• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బీహార్‌లో షాక్ ఇచ్చారు, నాకు షాక్ ఇవ్వాలని అంటావా?: కెసిఆర్

By Pratap
|

వరంగల్: కరెంట్ ఇవ్వకుండా టిడిపి, కాంగ్రెసు ప్రభుత్వాలు 30 ఏళ్లు ఏడిపించాయని, ఏడాదిలోపలే తాము కరెంట్ సమస్యను పరిష్కరించామని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. వరంగల్ లోకసభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం సాయంత్రం హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తాము విఫలమైతే టిఆర్ఎస్‌కు శిక్ష వేయాలని, లేదంటే ప్రతిపక్షాలకు శిక్ష వేయాలని ఆయన వరంగల్ ఓటర్లను కోరారు. తాను ఎవరినీ నిందించడానికి ప్రయత్నం చేయడం లేదని, ఓటు వేయాల్సిన సందర్భం వస్తే ఆగమాగం కావద్దని, ఆలోచన చేసి వాస్తవం గమనించాలని ఆయన అన్నారు. అడ్డదిడ్డంగా మాట్లాడేవారికి శిక్ష విధించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నామని, ఆ తర్వాత తాము అధికారంలోకి వచ్చామని, తాము అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలోనే ఏదో చెడిపోయినట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఆయన అన్నారు. పిచ్చిపనులు చేసేవారికి ఎవరూ భయపడరని, వారికి వరంగల్ ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఒక్క మంచి సూచన కూడా చేయలేదని ఆయన అన్నారు.

రాబోయే మార్చి తర్వాత రైతులకు పగటి పూట 9 గంటలు కరెంట్ ఇస్తామని ఆయన చెప్పారు. 2018 నాటికి కరెంట్ పోవడమనే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. ఇంటింటికీ నీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని చెప్పిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని అడిగారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచినీటి పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు.

58 ఏళ్లు కాంగ్రెసు, టిడిపిలు పాలించాయని, వారు బంగారం పెడితే తాము చెడగొట్టినట్లు మాట్లాడుతున్నారని, నోటికి తాళం లేకుండా మాట్లాడుతున్నారని, రైతు సంక్షేమానికి పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నామని ఆయన రైతు సమస్యలను ప్రస్తావిస్తూ చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు.

రైతు సమస్యలను గత తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. మిషన్ కాకతీయను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. 58 పాలనలో తెలంగాణ టిడిపి, కాంగ్రెసు నాయకులు ముఖ్యమంత్రుల చుట్టూ తోకాడించుకుంటూ తిరిగారని, చెరువులను పట్టించుకోలేదని, చెరువులను పునరుద్ధరిస్తున్నామని ఆయన చెప్పారు.

 KCR made scathing attack against BJP and Congress

కెసిఆర్ ఏదైనా చెప్పిండంటే తల తెగి పడినా సరే రాజీ పడడని ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. కాళేశ్వరం బ్యారేజీకి త్వరలోనే తాను శంకుస్థాపన చేస్తానని, వరంగల్ జిల్లాలో రెండు పంటలు పండించుకునే పరిస్థితిని తెస్తానని ఆయన చెప్పారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు కూడా అదే రీతిలో నీరిస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణలో ప్రధానమైన నగరాలు నాలుగైదు ఉన్నాయని, వాటిలో అత్యంత ముఖ్యమైందని వరంగల్ అని ఆయన చెప్పారు. హైదరాబాదు తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్‌ను అద్భుతంగా అబివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు. ఎడ్యుకేషన్ హబ్ కింద మారుస్తామని ఆయన చెప్పారు. మూడు రకాల వస్త్రాలు వరంగల్‌లో ఉత్పత్తి అయ్యేలా టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రింగ్ రోడ్డు లాంటివాటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

సకల జనుల సమ్మెలో కెసిఆర్ ఎక్కడున్నాడని జైపాల్ రెడ్డి అనే మహా నాయకుడు అన్నాడని, రౌతు తీసుకుని తలకు కొట్టుకోవాలా, కెసిఆర్ ఉర్రూతలూగించాడని, జాతీయవాదిని ప్రాంతీయ వాదిని అని చెప్పుకున్న జైపాల్ ఎక్కడున్నాడో, కెసిఆర్ ఎక్కడ ఉన్నాడో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. జానా రెడ్డి కథ కూడా చెప్పాలని ఆయన అన్నారు. విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పదవి రాకపోవడంతో తెలంగాణ ఫోరం ఏర్పాటు చేసి, తనను రమ్మన్నాడని, తెలంగాణ కోసం కాదు మంత్రి పదవి కోసం పెట్టడం లేదని, దొంగ మీటింగ్‌కు తాను రానని చెప్పానని ఆయన చెప్పారు.

విజయభాస్కర్ రెడ్డి పిలిచి మంత్రి పదవి ఇవ్వగానే తోక ముడుచుకున్నారని ఆయన అన్నారు. జానా రెడ్డి ఉన్న పార్టీకి కర్రు వాత పెట్టి కాల్చాలని ఆయన అన్నారు. 16 నెలల్లో ఏం చేశావని కిషన్ రెడ్డి అడిగారని, ఢిల్లీలో వచ్చిన ప్రభుత్వం 16 నెలల్లో చేసిన ఒక్క మంచి పని కిషన్ రెడ్డి చెప్పగలరా అని అన్నారు. ఒక్క మంచి పని చేసి ఉంటే చెప్పు, తాను జైకొడుతానని ఆయన అన్నారు.

బీహార్ ప్రజలు తిప్పికొట్టారని ఆయన అన్నారు. ప్రజలు 16 నెలల్లో భయంకరంగా తిప్పికొట్టారని ఆయన అన్నారు. బీహర్‌లో ప్రజలు బిజెపికి షాక్ ఇచ్చారని ఆయన అన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి శాసనసభ్యులంతా రాజీనామా చేస్తే పారిపోయాడని ఆయన అన్నారు. నిజామాబాద్ వెళ్లి బిజెపి అభ్యర్థిని గెలిపించానని ఆయన అన్నారు. కొంత మంది దద్దమ్మలు పారిపోయారని తాను నిజామాబాద్‌లో చెప్పానని, దద్దమ్మ మీ పక్కనే ఉన్నారని అన్నారని, ఆ దద్దమ్మ వరంగల్‌కు వచ్చి మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు.

జైపాల్ రెడ్డి పదేళ్లు మంత్రి పదవిలో జోల పాడిన మాట వాస్తవం కాదా, జానా రెడ్డి మంత్రి పదవి ఇవ్వగానే రాజీ పడిన మాట వాస్తవం కాదా, రాజీనామా చేయకుండా కిషన్ రెడ్డి తప్పుకున్న మాట వాస్తవం కాదా అని ఆయన అన్నారు. కొంత మంది శిఖండులను పంపించి మంత్రుల సభకు పంపించి ఏదో జరిగినట్లు రాస్తున్నారని ఆయన అన్నారు. ఓట్ల కోసం అబద్ధాలు, అసత్యాలు, పనికిమాలిన మాటలు మాట్లాడాలా అని ప్రజలు అలోచించుకోవాలని ఆయన అన్నారు.

కాంగ్రెసు వాళ్లు మీటింగ్ పెట్టుకుని కరెంట్ ఎలా ఇస్తాడని తెలంగాణ కాంగ్రెసు నాయకులు మాట్లాడుకున్నారని, కెసిఆర్ మొండోడు తెస్తాడని అన్నారని, ఇంత కాలం మన పార్టీ ముఖ్యమంత్రులు ఎందుకు ఇవ్వలేదని అన్నారని ఆయన చెప్పారు. రాక్షసుడిలాగా రాత్రింబవళ్లు పనిచేస్తాడని, అన్నీ చేస్తాడని, వాళ్ల కాళ్ల కింద భూమి కదులుతోందని ఆయన అన్నారు.

60 ఏళ్ల పాలనలో చేసి ఉంటే ప్రజలకు బాధలు ఉండేవా, 16 నెలల్లో చేయడానికి వీలవుతుందా, 16 నెలల్లో చేయడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా అని వెంకయ్య నాయుడు అన్నారని ఆయన అన్నారు. ఢిల్లీలో ఒక్క మాట, ఇక్కడ ఒక్క మాట మాట్లాడుతారా కిషన్ రెడ్డి చెప్పాలని ఆయన అడిగారు.

నిజాం పాలనలో కూడా జరుపుకోని విధంగా ముస్లిం సోదరులు రంజాన్ తమ ప్రభుత్వ హయాంలో జరిపామని ఆయన చెప్పారు. రంజాన్ పండుగను మాదిరిగానే రాబోయే క్రిస్మస్ పండుగను జరుపుతామని ఆయన చెప్పారు. కొత్త రాష్ట్రమైనా అన్ని చూసుకుని ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. 2001లో తాను ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు నమ్మలేదని, తాను మారితే రాళ్లతో కొట్టి చంపండని చెప్పానని, కెసిఆర్‌ను నమ్మాలని, విశ్వసించాలని ప్రజలను కోరుతున్నానని, ఇచ్చిన హామీలను అమలు చేస్తానని ఆయన అన్నారు.

English summary
Telangana CM and Telangana Rastrta Samithi (TRS) president K Chandrasekhar made scathing attack on BJP and Congress at Warangal election meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X