హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెబ్బులిని లేపొద్దు, సంగతి చూస్తా: చంద్రబాబు, జగన్‌లకు కేసీఆర్ హెచ్చరిక

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పడుకున్న బెబ్బులిని లేపి గొడవ పెట్టుకోవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రా నేతలకు హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లో కేసీఆర్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తాము పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో గొడవ పడాలని అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ మా జోలికి వస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. మీ చిల్లర రాజకీయాలు తన దగ్గర పనిచేయవని స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు చంద్రబాబు, జగన్ సంగతి చూస్తానని కేసీఆర్ హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నేతల సంగతి తెలుసునని పరోక్షంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైయస్ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇవాళ శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరారో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ దీక్ష చేయడం, ఏపీ కేబినెట్ తీర్మానం చేయడం సరికాదన్నారు.

మేము మాత్రమే బతకాలి.. మీరు బతకొద్దు అనే ఉద్దేశంతో ఏపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి, కృష్ణా జలాలు ఎలా వాడుకోవాలో చంద్రబాబుకు, జగన్‌కు తెలియడం లేదు. తన దగ్గర నాటకాలాడవద్దని ఆయన హితవు పలికారు. తెలంగాణలో ఉన్న అంతో ఇంతో మర్యాదని పొగొట్టుకోవద్దని ఏపీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రస్తావించారు.

 Khammam MP Ponguleti Srinivas Reddy joined in trs

తెలంగాణ ప్రజల ప్రయోజనాలతో ఆటలాడుకోవాలని చూస్తే... తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. పాలమూరు ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయమే అని ఆయన గుర్తు చేశారు. మా వాటా ప్రకారం నీళ్లు వాడుకుంటామని కేసీఆర్ తెలిపారు.

గోదావరి నీళ్లు ఎలా ఉపయోగించుకోవాలో తెలివిలేని మీరు తెలంగాణ మీద పడి ఏడవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. మీకు చేత కాకుంటే చెప్పండి, గోదావరి నీరు ఎలా వినియోగించుకోవాలో వివరిస్తానని ఆయన అన్నారు. రాజకీయ అవసరాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టొద్దని అన్నారు.

368 టీఎంసీల కృష్ణా జలాలు, 950 టీఎంసీల గోదావరి జలాలు తెలంగాణ వాడుకోవచ్చని గతంలోనే అధికారికంగా జీవో జారీ చేశారని గుర్తు చేశారు. జీవో ప్రకారమే గోదావరి, కృష్ణా జలాల వినియోగానికి ప్రాజెక్టులు కడుతున్నామని తెలిపారు. గతంలో జరిగిన తప్పులు జరగొద్దని, ఆకుపచ్చ తెలంగాణ కోసమే పని చేస్తున్నామని స్పష్టం చేశారు.

గోదావరి నదిలో రెండు రాష్ర్టాలకు సరిపోగా ఇంకా మిగులు జలాలు ఉంటాయన్నారు. ఇదే విషయాన్ని తాను అమరావతి వెళ్లినప్పుడు చంద్రబాబుతో గంట సేపు చర్చించానని గుర్తు చేశారు. ఏపీకి నిజంగా నీళ్లు కావాలనుకుంటే.. జగన్, చంద్రబాబు కుట్రలు మానుకోవాలన్నారు.

వీరిద్దరికి ప్రజల క్షేమం పట్టదు, గోదావరిలో నీళ్లు తీసుకునే తెలివి చంద్రబాబుకు లేదన్నారు. సహకరిస్తామన్నా కూడా కుట్రలు చేయడం సరికాదన్నారు. ఉన్న మర్యాద పోగొట్టుకోవద్దు అని సూచించారు. ఇరు రాష్ర్టాలు గోదావరి జలాలు సంపూర్ణంగా వినియోగించుకునే అవకాశం ఉందన్నారు.

English summary
Khammam MP Ponguleti Srinivas Reddy joined in trs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X