS) chief K chandrasekhar Rao is a changed man now a days, as he ignored the role of Andhra media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X