అన్ని సమస్యలకు పీఎం మోడీ ‘విజన్’ కొరతే కారణం: మరోసారి కేంద్రంపై కేటీఆర్ విమర్శనాస్త్రాలు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలపై మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, బొగ్గు కొరత సమస్యపై ఈ తెలంగాణ మంత్రి స్పందించారు.
బీజేపీ పాలనలో బొగ్గు, ఆక్సిజన్, ఉద్యోగాలు, కరెంట్, ఉపాధి, నిధులకు కొరత ఏర్పడిందని కేటీఆర్ విమర్శలకు గుప్పించారు. 'బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత.. అన్ని సమస్యలకు మూలం ప్రధాని నరేంద్ర 'మోడీకి విజన్ కొరత' అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎన్పీఏ గవర్నమెంట్ ఎమేజింగ్ పర్ఫమెన్స్ అంటూ ఎద్దేవా చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీలో కూడా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఇతర మంత్రులు, నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలపై తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
బీజేపీ పాలనలో *బొగ్గు కొరత*
— KTR (@KTRTRS) May 2, 2022
కరోనా టైంలో *ఆక్సిజన్ కొరత*
పరిశ్రమలకు *కరెంట్ కొరత*
యువతకు *ఉద్యోగాల కొరత*
గ్రామాల్లో *ఉపాధి కొరత*
రాష్ట్రాలకిచ్చే *నిధుల కొరత*
అన్ని సమస్యలకు మూలం PM
*మోడీకి విజన్ కొరత*
NPA Govt’s amazing performance 👏 pic.twitter.com/N5oMBuVeDF
మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలు సామాన్యుల పట్ల వారి ఆవేదనను ప్రతిబింబిస్తున్నాయని కవిత ట్వీట్లో పేర్కొన్నారు. ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర రూ.102 పెంచడం.. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇది రెండో అతిపెద్ద పెంపు అని కవిత అన్నారు. ''ప్రజలు దుకాణాలు మూసేసి ఇంట్లో కూర్చోవాలని ప్రభుత్వం ఏం ఆశిస్తోంది'' అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కుమార్తె కవిత వ్యాఖ్యానించారు.
గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ పై సబ్సిడీని భరించాల్సిన కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతోందని మండిపడ్డారు. కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెంచడం ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్యులపై ఆర్థిక భారం పెంచుతుందని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.