వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీకంటే బెస్ట్ అని మోడీకి చెప్పా, కేసులు పెడతా: కేసీఆర్, బాబుపై ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికల గెలుపు పైన ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడారు. ఆయన విపక్షాల పైన దుమ్మెత్తి పోశారు. తెలంగాణకు ఏం కావాలో ప్రధాని మోడీకి చెప్పానని, చంద్రబాబు తమ పైన అవాస్తవాలు మాట్లాడవద్దని మండిపడ్డారు.

పాలేరు ఉప ఎన్నిక గెలుపు విపక్షాలకు చెంప పెట్టు అన్నారు. ఎన్నికల్లో తీర్పుతో ప్రజలు వారికి బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. విపక్షాలు కలెక్టర్‌ను, అధికారులను మార్పించాయని, ఇప్పుడు మేమే గెలిచామని, ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

విపక్షాలు ప్రభుత్వం మీద పోరాడటం సరికాదని, నేను ఓ సూచన చేస్తున్నానని, ప్రజా సమస్యల పైన పోరాడాలన్నారు. నిన్నగాక మొన్న బీజేపీ అధ్యక్షుడు అయిన డాక్టర్ కె లక్ష్మణ్ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారన్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.

KCR on palair bypolls

మోడీకి అన్నీ చెప్పా

కేంద్రం ఇచ్చిన నిధుల పైన ఆయన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఈ మధ్య తాను ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రధాని మోడీతో పలు అంశాలపై చర్చించానని, కరువు సాయం పెంచాలని కోరానని తెలిపారు. మేం మా రాష్ట్రంలో కేంద్రం చేసే దానికంటే ముందున్నామని ప్రధాని మోడీకి చెప్పానని తెలిపారు.

రాష్ట్రంలో వికలాంగులకు రూ.1500 పింఛన్, అందరికీ పింఛన్ రూ.1000, స్కూళ్లలో విద్యార్థులకు సన్నబియ్యం పెడుతున్నామని.. ఇలా ఎన్నో పథకాలను ప్రధాని మోడీకి వివరించానన్నారు. మీరు మాకు ఆ విషయాల్లో చేసేదేం లేదని, కరువు పారదోలేందుకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇవ్వాలని కోరానని చెప్పారు.

KCR on palair bypolls

కేంద్రం పథకాల కంటే మా పథకాలు బాగున్నాయని ప్రధాని మోడీకి చెప్పానని తెలిపారు. బీజేపీ నేతలు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయలకు సత్తా ఉంటే జాతీయ ప్రాజెక్టులు తీసుకు రావాలన్నారు.

అచ్చంపేట ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, టిడిపి, వైసిపి కలిసి పోటీ చేశాయని, కానీ అక్కడ మేమే గెలిచామన్నారు. ఈ రోజు పాలేరులోను సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి విపక్షాలు కలిశాయన్నారు. కానీ గతంలో వచ్చిన ఓట్లలో సగం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాలేదన్నారు.

ప్రజలు విచక్షణతో, ఆలోచించి ఓటేస్తారని చెప్పారు. ఇంకా 1947 రాజకీయాలు నడుపుతామని కాంగ్రెస్ అంటే కుదరదన్నారు. విపక్షాలు సమస్యల పైన పోరాటం చేయాలని, ప్రభుత్వం పైన కాదన్నారు. ఇక్కడ ఉన్నది పాపులర్ ప్రభుత్వం ఉందన్నారు.

ఈ 23 నెలల్లో మొదటి కొన్ని నెలలు విభజన సమస్యలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ మోస్ట్ హాపెనింగ్ స్టేట్ ఇన్ ఇండియా తెలంగాణ ప్రభుత్వంకు పేరు వచ్చిందన్నారు. ఏపీలో చంద్రబాబు, విపక్ష నేత జగన్‌లు అసత్యాలు చెబుతున్నారన్నారు.

చంద్రబాబు ఇదే తీరు

9 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఇష్టారీతిన చెప్పడం ఎంత వరకు సమంజసం అన్నారు. రూ.65వేల కోట్ల ఆదాయం వచ్చే హైదరాబాదును వదిలేశామని చంద్రబాబు అసత్యాలు చెప్పడం విడ్డూరమన్నారు. ఇలాంటి అబద్దాల మీద రాజకీయాలు నడిచే కాలం పోయిందన్నారు.

KCR on palair bypolls

పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని మరోసారి గెలిపించారని, తమిళనాడులో అన్నాడీఎంకేను గెలిపించారని, మంచిగా పని చేస్తే ప్రజలు గెలిపిస్తారన్నారు. అలాగే తెలంగాణలో ప్రజలు ఏకపక్షంగా ఉప ఎన్నికల్లో గెలిపిస్తున్నారన్నారు.

ఓటుకు నోటు ప్రస్తావన

డబ్బుల ద్వారానైనా మనం గెలుద్దామని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రయత్నించిన విషయం తెలుసునన్నారు. ఇది ప్రజలకు తెలుసునని చెప్పారు. పరోక్షంగా ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు. ప్రతిదానికి ఎడ్డెం అంటే తెడ్డెం అంటే సరికాదన్నారు. అలా అయితే మీ గౌరవం, రాష్ట్ర గౌరవం పోతుందన్నారు.

అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా నేను చెప్పేది రికార్డుల్లో ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రాజెక్టుల పైన ప్రజెంటేషన్ ఇచ్చానని చెప్పారు. కాంగ్రెస్ దానికి ఎందుకు గైర్హాజరయిందని ప్రశ్నించారు.

కేసులు పెడతాం

తమ పైన ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే ఇప్పటి దాకా వదిలిపెట్టామని, ఇక నుంచి కేసులు పెడతామని కేసీఆర్ చెప్పారు. అక్రమార్జన అంటే నిరూపించాలన్నారు. ప్రూవ్ చేయకుంటే మాత్రం కేసులు ఫేస్ చేయవలసి ఉంటుందని హెచ్చరించారు.

KCR on palair bypolls

పాలేరు ఉప ఎన్నికల్లో గెలుపు ద్వారా ప్రజలు తమకు మరింత ధైర్యం ఇచ్చారన్నారు. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. నారాయణఖేడ్, పాలేరులో ఎలాంటి సానుభూతి కనిపించలేదన్నారు. సానుభూతిని పక్కన పెట్టి ప్రజలు తెరాసను గెలిపించారన్నారు. అసాధారణ తీర్పు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

తెరాసకు అక్కడ 2014లో 4,140 ఓట్లు మాత్రమే వచ్చాయని, ఇప్పుడు 95,000 వేల ఓట్లు వచ్చాయన్నారు. తమకు 24 శాతం పైగా పెరిగిందన్నారు. ఇవన్నీ తమాషా చేస్తే వచ్చే ఓట్లు కాదన్నారు. ప్రజలు విచక్షణతో ఆలోచించి వేసే ఓటు అన్నారు. ఖమ్మం వైసిప ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరడం వల్ల కూడా గెలిచామన్నారు. ఈ గెలుపు అందరిదీ అన్నారు. ఈ గెలుపుతో మేం గర్వానికి పోకుండా వెళ్తామన్నారు.

ఏం జరగడం లేదా

తెలంగాణలో ఏం జరగడం లేదని కొందరు విమర్శిస్తున్నారని, కానీ ఏం జరగడం లేదా అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల్లో నెంబర్ వన్. పెట్టుబడులు ఆకర్షించడంలో నెంబర్ వన్‌గా ఉన్నామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద గుర్తింపు ఉన్న అమెజాన్ సంస్థ అమెరికా తర్వాత రెండో పెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. గూగుల్ రెండో అతిపెద్ద క్యాంపస్‌ను నిర్మిస్తోందన్నారు. ఫేస్‌బుక్ కూడా వచ్చిందన్నారు. యాపిల్ కూడా వచ్చిందన్నారు.

ఇప్పటి దాకా ఐటీలో బెంగళూరు నెంబర్ వన్ అయితే, ఇప్పుడు హైదరాబాద్ నెంబర్ వన్ అన్నారు. ఇన్ని జరుగుతున్నా ఏం జరగడం లేదని చెప్పడం విడ్డూరమన్నారు. వాస్తవాలు చెప్పి, ఇంకా జరగాల్సినవి ఏమైనా ఉంటే చెప్పాలన్నారు. నిర్మాణాత్మక సలహాలు ఇస్తే తీసుకుంటామన్నారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao on on palair bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X