దీక్షిత్ రెడ్డి కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు .. కిడ్నాపర్ ను ఉరి తీయాలన్న ఎమ్మెల్యే సీతక్క
మహబూబాబాద్ లో జర్నలిస్టు కుమారుడు దీక్షిత్ రెడ్డి హత్య నేపథ్యంలో మహబూబాబాద్ పట్టణం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే సమయంలో పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి . నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ అయిన తొమ్మిదేళ్ల దీక్షిత్ రెడ్డి ని కిడ్నాపర్ అత్యంత కిరాతకంగా చంపడంతో బాలుడు కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. బిడ్డ క్షేమంగా తిరిగి ఇంటికి వస్తాడు అని ఆశించిన తల్లిదండ్రులకు బాలుడి మరణం తీవ్ర దుఃఖాన్ని మిగిలించింది. దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసిన వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేసిన గంట , రెండు గంటల లోపే హత్య చేసి, ఆ తరవాత డబ్బుల కోసం ఫోన్ కాల్స్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కిడ్నాప్ చేసిన బాలుడ్ని పెట్రోల్ పోసి దారుణంగా ... వదిలేది లేదన్న జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో చాలా అనుమానాలు
డబ్బుల కోసమే బాలుడిని కిడ్నాప్ చేస్తే అంత వెంటనే బాలుడిని చంపేవాడు కాదని, బాలుడిని హతమార్చిన తర్వాత ఇంటర్నెట్ కాల్స్ ద్వారా డబ్బులు డిమాండ్ చేయడంతో కేసు పక్కదారి పట్టినట్లుగా మహబూబాబాద్ పట్టణంలో పెద్ద చర్చ జరుగుతోంది. బాలుడు తండ్రి జర్నలిస్టు కావడంతో, ఈ హత్య వెనుక ఇంకేదైనా కుట్రకోణం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ ,హత్య కేసు రిమాండ్ రిపోర్ట్ ను రూపొందించిన పోలీసులు పలు కీలక విషయాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

డింగ్ టాక్ యాప్ ద్వారా ఫోన్లు చేసిన కిడ్నాపర్ .. బాలుడి కిడ్నాప్ ఇలా
ఏడాది నుండి నిందితుడు డింగ్ టాక్ అనే యాప్ ను వాడుతున్నట్లు గా పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారానే బాలుడి తల్లిదండ్రులకు మంద సాగర్ ఫోన్ చేశాడని, డబ్బులు డిమాండ్ చేసాడని, దీక్షిత్ రెడ్డి తండ్రి రంజిత్ రెడ్డిని బెదిరించాడని పేర్కొన్నారు. పెట్రోల్ బంకు కి వెళ్దామని మంద సాగర్ బాలుడిని తీసుకెళ్లినట్లుగా పేర్కొన్న పోలీసులు, తెలిసిన వ్యక్తి కావటంతో వెళ్ళాడని పేర్కొన్నారు . మంచినీళ్లలో నిద్రమాత్రలు కలిపి బాలుడితో తాగించాడని, బాబు స్పృహలోకి వచ్చే లోపే హత్య చేశాడని పేర్కొన్నారు.

కిడ్నాపర్ ను అలాగే చంపాలంటున్న దీక్షిత్ రెడ్డి తల్లి
మరోపక్క దీక్షిత్ రెడ్డి ని అత్యంత కిరాతకంగా హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టి కనీసం కడసారి గుండెలకు హత్తుకొనేలా కూడా లేకుండా చేశారని దీక్షిత్ రెడ్డి తల్లి కన్నీరుమున్నీరవుతోంది . తన కొడుకు ని ఎలా చంపారో కిడ్నాపర్ ను అలాగే చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తుంది . దీక్షిత్ రెడ్డి హత్య ఘటన తో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క దీక్షిత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. నిన్న రాత్రి మహబూబాబాద్ కు వెళ్ళిన ఆమె వారి కుటుంబానికి తన సానుభూతి తెలిపారు .

బాలుడ్ని చంపిన కిడ్నాపర్ ను ఉరితీయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్
పెట్రోల్ పోసి చిన్న పిల్లవాడిని చంపిన కిడ్నాపర్ ను ఉరితీయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.డబ్బుల కోసం చిన్న పిల్లలను హతమార్చడం బాధాకరమని ఆమె అభిప్రాయపడ్డారు. కిడ్నాపర్ సాగర్ తో పాటు అతనికి సహకరించిన నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని కోరారు సీతక్క. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సీతక్క సూచించారు. దీక్షిత్ రెడ్డి మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.