కృష్ణా - గోదావరి అనుసంధానానికి తెలంగాణ ఓకే?: 17న ఢిల్లీలో సమీక్ష

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి మూడేళ్లు దాటింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ముందే నదుల అనుసంధానం కుదరనే కుదరదని టీఆర్ఎస్ చీఫ్, ప్రస్తుత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుండబద్ధలు కొట్టారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పూర్తయిన తర్వాతే నదుల అనుసంధానంపై ఒక నిర్ణయానికి వస్తామని సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా చెప్పారు. కాగా, కేంద్రంలోని జల సంఘం మాత్రం కృష్ణా, గోదావరి, మహానది నదుల అనుసంధానం ద్వారా తమిళనాడులోకి కావేరీ పరివాహక ప్రాంతానికి నీటి మళ్లింపునకు అధ్యయనం చేసిన తర్వాత పథకాన్ని రూపొందించింది. అయితే భాగస్వామ్య రాష్ట్రాలైన ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సీఎంలతో సమావేశమైన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని కూడా పేర్కొన్నది. 

తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తన్నీరు హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు అందుకు ఊపునిస్తున్నాయి. శుక్రవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో 16,365 ఎకరాలకు సాగునీరు అందించే భక్త రామదాసు రెండో దశ నుంచి గోనెతండా వద్ద నీటిని విడుదల చేసిన తర్వాత కాకరవాయిలో జరిగిన సభలో మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా నుంచే రాష్ట్రంలో నదుల అనుసంధానం మొదలవుతుందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతోనే కృష్ణా, గోదావరి జలాల అనుసంధానం సాకారం కాబోతోందన్నారు.

 భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాలు వెల్లడించాల్సిందే

భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాలు వెల్లడించాల్సిందే

గోదావరి నదిపై అకినేపల్లి వద్ద నుంచి తమిళనాడులోని కావేరిపై గ్రాండ్‌ ఆనకట్ట వరకు నీటిని మళ్లించే అనుసంధానంపై ఈ నెల 17న కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ చర్చించనున్నది. 247 టీఎంసీల నీటి మళ్లింపు లక్ష్యంగా ప్రతిపాదించిన ఈ అనుసంధానంపై కేంద్రం ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతోపాటు భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు 17న ఢిల్లీలో నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సమావేశంలో వివరంగా చర్చించనున్నది.

 1317 టీఎంసీల నీరు మళ్లించాలన్నది ప్రభుత్వ లక్ష్యం

1317 టీఎంసీల నీరు మళ్లించాలన్నది ప్రభుత్వ లక్ష్యం

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ, అన్ని రాష్ట్రాల అధికారులు, జలవనరుల మంత్రిత్వ శాఖ, జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ), జాతీయ జలసంఘం అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. నదుల అనుసంధాన ప్రణాళిక ప్రకారం మహానది -గోదావరి- కృష్ణా- పెన్నా- కావేరి అనుసంధానం ద్వారా 1,317 టీఎంసీల నీటిని మళ్లించాలన్నది లక్ష్యం. ఇందులో మహానది- గోదావరి, ఇచ్చంపల్లి- నాగార్జునసాగర్‌, ఇచ్చంపల్లి- పులిచింతల, పోలవరం- విజయవాడ, ఆలమట్టి- పెన్నా, శ్రీశైలం- పెన్నా, నాగార్జునసాగర్‌- సోమశిల, సోమశిల- గ్రాండ్‌ ఆనకట్ట, కావేరి- వైగయి- గుండార్‌ వరకు తొమ్మిది అనుసంధానాలు ఉన్నాయి.

 పూర్తిగానీ ఇచ్చంపల్లితో ముందుకు పడని అనుసంధానం

పూర్తిగానీ ఇచ్చంపల్లితో ముందుకు పడని అనుసంధానం

నదుల అనుసంధానంలో భాగంగా ఒడిశాలోని మహానదిపై మణిభద్ర డ్యామ్‌, తెలంగాణలో గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బ్యారేజి నిర్మించి కావేరి నదిపై ఉన్న గ్రాండ్‌ అనకట్ట వరకు నీటిని మళ్లించాలన్నది లక్ష్యం. ఇందుకోసం తొమ్మిది అనుసంధానాలను కేంద్రం ఏళ్ల తరబడి చర్చించినా కొలిక్కి రాలేదు. అంతర్రాష్ట్ర సమస్యలు, ముంపు తదితర కారణాల వల్ల మణిభద్ర, ఇచ్చంపల్లిల నిర్మాణం జరగలేదు. ఈ నేపధ్యంలో గోదావరి నుంచి కావేరికి నీటిని మళ్లించేందుకు జాతీయ జల అభివృద్ధి సంస్థ రెండు ప్రత్యామ్నాయాలను ముందుకు తెచ్చింది. మహానది నుంచి మిగులు జలాలు తేలేకపోవడం, ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకపోవడంతో ఇవేవీ ముందుకు సాగలేదు. ఈ నేపధ్యంలో తొమ్మిది అనుసంధానాలను రెండుగా మార్చాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఇందులో మొదటిది ఇంద్రావతి ఉపనది నుంచి గోదావరి నీటిని కావేరి వరకు మళ్లించేందుకు మూడు అనుసంధానాలు చేపట్టడం. దీనికోసం గోదావరిపై అకినేపల్లి నుంచి కృష్ణాపై ఉన్న నాగార్జునసాగర్‌ వరకు, అక్కడి నుంచి పెన్నాపై ఉన్న సోమశిల వరకు, సోమశిల నుంచి కావేరిపై ఉన్న గ్రాండ్‌ ఆనకట్టకు నీటిని మళ్లించాలి.

 కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించాలని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్లు

కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించాలని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్లు

సుమారు 12 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడంతోపాటు గ్రాండ్‌ ఆనకట్ట వరకు 50 టీఎంసీల నీటిని మళ్లించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ ప్రతిపాదనపై నివేదికను అన్ని రాష్ట్రాలకు పంపి అభిప్రాయాలను కోరింది. 17న జరిగే సమావేశంలో రాష్ట్రాలు అధికారికంగా అభిప్రాయాలను వెల్లడించాలి. ఇప్పటివరకు తమ వైఖరి ఏమిటన్నది తెలుగు రాష్ట్రాలు చెప్పలేదు ఉమ్మడి ఏపీలో చేపట్టిన దుమ్ముగూడెం- నాగార్జునసాగర్‌ టేల్‌పాండ్‌ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా ప్రతిపాదించిన అనుసంధానం దీనికి ప్రత్యామ్నాయంగానే ఉందని, తెలంగాణకు ప్రయోజనం లేనందున దీన్ని అంగీకరించవద్దని అంతర్‌రాష్ట్ర జలవనరుల శాఖ సమావేశంలో విశ్రాంత ఇంజినీర్లు సూచించారు.

 తాజా ప్రతిపాదనల్లో 165 టీఎంసీల నుంచి 247 టీఎంసీల నీరు మళ్లింపు

తాజా ప్రతిపాదనల్లో 165 టీఎంసీల నుంచి 247 టీఎంసీల నీరు మళ్లింపు

నదుల అనుసంధానంలో భాగంగా జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించిన అకినేపల్లి- నాగార్జునసాగర్‌ లింకు.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన దుమ్ముగూడెం- నాగార్జునసాగర్‌ టేల్‌పాండ్‌కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. గతంలో దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి నీటిని మళ్లించేలా టేల్‌పాండ్‌ ప్రాజెక్టు చేపట్టారు. కొత్తగా ప్రతిపాదించిన అకినేపల్లి బ్యారేజి.. తుపాకులగూడెం- దుమ్ముగూడెం ఆనకట్టలకు మధ్యలో ఉంది. దుమ్ముగూడెం పైభాగంలో అకినేపల్లి ఉన్నందున కాలువ ప్రవాహ మార్గం గతంలో చేపట్టిన దానికి సమాంతరంగా ఎగువ భాగం నుంచి వెళ్తుంది. గతంలో 80 రోజుల్లో 165 టీఎంసీల నీటిని మళ్లించేలా చేపట్టగా, ఇప్పుడు 143 రోజుల్లో 247 టీఎంసీలు మళ్లించాలని ప్రతిపాదించారు. మొదటి దశలో గోదావరి- పెన్నా- పాలార్‌- కావేరి అనుసంధానం. రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా మార్గమధ్యలో వినియోగించుకొంటూనే కావేరికి నీటిని మళ్లించడం. తొలి దశలో అకినేపల్లి (గోదావరి)- నాగార్జునసాగర్‌ (కృష్ణా), కృష్ణా (నాగార్జునసాగర్‌)- పెన్నా (సోమశిల), పెన్నా (సోమశిల)- కావేరి (గ్రాండ్‌ ఆనకట్ట) అనుసంధానాన్ని ప్రతిపాదించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Krishna and Godavari inter link will starts from Khammam District, says ministers Harish and Tummala

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి