మీరు చేస్తే కార్పోరేటర్లే.. తాము తలుచుకుంటే ఎమ్మెల్యేలే వస్తారంటున్న బీజేపీ.. నిజమేనా?
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జూలై 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జేపీ నడ్డా హైదరాబాద్ కు చేరుకోవడంతో ప్రారంభమవుతాయి. నేడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి సంబంధించి జేపీ నడ్డాను స్వాగతిస్తూ భారీ ర్యాలీ నిర్వహించి జూలై 2,3 తేదీలలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో మైలేజ్ తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు బిజెపి నేతలు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు కారెక్కిన బీజేపీ నేతలు
ఇక ఇదే సమయంలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న ప్రధాని మోడీ ని టార్గెట్ చేస్తూ, బీజేపీకి షాక్ ఇవ్వాలని టిఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్ బిజెపి నేతలకు గాలం వేస్తున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల కు ముందు బిజెపి నుండి నలుగురు కార్పొరేటర్ లను కార్ ఎక్కించారు.

బీజేపీకి షాక్ ఇచ్చిన మంత్రి కేటీఆర్
హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్ర నగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధుజ గౌడ్, కౌన్సిలర్ ఆశీస్సులు టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు రెడీ అయిన బీజేపీకి షాక్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. చాప క్రింద నీరులా పని చేసుకుపోయిన గులాబీ నేతలు గట్టిగానే బీజేపీని దెబ్బ కొడుతున్నారు.

మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ జిహెచ్ఎంసి కార్పొరేటర్ లతో ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారిని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కార్పొరేటర్లు ఎమ్మెల్యేల తరహాలో పనిచేయాలని సూచించారు. అయితే ఆ కార్పొరేటర్లలో నలుగురు కార్పొరేటర్లు జంప్ జిలాని అనడం బిజెపికి ఊహించని షాక్ అనే చెప్పాలి. కానీ తెలంగాణలో టిఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న కమలదళం జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది.

తాము తలచుకుంటే ఎమ్మెల్యేలే వస్తారంటున్న బీజేపీ..
అయితే బిజెపి నుండి కేవలం కార్పొరేటర్లనే టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని, కానీ తాము తలుచుకుంటే టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలనే బిజెపి బాట పట్టిస్తామని బిజెపి నేతలు హెచ్చరిస్తున్నారు. అనవసరంగా బిజెపిని రెచ్చగొడుతున్నారని మండిపడుతున్నారు. బిజెపి నుంచి సీనియర్ నాయకులను కానీ, ఎమ్మెల్యేలను కానీ పార్టీ మార్చే సత్తా టీఆర్ఎస్ పార్టీకి లేదని తేల్చి చెప్తున్నారు. తాము ఆపరేషన్ ఆకర్ష మొదలు పెడితే గులాబీ నేతలు గిజ గిజ కొట్టుకోవలసిందేనని చెబుతున్నారు. ఏ ధీమాతో బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలు చెప్తున్నారు అనేది తెలియాల్సి ఉంది.

అదును చూసి బీజేపీ దెబ్బ కొడుతుందా ? నిజమేనా
మరోవైపు బండి సంజయ్ బిజెపి పేరు వింటేనే వణుకు పుడుతోందని, మోడీ ఫోటో కనబడితేనే బెరుకు కనిపిస్తోందని టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. పార్టీలో చేరికలపై ప్రస్తుతం సైలెంట్ గా ఉంటున్నా అదును చూసి దెబ్బ కొట్టటం పక్కా అని చెప్తునారు. మరి బీజేపీ చెప్పే మాటల్లో వాస్తవం ఎంతో ముందు ముందు తెలియనుంది.