వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వసతులకు దూరంగా వర్శిటీలు: గవర్నర్‌తో భేటీలోనైనా పరిష్కారం లభిస్తుందా?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధనతో దిశానిర్దేశం చేయాల్సిన విశ్వవిద్యాలయాలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నాణ్యమైన బోధన, నిఖార్సైన పరిశోధనలకు ఆలవాలం కావాల్సిన వర్సిటీలు మిథ్యగానే మారతున్నాయి.

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలూ బోధకుల పోస్టులు భర్తీ కాక దిక్కులు చూస్తున్నాయి. కొన్ని వర్సిటీల్లో పని చేస్తున్న అధ్యాపకుల కంటే ఖాళీలే ఎక్కువ ఉండటం వాటి దుస్థితికి దర్పణం. ఒక్క అధ్యాపకుడు కూడా లేకుండా కొన్ని విభాగాలు నడుస్తుండడం విచిత్రమనిపించినా వాస్తవమే.

అధ్యాపకుల ఉద్యోగ ఖాళీల భర్తీ ఏడాది కాలంగా కేవలం మాటలకే పరిమితం అవుతోంది. మరోవైపు విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు కరవై విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఘనత వహించిన ఉస్మానియా వర్సిటీలోనే నిజాం కాలం నాటి గుర్రపుశాలలే భావి పౌరులకు వసతి గృహాలు అయ్యాయంటే మిగిలిన విశ్వవిద్యాలయాల్లో పరిస్థితిని ఊహించడం పెద్ద కష్టమేం కాదు.

 రేపు వీసీలతో గవర్నర్ భేటీ

రేపు వీసీలతో గవర్నర్ భేటీ

వైస్ చాన్సలర్ల (వీసీ)ను నియమించి ఏడాది దాటినా వర్సిటీల పనితీరులో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించడం లేదు.ఈ పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాల చాన్స్‌లర్‌గా గవర్నర్‌ నరసింహన్‌ ఆయా వివిధ యూనివర్శిటీల వీసీలతో శుక్రవారం సమావేశమై ఉన్నత విద్యపై చర్చిస్తారు. ఈ సమావేశంతోనైనా మార్పు వస్తే మంచిదేనని విద్యావేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 అధ్యాపకుల్లేక తగ్గిపోతున్న పీహెచ్డీ విద్యార్థులు

అధ్యాపకుల్లేక తగ్గిపోతున్న పీహెచ్డీ విద్యార్థులు

విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందాలంటే అర్హులైన అధ్యాపకులు తగినంత మంది ఉండటం అత్యంత ప్రధానం. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఏళ్ల తరబడి అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయకపోతుండటం, పనిచేస్తున్న వారు రిటైర్మెంట్ అవుతుండటంతో ఖాళీల సంఖ్య కొండవీటి చాంతాడులా పెరిగిపోతోంది. ఓయూ, కాకతీయ, శాతవాహన, తెలుగు, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల సంఖ్య కంటే ఖాళీ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. పాలమూరు యూనివర్సిటీ పరిస్థితి మరీ ఘోరం. అక్కడ 63 పోస్టులు ఉంటే కేవలం 30 మంది శాశ్వత అద్యాపకులు ఉన్నారు. ఓయూలో ఈ ఏడాది మరో 40 మంది పదవీ విరమణ పొందనున్నారు. అర్హులైన అద్యాపకులు లేక విద్యాబోధనలో నాణ్యత దెబ్బతింటున్నది. పరిశోధన కుంటుపడుతున్నది.

న్యాక్‌ గ్రేడ్‌ ఇచ్చేటప్పుడు బోధకుల సంఖ్య, పరిశోధన పత్రాలను పరిగణనలోకి తీసుకుంటారు. అద్యాపకులు లేకపోవడం వల్ల పీహెచ్‌డీ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది. ఒప్పంద అధ్యాపకులు ఉన్నా వారు గైడ్లుగా వ్యవహరించలేరని విశ్వవిద్యాలయాల అధ్యాపకుల సంఘం నేత ఆచార్య భట్టు సత్యనారాయణ చెప్పారు. ఒప్పంద అధ్యాపకులు 1153 మంది ఉన్నా వారు పీహెచ్‌డీ గైడ్లుగా వ్యవహరించడం కుదరదు. వారిలోనూ 20-25 శాతం మందికి తగిన విద్యార్హతలు లేక విద్యలో నాణ్యత లోపిస్తోంది. రాష్ట్రంలోని 11 యూనివర్శిటీల్లో 1,528 బోధకుల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తొలివిడతగా 1,061 మందిని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నెలలు గడిచినా వాటిని ఎలా భర్తీ చేయాలన్న దానిపై తుది నిర్ణయానికి రాలేకపోయారు.

 అన్ని వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి

అన్ని వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి

ఉస్మానియా యూనివర్శిటీలోని జెనెటిక్స్‌ విభాగంలో 17 మందికి కేవలం ఏడుగురు అధ్యాపకులే పనిచేస్తున్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌లో 12 మంది అవసరం కాగా నలుగురే ఉన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ల స్థాయిలో మూడు పోస్టులకు ఒక్కరూ లేరు. జియో ఫిజిక్స్‌లో 21 మందికి ముగ్గురు, జియాలజీలో 30కి నలుగురు, ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈసీఈ విభాగంలో 22కి 13 మంది మాత్రమే ఉన్నారు. ఖాళీల స్థానంలో కాంట్రాక్టు అధ్యాపకులతో నడిపిస్తున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగంలో 10 మంది బోధకులు అవసరం. నలుగురు మాత్రమే శాశ్వత అధ్యాపకులున్నారు. బయోకెమిస్ట్రీ విభాగంలో 8 మంది అవసరం కాగా ఒక్క శాశ్వత అధ్యాపకుడు కూడా లేరు. లైబ్రరీ సైన్స్‌లో కనీసం నలుగురు రెగ్యులర్‌ అధ్యాపకులకు ఒక్కరే ఉన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని స్టాటిస్టిక్స్‌ విభాగంలో ఏడుగురు శాశ్వత అధ్యాపకులు అవసరం కాగా ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు. ఆంగ్ల విభాగంలో ఏడు పోస్టులకు కేవలం ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలు, విభాగాల్లో ఇదే దుస్థితి.

 కీలక నిర్ణయాల్లో వర్శిటీల వెనుకడుగు

కీలక నిర్ణయాల్లో వర్శిటీల వెనుకడుగు

విద్యాశాఖ పరిధిలో రాష్ట్రంలో 11 యూనివర్శిటీలు ఉన్నాయి. వాటిల్లో తొమ్మిది యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం 2016 జులైలో వైస్ చాన్స్‌లర్లను నియమించింది. అయితే బాసరలోని ఆర్‌జీయూకేటీ, కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయానికి నేటికీ వీసీలను నియమించలేదు. శాశ్వత వీసీలు ఉంటేనే వర్సిటీల్లో పాలన అంతంతమాత్రంగా నడుస్తుంది. ఇక వారు లేకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వీసీలను నియమించినా పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కీలకమైన పాలక మండళ్ల నియామకం అతీగతీ లేదు. వీటిల్లో విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు ఉంటారు. ఆయా అంశాలపై ఈ పాలకమండళ్లు తీసుకునేదే తుది నిర్ణయం. ఆయా వర్సిటీలు ఉన్నత విద్యామండలికి పేర్లు పంపడం, ఉన్నత విద్యామండలి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం ఇప్పటికే పలుసార్లు జరిగినా ఫలితం కానరాలేదు. అధ్యాపకులు, ఇతర మౌలిక వసతులు తగినంతగా లేకపోవడం వల్ల ఇప్పటికీ శాతవాహన, ఆర్‌జీయూకేటీ, జేఎన్‌ఏఎఫ్‌యూ, పాలమూరు విశ్వవిద్యాలయాలకు న్యాక్‌ గుర్తింపు లేదు. అది లేదంటేనే వర్సిటీల్లో తగినన్ని వసతులు లేవని అర్ధమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

 యథాప్రకారం అక్రమాలకు నిలయాలు వర్శిటీలు

యథాప్రకారం అక్రమాలకు నిలయాలు వర్శిటీలు

వర్సిటీల్లో పరీక్షల నియంత్రణ విభాగం అత్యంత కీలకం. అక్రమాలు ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉన్న విభాగం కూడా ఇదే. వాటిలోనూ 90 శాతానికి పైగా పొరుగుసేవలు, దినసరి వేతనంపై పనిచేసే వారు ఉంటున్నారు. వారికి వేతనాలు కూడా తక్కువగా ఉండటంతో కొందరు అక్రమార్కులతో చేతులు కలిపి ప్రశ్నపత్రం లీకేజీ, మార్కుల్లో తారుమారు తదితర చర్యలకు పాల్పడుతున్నారు. ఎప్పుడైనా అలాంటివి వెలుగులోకి వస్తే అధికారులు వారిని ఉద్యోగాల నుంచి తొలగించేసి చర్యలు తీసుకున్నాం కదా అని చేతులు దులుపుకుంటున్నారు. అదే శాశ్వత ఉద్యోగులైతే కొలువుకే ఎసరు వస్తుందన్న భయంతో ఉంటారని, అందువల్ల శాశ్వత సిబ్బంది భర్తీకి అనుమతి ఇవ్వాలని కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఫలితంగా అక్రమాలు షరా మామూలుగా మారుతున్నాయి.

 గుర్రపు కొట్టాలే హాస్టళ్లు ఇలా

గుర్రపు కొట్టాలే హాస్టళ్లు ఇలా

విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు తగినన్ని వసతిగృహాలు లేవు. ఉన్నవీ శిథిలావస్థకు చేరాయి. ఓయూలోని వసతిగృహాలను చూస్తే విద్యార్థులు ఎలా ఉంటున్నారన్న ప్రశ్న ఎవరికైనా ఉత్పన్నమవుతుంది. నిజాం కాలంలో గుర్రాల కొట్టాలకు నిర్మించినవే వసతిగృహాలుగా వాడుతున్నారు. ఇటీవల ‘ఏ' హాస్టల్‌ నివాసానికి పనికిరాదని జీహెచ్‌ఎంసీ చెప్పడంతో దాన్ని మూసివేశారు. కొన్ని వసతిగృహాలు రేకుల షెడ్లలో నడుపుతున్నారు. శాతవాహనలో 200 మంది బాలురు, 200 మంది బాలికలకు మాత్రమే వసతి ఉంది. కాకతీయ విశ్వవిద్యాలయంలో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విద్యార్థులకు వసతి ఇవ్వడం లేదు.

పరిశోధనలను సమీక్షించే వారేరి?

పరిశోధనలను సమీక్షించే వారేరి?

పరిశోధనల్లో నాణ్యతా నామమాత్రమే. ఓయూలోని కొన్ని సైన్స్‌ విభాగాల్లోని అధ్యాపకుల పరిశోధనా పత్రాలు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ జర్నళ్లలో ప్రచురితం అవుతున్నాయి. పలు విభాగాల్లో నాసిరకం జర్నళ్లలో ప్రచురితం అవుతున్నాయి. లెక్కకు మాత్రం భారీగా కనిపించినా వాటికి విద్యావేత్తల్లో విలువ లేదు. పరిశోధనా పత్రాలపై సమీక్షించే వారే కరవయ్యారు. ఉన్నత విద్యామండలి కూడా ఆ దిశగా చొరవ తీసుకోవడం లేదు. కనీసం ఎక్కడ ఏం జరుగుతుందో ఏడాదికి ఒకమారైనా నివేదిక కూడా తెప్పించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పదేళ్ల క్రితం ఏర్పాటైన శాతవాహన విశ్వవిద్యాలయం ఒక్కసారి కూడా స్నాతకోత్సవం జరుపలేదు. ఈ ఏడాదే నల్గొండలోని మహాత్మాగాంధీ వర్సిటీ జరిపింది.

జేఎన్‌టీయూహెచ్‌, అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం తప్ప మిగతావన్నీ మూడు నాలుగేళ్లకోసారి స్నాతకోత్సవాలు నిర్వహిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులు అసలు ధ్రువపత్రాలు పొందడానికి అధిక ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. పరీక్షల ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయన్నది అధికారుల ఇష్టం. నిబంధనల ప్రకారం పరీక్షలు ముగిసిన 45 రోజుల్లో వెల్లడి కావాలి. దాదాపు అన్ని చోట్ల ఒక్క డిగ్రీ ఫలితాలు తప్ప మిగతా కోర్సుల ఫలితాలు జాప్యం అవుతున్నాయి. దూరవిద్య ఫలితాలైతే మూడు, నాలుగు నెలలకు వస్తున్నాయి. ఆర్ట్స్‌, సోషల్‌ సైన్స్‌ విభాగాల్లో తరగతులు జరగడం లేదు. అనుబంధ కళాశాలల్లో బయో మెట్రిక్‌ హాజరు పెట్టాలని హుకుం జారీ చేస్తున్న అధికారులు యూనివర్శిటీల్లో పెట్టేందుకు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఓయూలోని కామర్స్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏడు నెలల క్రితం ప్రయోగాత్మకంగా పెట్టినా ఉపయోగం లేదు. కామర్స్‌ కళాశాలలో అది పని చేయడం లేదు.

English summary
Lack of facilities in State universities. There is no appointment associate and assisant professiors. University students didn't have hostels. Even examination branches have only out sourcing staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X