రాహుల్ గాంధీ ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడు; హైదరాబాదీ బిర్యాని తిని వెళ్ళిపోతాడు: కేటీఆర్ సెటైర్లు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది.రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం నాడు వరంగల్ లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్నారు. రైతు డిక్లరేషన్ ను ప్రకటించి, తాము అధికారంలోకి వస్తే రైతు సంక్షేమం కోసం ఏం చేస్తామో వివరించారు. ఇదే సమయంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీపై, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

వరంగల్ పర్యటనలో కేటీఆర్.. రాహుల్ గాంధీ టార్గెట్ గా విమర్శలు
రాహుల్ గాంధీ పర్యటన నేపధ్యంలో టీఆర్ఎస్ మంత్రులు కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు . తాజాగా వరంగల్ పర్యటనలో ఉన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ గీసుకొండ మండలం హవేలీ లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్ టెక్స్టైల్ పరిశ్రమకు భూమి పూజ చేసి అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సభా వేదికగా రాహుల్ గాంధీ పై విరుచుకుపడ్డారు.

రాహుల్ గాంధీకి వడ్లకు, ఎడ్లకు తేడా తెలియదు
అసలు రాహుల్ గాంధీకి వ్యవసాయం అంటే ఏంటో తెలియదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి ఏదో పేపర్ రాసిస్తే అది చదివి వెళ్లిపోయారని మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. కొందరు టూరిస్టులు వస్తారు పోతారు అంటూ వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ రాహుల్ గాంధీకి వడ్లకు, ఎడ్లకు తేడా తెలియదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో దమ్ బిర్యాని తింటారు.. వెళ్ళిపోతారు అంటూ ఎద్దేవా చేశారు. మోడీ పాలనలో సిలిండర్ల ధర వెయ్యి రూపాయలు దాటిందని మండిపడిన మంత్రి కేటీఆర్, ఎంత మంది వచ్చి వెళ్లినా రాష్ట్రానికి పనిచేసే నేతలే కావాలంటూ వ్యాఖ్యలు చేశారు.

నాలుగు డైలాగులు కొట్టాలి అవతల పడాలి అనేదే వారి ప్రణాళిక
ఎవరో చెబుతున్న మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కేటీఆర్ పేర్కొన్నారు. రోజుకొకరు వస్తున్నారని, నిన్నగాక మొన్న ఒక ఆయన మహబూబ్ నగర్ కి వచ్చి వెళ్ళాడని, నిన్న ఒకాయన వరంగల్ కు వచ్చాడని పేర్కొన్న మంత్రి కేటీఆర్ ఏదో పేపర్ మీద రాసి ఇస్తే నాలుగు డైలాగులు కొట్టాలి అవతల పడాలి అనేదే వారి ప్రణాళిక అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల పర్యటనలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్టు కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణా ప్రజలు, భవిష్యత్ తరాల కోసమే కేసీఆర్ తాపత్రయం
తెలంగాణ ప్రజానీకం, భవిష్యత్తు తరాలు బాగుండాలని సీఎం కెసిఆర్ ఆలోచిస్తున్నారని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చూస్తున్నారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రగతి పథంలో దూసుకెళ్తున్న రాష్ట్రాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని కేసీఆర్ తాపత్రయ పడుతున్నారు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మన పిల్లల భవిష్యత్తు కోసం ముందుకు వెళ్తున్నామని పేర్కొన్న కేటీఆర్ టెక్స్టైల్ పార్క్, ఫార్మాస్యూటికల్ పార్క్, మెడికల్ డివైసెస్ పార్క్, ఆసియా ఖండంలోనే పెద్దదైన లైఫ్ సైన్సెస్ జీనోమ్ క్లస్టర్ ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం అంటూ పేర్కొన్నారు.