హైదరాబాద్ మణిహారంలో గూగుల్ క్యాంపస్: ప్రపంచంలోనే అతి పెద్ద రెండో కార్యాలయం; ప్రత్యేకతలివే!!
ప్రపంచంలోని అతి పెద్ద పెద్ద కంపెనీలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ ఇప్పుడు గూగుల్ హైదరాబాద్ వేదికగా తమ సంస్థ కార్యాలయాలను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్ గా మారుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో టెక్ దిగ్గజ సంస్థల కార్యకలాపాలను విస్తరించడం కోసం సువిశాలమైన సొంత క్యాంపస్ లను నిర్మించుకుంటున్నాయి.

హైదరాబాద్ మణిహారంలో గూగుల్ క్యాంపస్
ప్రపంచంలోనే టాప్ టెన్ టెక్ సంస్థలలో ఒకటైన గూగుల్ కూడా హైదరాబాద్ మణిహారంలో చేరిపోయింది. అమెరికా తర్వాత అతి పెద్ద క్యాంపస్ నిర్మాణానికి గచ్చిబౌలిలోని నానక్ రామ్ గూడ ను వేదికగా చేసుకొని కార్యకలాపాలను మొదలు పెట్టబోతున్నది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గూగుల్ క్యాంపస్ కు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో భవనం నమూనాను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

రెండవ అతి పెద్ద క్యాంపస్ గా ప్రత్యేకతలతో హైదరాబాద్ గూగుల్ క్యాంపస్
ఇక ఈ క్యాంపస్ ప్రత్యేకతలను చూస్తే 7.3 ఎకరాలలో 30 లక్షల 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన భవనసముదాయంతో ఈ క్యాంపస్ నిర్మాణం జరగబోతోంది. అమెరికాలోని మౌంటెన్ వ్యూ లో ఉన్న గూగుల్ ప్రధాన కార్యాలయం తర్వాత రెండవ అతి పెద్ద క్యాంపస్ గా హైదరాబాద్ గూగుల్ క్యాంపస్ ఉండబోతోంది. డిజిటల్ తెలంగాణకు మరింత బలం చేకూర్చేలా హైదరాబాద్ లో గూగుల్ శాశ్వత క్యాంపస్ నిర్మాణంతో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతున్నాయి అన్న సంకేతం అందుతోంది.

తెలంగాణా సర్కార్ తో ఒప్పందం .. అందిచే సేవలివే
ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన గూగుల్ సంస్థ ఒప్పందం ప్రకారం యువత, మహిళలు, విద్యార్థులు, పౌర సేవల సమూల మార్పులకు అవకాశం కలుగుతుందని తెలుస్తుంది. తాజా ఒప్పందం ప్రకారం యువత ఉపాధికి సరైన నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు, డిజిటల్ నైపుణ్యాలలో మహిళా పారిశ్రామికవేత్తలకు సహకారం, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి గూగుల్ తన మద్దతు అందిస్తుందని తెలుస్తుంది.

రెండేళ్లలో అందుబాటులోకి.. 7వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగావకాలు
గూగుల్ కెరీర్ సర్టిఫికెట్ ద్వారా ఐ టి సపోర్ట్ అందించనుంది. ఐటీ ఆటోమేషన్, యుఎక్స్ డిజైన్, డేటా అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తదితర రంగాలలో యువతకు శిక్షణ ఇవ్వనుంది. ఇక ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద క్యాంపస్ ను నిర్మించనున్న గూగుల్ ఈ క్యాంపస్ ను రెండేళ్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఈ క్యాంపస్ ద్వారా ఏడు వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని సమాచారం.