వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ రెడ్డి బంగారుతల్లిని అమలు చేయం, గవర్నర్ మా స్క్రిప్ట్ చదువుతారు: కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాము బంగారు తల్లి పథకాన్ని అమలు చేసే ప్రసక్తి లేదని, ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్‌నే గవర్నర్ చదువుతారని, టిఆర్ఎస్ స్క్రిప్ట్ గవర్నర్ ప్రసంగంలో ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం శాసన సభలో కుండబద్దలు కొట్టారు. గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు.

గవర్నర్ ప్రసంగంపై విపక్షాల తీరు సరికాదన్నారు. తెరాస మెనిఫెస్టోనే గవర్నర్ ప్రసంగంలో ఉంటుందన్నారు. ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్టునే గవర్నర్ చదువుతారని చెప్పారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని ప్రభుత్వమే తయారు చేసి ఇస్తుందని చెప్పారు.

మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాన్ని మాత్రమే గవర్నర్ చదువుతారని, దానిని మార్చే అధికారం ఆయనకు లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చెప్పేదే అంతిమ నిర్ణయమనే విషయం, విపక్షంలో నేడున్న ఒకనాటి అధికార పక్ష సభ్యులందరికీ తెలిసి కూడా విమర్శిస్తున్నారన్నారు.

KCR says no to implement Bangaru Thalli scheme

గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేసీఆర్ సమాధానం ఇచ్చారు. అభివృద్ధిపై తాము రెండేళ్లుగా ఎంతో కృషి చేస్తున్నామని, యాభై ఏళ్లుగా కొనసాగుతూ వచ్చిన దరిద్రం అంత త్వరగా పోదన్నారు. విపక్షాల నుంచి ఒక్కటంటే ఒక్క నిర్మాణాత్మక సలహా కూడా రాలేదన్నారు.

కాంగ్రెస్ హయాంలో పారిశ్రామికవేత్తలు కరెంట్ కోసం ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేశారని, ఇప్పుడు తాము 24 గంటలూ విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఆపరేషన్ భగీరథ అంటే జీవన్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

కేజీ టు పీజీ తప్ప.. మిగతా అన్నింటినీ దాదాపు 99 శాతం పనులు పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. గ్రామాలకు సింగిల్ ఫేజ్ విద్యుత్ నిరంతరాయం అందిస్తున్నామన్నారు. తమ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, వీరు మాత్రం (విపక్షాలు) బాధపడుతున్నారన్నారు.

మిషన్ భగీరథ మీరు ఎందుకు అమలు చేయలేదు

మిషన్ భగీరథ పైన ఆరోపణలు సరికాదన్నారు. రూ.2వేల కోట్లతోనే పూర్తి చేయవచ్చునని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, మరి అలా పూర్తి చేస్తే పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఆ రోజు మీ జ్ఞానం ఏమైందన్నారు. కెసిఆర్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కెసిఆర్ మాట్లాడుతూ.. ఒక్క పథకానికే ఇలా అడ్డుకుంటున్నారని, ఇంకా చాలా ఉందని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథను అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని చెప్పారు. త్వరలో తండాలన్నీ పంచాయతీలుగా మారుతాయన్నారు.

KCR says no to implement Bangaru Thalli scheme

సంక్షేమానికి తాము పెద్ద పీట వేశామని చెప్పారు. మిషన్ భగీరథ పూర్తయితే తమకు ఓట్లు రావని కాంగ్రెస్ పార్టీ భయపడుతోందన్నారు. ఎయిర్ పోర్టుకులింక్ లేకుండా మెట్రో లైనును ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని ఎద్దేవా చేశారు. చీఫ్ ఇంజినీర్లు కాంట్రాక్టర్లకు సలాం కొట్టేలా కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు.

కిరణ్ తెచ్చిన బంగారు తల్లిని అమలు చేయం

బంగారు తల్లి పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. దీనిపై కెసిఆర్ మాట్లాడుతూ.... బంగారు తల్లి పథకాన్ని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకు వచ్చిందన్నారు. ఓట్ల కోసం దానిని తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు.

మేం బంగారు తల్లి పథకాన్ని అమలు చేయమని ఖరాఖండిగా చెబుతున్నామన్నారు. బంగారు తల్లి కింద డబ్బు వేస్తే ఎప్పుడు వస్తుందో, ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదన్నారు. కానీ మేం అమ్మాయిలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేస్తున్నామన్నారు. మేం ఉన్నది చెబుతున్నాం కాబట్టే ప్రజలు తమను నమ్ముతున్నారని చెప్పారు. కాగా, బంగారు తల్లి పథకాన్ని కిరణ్ కుమార్ రెడ్డి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.

డబుల్ బెడ్ రూం సాహసంతో కూడుకున్న పని

డబుల్ బెడ్ రూం ఇళ్లు సాహసంతో కూడుకున్న పని అన్నారు. తాము 60వేల ఇళ్లు శాంక్షన్ చేశామన్నారు. తాము శాంక్షన్ చేసిన ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు.. కాంగ్రెస్ పథకం తెచ్చిన ఆరు ఇళ్లకు సమానమని చెప్పారు. పేదల పక్షాన ఉన్నందునే ప్రజలు తమకు గౌరవం ఇస్తున్నారన్నారు.

గుడిసెలు లేని రాష్ట్రంగా చేసి ఉంటే మాకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టే అవకాశం ఉండకపోయి ఉండేదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. గత కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు.

సమైక్య పాలనలో చెరువులు నాశనం చేశారు

సమైక్య రాష్ట్రంలో సమైక్య పాలకుల వల్ల 75వేల చెరువులు సర్వనాశనం అయ్యాయన్నారు. కాకతీయ రెడ్డి రాజులు వాటిని ప్రజల కోసం కట్టించారన్నారు. సమైక్య పాలనలో అవి దారుణంగా తయారయ్యాయన్నారు. సుమారు 25వేల చెరువులు అడ్రస్ లేకుండా పోయాయన్నారు.

తమ ప్రభుత్వం వచ్చాక చెరువుల పూర్వ వైభవంకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ మార్చి నాటికి 8వేల చెరువులు బాగుపడుతాయన్నారు. ఇప్పటికే పలు చెరువులు బాగు చేశామన్నారు. చెరువులు తెలంగాణకు జీవన ధార అన్నారు.

రైతు రుణమాఫీ

రైతు రుణమాఫీ తలకు మించి భారమైన మేం హామీ ఇచ్చామన్నారు. ఇప్పటికే 50 శాతం రుణమాఫీ చేశామన్నారు.

ఐటీలో ప్రశంసలు

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, కేంద్రం తదితరులు ఐటీ విషయంలో తెలంగాణను ప్రశంసించాయని చెప్పారు. గూగుల్ కార్యాలయం ఇప్పటి వరకు అమెరికాలో ఉందని, ఇప్పుడు హైదరాబాదులో నిర్మించనున్నారన్నారు. అమెజాన్ కూడా హైదరాబాద్ రానుందన్నారు. ఏరోస్పేస్‌లో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నామన్నారు.

పోలీసులు మామూళ్లు తీసుకోవడం లేదు

గతంలో వలే పోలీసులు ఇప్పుడు మామూళ్లు తీసుకోవడం లేదన్నారు. గతంలో వలే పోలీసులు మామూళ్లు తీసుకుంటున్నారని విపక్షాలు భావిస్తే.. మీరు అలాగే ఉండండని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ పేదలకు ఉండే ఏకైక రవాణా సదుపాయమని, దానిని మరింత పటిష్టం చేస్తామన్నారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు వస్తామన్నారు.

English summary
KCR says no to implement Bangaru Thalli scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X