వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దయనీయం టీఆర్ఎస్ పరిస్థితి: వచ్చే ఎన్నికల్లో 50 % మందికి టిక్కెట్లు అనుమానమే

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సాధనతోపాటు కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాన్ని అధికారాన్నిచేజిక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పరిస్థితి ఏడాదిన్నర తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దయనీయంగా ఉంటుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏడాది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సర్వేలు నిర్వహిస్తూ వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇటీవల అంతర్గతంగా నిర్వహించిన సర్వే వివరాలు ఒక సెక్షన్ మీడియాలో బహిర్గతం అయ్యాయి. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పరిస్థితి ఘోరంగా మారుతుందని ఆ సర్వేలో పాల్గొన్న ప్రజలు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ సర్వేను గత నెలలో నిర్వహించారని తెలుస్తున్నది. అయితే ఆ సర్వే నివేదిక ఒకటి, రెండు రోజుల క్రితమే బహిర్గతమైనట్లు చెప్తున్నారు.

ఈ సర్వే ప్రకారం నాలుగు జిల్లాల పరిధిలో టీఆర్ఎస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందని నిగ్గు తేలింది. ఆ జాబితాలో ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 2014 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం జలగం వెంగళరావు తనయుడు వెంకట్రావు మాత్రమే టీఆర్ఎస్ తరఫున ఎన్నికయ్యారు. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో జెడ్పీ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ నేతలంతా టీఆర్ఎస్ పార్టీలోకి వలస బాట పట్టారు. జెడ్పీ చైర్ పర్సన్ కవిత సహా కీలక నేతలంతా 'కారు' ఎక్కేశారు. తొలి నుంచి పార్టీలో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వెంకట్రావు, ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలను కాదని పార్టీ అధికారంలోకి వచ్చాక ఫిరాయించిన నేతలకే ప్రాధాన్యం ఇచ్చినవైనంపై చర్చ జరుగుతోంది.

KCR's Internal Survey Is Shocking To TRS?

పాలమూరు ప్రజలు విశ్వసిస్తారా?

ఇక హైదరాబాద్ పొరుగున ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు - రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు తదితర లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు భారీగా జరిగిన భూసేకరణపై ప్రజలు గుర్రుగా ఉన్నారని చెప్తున్నారు. భూసేకరణలో నిర్వాసితులంతా కారు గుర్తుకు ఓటేస్తారా? అన్న అనుమానాలు ఉన్నాయి. అనూహ్య రీతిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీని తుడిచి పెట్టేసిన టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే. అయితే టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన బాపురావు, రేఖా నాయక్ లకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు లభించడం సందేహమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలే 'కారు' ఎక్కిన మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్.. తన కొడుకును అసిఫాబాద్ నుంచి నిలిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బోథ్ నుంచి ప్రస్తుత ఎంపీ గొడెం నగేశ్ ఆశలు పెట్టుకున్నారు.

మెదక్, ఇందూరుల్లోనే బలంగా టీఆర్ఎస్

సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి చెందిన నిజామాబాద్ జిల్లాల్లోని స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కొన్ని నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వేలో తేలింది. ఇక రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్, దాన్ని ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కోలుకోలేని దెబ్బ తింటుందని చెప్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తోపాటు ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీ, మాదవరం క్రుష్ణారావు, తీగల క్రుష్ణారెడ్డి, ప్రకాశ్ గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డిలతోపాటు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తదితరులు టీడీపీ నుంచి కారెక్కిన వారే.

గమ్మత్తేమిటంటే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో బీజేపీ బలాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. స్థూలంగా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, బీజేపీ తన బలాన్ని పెంచుకోగలుగుతుందని అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఫిరాయింపులతో 90 స్థానాల బలం పెంచుకున్న టీఆర్ఎస్ కేవలం 45స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ స్వల్పంగా తన పరిస్థితిని మెరుగు పర్చుకుంటుందని సమాచారం. పూర్తిగా నామమాత్రంగా మారిన టీడీపీకి ఒక్క సీటు లభిస్తుందని, ఎంఐఎం తన బలాన్ని కాపాడుకుంటుందని అంటున్నారు.

లోక్ సభకు ముగ్గురు లేదా నలుగురే?

ఇక లోక్ సభ ఎన్నికల విషయానికి వస్తే టీఆర్ఎస్ మూడు, నాలుగు స్థానాల కంటే ఎక్కువగా గెలుచుకునే అవకాశాలు లేవని ఆ సర్వే వివరాలు చెప్తున్నాయి. మరో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే సీఎంగా కే చంద్రశేఖర్ రావు పనితీరు భేష్షుగ్గా ఉన్నదని, కేవలం ఎమ్మెల్యేల పనితీరుతోనే సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు భావిస్తున్నట్లు ఆ సర్వే సారాంశం. దీనికి తోడు ఎమ్మెల్యే స్థానాలు కూడా పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్.. వివిధ సామాజిక వర్గాలను అక్కున చేర్చుకునేందుకు పలు సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేశారని అంటున్నారు. పార్టీ వర్గాల కథనం ప్రకారం వచ్చే ఎన్నికల్లో 50 శాతం స్థానాల్లో అభ్యర్థుల మార్పు అనివార్యమని సమాచారం.

English summary
If the reports doing rounds in a section of media circles are to be believed, a latest survey commissioned by Telangana Rashtra Samithi president K Chandrasekhar Rao indicated that the party is going to fare very badly if the elections are conducted now. The survey, supposedly conducted in the month of August, got leaked to the media a couple of days ago. According to this survey, the TRS would be completely wiped out in at least four erstwhile districts --- Khammam, Adilabad, Nalgonda and Mahbubnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X