హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒత్తిడి వచ్చింది కానీ, కన్నయ్యను అరెస్ట్ చేయొద్దని చెప్పా: కెసిఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చిన ఢిల్లీ జేఎన్‌యూకు చెందిన విద్యార్థి నాయకుడు కన్నయ్యను అరెస్ట్ చేయవద్దని తానే పోలీసులను ఆదేశించినట్లు సీఎం కెసిఆర్ తెలిపారు. వేముల రోహిత్ తల్లిదండ్రులను కలిసేందుకు కన్నయ్య వచ్చాడని.. అతడ్ని అడ్డుకోవద్దని, అరెస్ట్ చేయవద్దని ఇద్దరు నగర కమిషనర్లకు చెప్పానని తెలిపారు.

తనపై ఒత్తిడి వచ్చినప్పటికీ తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కన్నయ్య సభకు కూడా అనుమతి ఇచ్చామని తెలిపారు. ఓ దుర్ఘటన జరిగినప్పటికీ సభ సజావుగానే నిర్వహించుకున్నారని తెలిపారు. భావ వ్యక్తీకరించే అవకాశం ఉండాలనే సభకు అనుమతిచ్చామని చెప్పారు.

కన్నయ్యకు సైబరాబాద్ కమిషనర్ అనుమతిచ్చినప్పటికీ.. ఔటర్స్‌ను అనుమతించకుండా హెచ్ సియూ వీసీ ఆదేశాలు జారీ చేయడంతో కన్నయ్య వర్సిటీలోకి ప్రవేశించలేకపోయారని చెప్పారు.

 KCR response on HCU and OU incidents

రోహిత్ ఘటన బాధించింది, చర్యలుంటాయి

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన తనను ఎంతో బాధించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఇలాంటి దురదృష్ణకరమైన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వివక్షకు తావులేదని అన్నారు.

హెచ్‌సీయూ వీసీపై పలు ఆరోపణలున్నాయని చెప్పారు. గతంలో గతంలో అపాయింట్ అయిన వీసీలు ఇష్టానుసారం ప్రవర్తించారని అన్నారు. హెచ్‌సీయూలో చోటు చేసుకున్న ఘటనలపై సెర్చ్ కమిటీ వేశామని, నివేదికలు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో వీసీల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు.

గత ప్రభుత్వాల తీరు వల్లే వర్సిటీలకు గ్రాంట్స్ తగ్గిపోయాయని అన్నారు.
ప్రముఖుల రాకపై విమర్శలు రావడంతో తాను హెచ్‌సియూకి వెళ్లలేకపోయానని కెసిఆర్ వివరణ ఇచ్చారు. విద్యావిధానంపై చర్చిద్దామని తెలిపారు. వివక్షపూరిత వాతావరణం, ఘర్షణ వాతావరణం లేకుండా చూద్దామని అన్నారు.

హెచ్ సీయూలో వీసీ తిరిగి రావడంతోనే గొడవలు జరిగాయనే ఆరోపణలున్నాయని తెలిపారు. గొడవలు నేపథ్యంలో విద్యార్థులను తీవ్రంగా కొట్టారనే ఆరోపణలు కూడా వచ్చాయని అన్నారు.

వర్సిటీ సెక్యూరిటీ వారు కూడా ఖాకీ డ్రెస్సే వేసుకుంటారని చెప్పారు. విద్యార్థులను పోలీసులే కొట్టారని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారితో ఓ కమిటీని వేస్తున్నట్లు ప్రకటించారు. వీలైనంత త్వరలో నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వీసీని రీకాల్ చేయడం రాష్ట్ర పరిధి అంశం కాదని, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని కెసిఆర్ చెప్పారు. వీసీ రీకాల్ అంశంపై స్వయంగా తాను ప్రధానితో మాట్లాడతానిని సీఎం కెసిఆర్ తెలిపారు. రెండు మూడు రోజుల్లోగా ఈ అంశంపై చర్యలుంటాయని తెలిపారు. సభ తీర్మానం చేయాల్సినంత పెద్ద వ్యక్తి కాదని కెసిఆర్ అన్నారు.

జరిగిన పరిణామాలను పొడిగించడం సరికాదని, సిద్ధాంతాలంటూ రాద్ధాంతాలు చేయడం మంచిది కాదని అన్నారు. సభలో చర్చలు జరుగుతున్నది లైవ్ ఉంది కాబట్టి.. ఈ సమాచారం చేరేవారికి చేరే ఉంటుందని అన్నారు. వారు రియాలైజ్ అవుతారని అన్నారు.

ఏ ఘటన జరిగినా పోలీసులే టార్గెట్ అవుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ఆకొచ్చి ముళ్లు మీద పడినా.. ముళ్లొచ్చి ఆకు మీద పడినా అన్న చందంగా పోలీసుల పరిస్థితి ఉందని అన్నారు. వీసీ తిరిగి విధుల్లో చేరడంతో విద్యార్థులు నిరసన తెలిపి ఆందోళనకు దిగారని కెసిఆర్ చెప్పారు. ఒక వేళ పోలీసులు లేకుంటే.. వీసీని కొట్టి చంపితే ఎవరిది బాధ్యత అని ఆయన ప్రశ్నించారు. ఇది మరో సమస్య అవుతుందని అన్నారు.

పోలీసులు విద్యార్థులను ఆపక పోతే ఏం చేస్తున్నారని మళ్లీ ప్రశ్నిస్తారని అన్నారు. కన్నయ్య వచ్చినప్పుడు ఎలాంటి ఘర్షణలు జరగకుండా చూడాలని సైబరాబాద్ కమిషనర్‌ను ఆదేశించినట్లు.. ఆయన అలాగే చేశారని చెప్పారు. వర్సిటీలో మెస్, నీళ్లు, వైఫై కట్ చేయడం సరికాదని అన్నారు. వీటిపైనా విచారణ జరిపిస్తామని అన్నారు. అన్ని అంశాలపై కమిటీ వేస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓ యువకుడు చనిపోయాడని, అతడు ఎందుకు చనిపోయాడో తెలియని చెప్పారు. అతడు విద్యార్థి కాదని, అయితే అతడు విద్యార్థి అనుకుని ఇతర విద్యార్థులు ఆందోళనకు దిగారని చెప్పారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సంపత్ వెళ్లినప్పుడు.. అతని వాహనంపై దాడి జరగడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికీ ఆ ఘటనపై ఫిర్యాదు అందలేదని సీఎం తెలిపారు.

ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని సీఎం కెసిఆర్ చెప్పారు. హెచ్ సీయూ, ఓయూ ఘటనలపై విచారం వ్యక్తి చేసిన సీఎం.. దళితులు, బీసీలపై వివక్ష మంచిది కాదని అన్నారు. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనల్లో పోలీసుల పాత్ర ఉంటు చర్యలు తీసుకుంటామని, వీసీ రీకాల్ అంశంపై ప్రధానితో మాట్లాడతానని సీఎం కెసిఆర్ మరోసారి హామీ ఇచ్చారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Saturday responded on HCU and OU incidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X