• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మూడు రోజులే కీలకం: సింగరేణి పోరు హోరాహోరీ, చివరికి కార్మికులే...

By Swetha Basvababu
|

హైదరాబాద్: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల్లో బలాబలాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు చివరి మూడు నాలుగు రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కమ్యూనిస్టు పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు కూటమి కావాలని కోరుతున్న ఏఐటీయూసీ ఇంకా వారితో చర్చలు జరుపుతోంది.

మరోవైపు రాజకీయ సంబంధం లేని హెచ్ఎంఎస్‌పైనా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. ప్రస్తుతం కార్మిక సంఘాలు కూడా కార్మికుల సమస్యల పరిష్కారంపై సాచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. గతంలో కార్మికుల నోట్లో నాలుకగా మారిన కార్మిక సంఘాలు ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా హామీలిస్తూ ముందుకు సాగుతున్నారు.

మరోవైపు అనారోగ్యానికి గురైన కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి.. వారి డిపెండెంట్లకు ఉద్యోగాలకు సిఫారసు చేసేందుకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ డిపెండెంట్లకు ఉపాధి కల్పించే సంగతి విస్మరించిన సింగరేణి యాజమాన్యం.. ఎనిమిది నెలలుగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు మెడికల్ బోర్డునే ఏర్పాటు చేయకుండా నిరాసక్తత వ్యక్తం చేస్తోంది.

ఎన్నికల తీర్పుపై కీలకం కానున్న హెచ్ఎంఎస్

ఎన్నికల తీర్పుపై కీలకం కానున్న హెచ్ఎంఎస్

సింగరేణిలో ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేదని చెప్పే హెచ్‌ఎంఎస్‌ కూడా బలంగా ఉంది. దీనికి తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, రియాజ్‌ అహ్మద్‌ అగ్ర నేతలు. నాయిని, సముద్రాల ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న వారు ఉన్నారు. వారు హెచ్‌ఎంఎస్‌ను టీబీజీకేఎస్‌లో విలీనం చేస్తారన్న పుకార్లు వినిపించాయి. సముద్రాల వేణుగోపాలా చారి కొందరు హెచ్ఎంఎస్ నాయకులను టీబీజీకేఎస్‌లో చేరాలని బలవంత పెట్టినట్లు వార్తలొచ్చాయి. దీంతో వేణుగోపాలాచారిని సంఘం నుంచి బహిష్కరించిన హెచ్‌ఎంఎస్‌ చివరి నిముషంలో అనుసరించే ఎత్తుగడే గెలుపును ప్రభావితం చేయనున్నది.

దసరా అడ్వాన్స్‌తోపాటు దీపావళి బోనస్ కూడా ఒకేసారి

దసరా అడ్వాన్స్‌తోపాటు దీపావళి బోనస్ కూడా ఒకేసారి

ఈ పరిణామాలే కాదు.. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాజాగా దసరా పండుగ అడ్వాన్స్ తోపాటు దీపావళి బోనస్ ఒకేసారి కార్మికులకు చెల్లిస్తున్నారు. ఎప్పటికపుడు ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్న ప్రభుత్వం చివరి నిముషంలో వేసే ఎత్తుగడ ఏమిటన్న ఆసక్తికూడా కార్మికుల్లో నెలకొన్నది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల పరిధిలో సింగరేణి సంస్థ విస్తరించింది. భద్రాద్రి - కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ - భూపాలపల్లి, కుమ్రంభీమ్ - ఆసిఫాబాద్‌ జిల్లాల్లో కలిపి 52వేల ఓట్లు ఉన్నాయి.

భవిష్యత్‌లో సార్వత్రిక ఎన్నికలపై ఈ ఎన్నికల ప్రభావం ఆ పరిధిలోని ప్రాంతాలపై ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా సార్వత్రిక ఎన్నికలకు ఇబ్బంది రాకుండా సింగరేణి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. తెలంగాణలోనే అతిపెద్ద పరిశ్రమ అయినందువల్ల ఈ పరిశ్రమలో ఓటమి రాష్ట్ర భవిష్యత్‌పై ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు బొగ్గుగని కార్మిక సంఘానికి పదుల సంఖ్యలో అగ్రనాయకత్వం ఉన్నా ప్రత్యేకంగా ఈ ఎన్నిల్లో నేరుగా ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను బరిలో దించింది.

బోనస్, వేతనాల నుంచి కార్మిక సంఘం సభ్యత్వం, చందాలు వసూళ్లు

బోనస్, వేతనాల నుంచి కార్మిక సంఘం సభ్యత్వం, చందాలు వసూళ్లు

సింగరేణి కార్మికుడికి మేలు చేయాలనే తపన పాతతరం నేతలకు ఉండేది. తమ సంఘం బలోపేతంగా ఉండాలంటే వారి సమస్యల్ని పరిష్కరించాలనే పట్టుదల ఉండేది. ఆ రోజుల్లో ఎంత కష్టపడితే సంఘాలకు అంత ఆదరణ ఉంటుందనే ఉద్దేశంతో నాయకులు నిస్వార్థంగా పనిచేసేవారు. కార్మికుల నుంచి ఏటా లాభాల (దీపావళి) బోనస్‌ సందర్భంగా ఆయా సంఘాల కార్యకర్తలు గనులపై కూర్చుని సభ్యత్వం రూపంలో సంఘం ఖర్చుల కోసం చందాలు వసూలు చేసేవి. ఏ గనిలో ఎక్కువ మంది కార్మికులు ఏ సంఘానికి సభ్యత్వం ఇస్తే అక్కడి నేతలు బాగా పనిచేస్తున్నట్లు ఏరియా స్థాయి నాయకుల్లో గుర్తింపు ఉంటుందని భావించేవారు. చందాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ రశీదులు ఇచ్చేవారు. ఇలా పోగు చేసిన చందా సొమ్మును కార్మిక సంఘాల అవసరాలకు ఏడాదంతా వాడుకుంటారు. కార్మిక సమస్యలపై నిత్యం అధికారులతో మాట్లాడి, వాటిని పరిష్కరించే దిశగా శాయశక్తులా కృషి చేసేవారు. సొంత కార్యకర్తల బలం పెంచుకోవడానికి నాయకులు ఈ విధంగా అన్ని గనులపై తిరుగుతూ కార్మికులకు ఆత్మీయతానురాగాలను పంచేవారు. నాయకుడు వచ్చాడండే తమ ఆత్మబంధువు వచ్చినట్లు కార్మికులు భావించిన సందర్భాలు ఉన్నాయి.

 ఇతర కార్మిక సంఘాల అడ్డంకులు ఇలా

ఇతర కార్మిక సంఘాల అడ్డంకులు ఇలా

కాల క్రమంలో సింగరేణి కార్మిక సంఘాలు, నాయకుల తీరు మారింది. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి క్రమక్రమంగా సంఘాల వైఖరిలో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు ముగిస్తే చాలు, కార్మికులే నాయకుల చుట్టూ తిరగాలి. మరో ఏడాది, ఆరు మాసాల్లో తిరిగి ఎన్నికలు వస్తాయంటే మళ్లీ సమస్యలను ప్రస్తావిస్తూ ముందుకొస్తారు. గెలిచిన సంఘం కార్మికుల నుంచి సభ్యత్వం వసూలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కార్మికుల వేతనాల నుంచి నెలనెలా సభ్యత్వ రుసుము కోత విధించి యాజమాన్యం గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘం ఖాతాలో జమ చేస్తుంది. కష్టపడ్డా, పడకున్నా, కార్మికుడికి ఇష్టం ఉన్నా లేకున్నా మళ్లీ గుర్తింపు ఎన్నికలు వచ్చే వరకు సభ్యత్వం సొమ్ము కార్మిక సంఘాల ఖాతాల్లో జమ అవుతూనే ఉంటుంది.

తమకు వచ్చిన ఓట్లతో సంబంధం లేకుండా కార్మికుల నుంచి బలవంతంగా సభ్యత్వం నమోదు చేయడం, కార్మికుడి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ తమ ఆదాయాన్ని పెంచుకునే సంస్కృతి పెరిగింది. కార్మికుడు ఇదేంటని ప్రశ్నించే స్వేచ్ఛ కానీ, అవకాశం కానీ లభించదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే, వారికి చుక్కలు చూపుతారన్న భయంతో మౌనంగా భరించాల్సిన దుస్థితి నెలకొంది. గెలిచిన సంఘం ఏదైనా మంచి చేస్తే, అది ఆ సంఘానికి ఎక్కడ పేరు వస్తుందోననే భయంతో, వీలైనంత వరకు యాజమాన్యం పని చేయకుండా ఇతర సంఘాలు అడ్డుపుల్లలు వేయడం ఇప్పటి ఎత్తుగడగా మారింది. గెలిచిన సంఘాలు ఎన్ని తప్పులు చేస్తే, రాబోయే ఎన్నికల్లో అంత ఎక్కువగా తమకు లాభిస్తుందనే స్వార్థం పెరిగింది. గెలిచిన సంఘాలు మాట్లాడకుండా, ఓడిన సంఘాలను పోరాడకుండా యాజమాన్యం కొత్త కొత్త ఎత్తుగడలతో నిబంధనల బంధనాలు విధిస్తుంది.

మైనింగ్, ట్రేడ్స్‌మన్ ఇలా పలువురిని ఆకట్టుకునే వ్యూహం

మైనింగ్, ట్రేడ్స్‌మన్ ఇలా పలువురిని ఆకట్టుకునే వ్యూహం

కార్మిక సంఘాల నేతలకు ఎన్నికల్ని ప్రభావితం చేయగలిగే మైనింగ్‌, క్లరికల్‌, ట్రేడ్స్‌మెన్‌ లాంటి కీలకమైన విభాగాల ఉద్యోగులు గుర్తుకు వస్తుంటారు. ఆ తర్వాత మళ్లీ ఈ వర్గాల ముఖం చూసే నాయకులే కనిపించరనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర వర్గాల కార్మికులను కూడా ప్రభావితం చేయగలిగే ఈ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికలకు ముందు హామీలు గుప్పించడం, ఆ తర్వాత మొహం చాటేయడం సర్వసాధారణమైంది. వీరిని కరివేపాకు చందంగా వాడుకుని వదిలేస్తారంటే అతిశయోక్తి కాదని గత అనుభవాలు చెబుతున్నాయి.

మైనింగ్‌ సిబ్బందికి గెలిచిన తర్వాత ప్రత్యేకంగా చర్చల కమిటీలో చోటు కల్పిస్తామని, ట్రేడ్స్‌మెన్‌ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీలు వేస్తామని, క్లరికల్‌ సిబ్బంది ఇబ్బందులను తొలగిస్తామంటూ శుష్క వాగ్దానాలు చేయడం పరిపాటిగా మారింది. గతంలో ఇలాంటి హామీలతో గెలిచిన సంఘాలేవీ తమ వాగ్దానాలను నిలబెట్టుకోలేదు. ఒకవేళ ప్రత్యేక కమిటీలు వేసినా, అవి నామమాత్రంగానే ఉన్నాయి తప్పితే, ఆయా వర్గాల హక్కుల కోసం పోరాడిన ఆనవాళ్లు లేవు. మెడికల్‌ అన్‌ఫిట్లు, బదిలీలు, పదోన్నతుల పేరిట కార్మికుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పూనుకుంటూ వసూల్‌రాజాలుగా పేరుగడించిన నేతలు ఎంతో మంది ఉన్నారు. ఇతర హామీల సంగతి సరేసరి. ఆదాయం పన్ను రద్దు చేయిస్తామని ప్రతి ఎన్నికల్లో ప్రధాన సంఘాలు హామీ ఇస్తూనే ఉన్నాయి.

కీళ్ల నొప్పులు, మోకాలి చిప్పలతోనే కార్మికులు విధులకు హాజరు

కీళ్ల నొప్పులు, మోకాలి చిప్పలతోనే కార్మికులు విధులకు హాజరు

సింగరేణిలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవల సంగతి సరేసరి. కార్మికవర్గం ఎన్నికల్లో ఆచితూచి నిర్ణయం తీసుకుంటే తప్ప, వారికి సరైన న్యాయం జరిగే అవకాశంలేదు. తాత్కాలిక ప్రయోజనాల కోసం దీర్ఘకాలికంగా నష్టపోవడం మంచిదికాదని కార్మికవర్గం గుర్తించగలిగినప్పుడే వారికి తగిన న్యాయం జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది కార్మికులు వయస్సు మీద పడ్డా కొద్దీ కీళ్ల నొప్పులు.. అరిగిన మోకాలి చిప్పలతోనే విధులకు హాజరవుతున్నారు.

అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా ఎనిమిది నెలలుగా కార్మికులకు మెడికల్‌ బోర్డు పరీక్షలు నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదని ఆయా ప్రాంతాల వాసులు చెప్తున్నది. 12,760 మంది సీనియర్ ఉద్యోగులకు కీళ్ల నొప్పులకు సంబంధించి సంస్థ పరంగా ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో లేవు. సంస్థలో ఎనిమిది నెలలుగా మెడికల్‌ బోర్డు పరీక్షలు నిలిపివేశారు. అనారోగ్య కారణాలతో విధులు నిర్వహించలేని కార్మికులను వైద్య పరంగా విధులకు అన్‌ఫిట్‌ చేసి వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. సింగరేణి భూగర్భ బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులంతా ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

నడవలేని పరిస్థితుల్లోనూ ఇలా కార్మికులు

నడవలేని పరిస్థితుల్లోనూ ఇలా కార్మికులు

సింగరేణిలో 55 ఏళ్లు దాటిన కార్మికులు 12,760 మంది ఉన్నారు. వచ్చే ఏడాది 3704 మంది, 2019లో 320 మంది, 2020లో 8618 మంది, 2021లో 718 మంది కార్మికులు పదవీ విరమణ చేస్తున్నారు.వీరిలో ఎక్కువ శాతం మంది మోకాళ్లకు పట్టీ లేకుండా పని చేసే పరిస్థితి లేదు. కొంత మంది కార్మికులు రెండు కాళ్లకు పట్టీలు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. సీనియర్‌ కార్మికులు ఎక్కువగా ఉండటంతో అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సాధారణ జబ్బుల కంటే కీళ్ల నొప్పులు ఎక్కువగా వెంటాడుతున్నాయి. మోకాలి చిప్పలు అరిగిపోయి నడవలేని స్థితిలో ఉన్న కార్మికులు చాలా మంది ఉన్నారు. విధులకు హాజరు కావాలంటే ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది కార్మికులు ఇంకా భూగర్భ గనుల్లోకి దిగి విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారికి ఉపరితల విభాగాల్లో విధులు కల్పించే అవకాశం కూడా లేకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. వారసత్వ ఉద్యోగాలు అమలు చేస్తే తమ వారసులకు అవకాశం కల్పించే అవకాశమన్నా దక్కుతుందని ఎదురుచూస్తున్న కార్మికులకు నిరాశే మిగిలింది.

అనారోగ్యంతో కార్మికుల తిప్పలివి..

అనారోగ్యంతో కార్మికుల తిప్పలివి..

అనారోగ్యంతో ఉన్న కార్మికులు దరఖాస్తు చేసుకోవడానికి కల్పించిన మెడికల్‌ బోర్డు ఎనిమిది నెలలుగా ఏర్పాటు చేయడం లేదు. దీంతో సింగరేణి వ్యాప్తంగా సుమారు 1200 మంది కార్మికులు వివిధ అనారోగ్య సమస్యలతో మెడికల్‌ బోర్డుకు దరఖాస్తులు చేసుకున్నారు. కాగా ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడంతో కార్మికులు అనారోగ్యంతోనే విధులు నిర్వహిస్తున్నారు. కీళ్ల నొప్పులతో కొంత మంది, దీర్ఘకాలిక వ్యాధులతో మరికొందరు కార్మికులు బాధ పడుతున్నారు. మూత్రపిండాల వ్యాధితో పాటు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వారికి మెడికల్‌ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహించి అనారోగ్య పరంగా విధులకు అనర్హులుగా నిర్ధారించాలి. దీంతో అనారోగ్యంతో విధులకు అనర్హులుగా నిర్ధారించిన కార్మికులు తమ వారసులకు ఉద్యోగం కల్పించుకునే అవకాశం ఉంటుంది.

ఒకవేళ వైద్యపరంగా చికిత్స అందిస్తే కోలుకునే అవకాశం ఉంటే మెరుగైన వైద్యం కోసం యాజమాన్యం రిఫర్‌ చేసే అవకాశం ఉంటుంది. ఎనిమిది నెలలుగా ఎలాంటి మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో కార్మికులు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కార్మికులకు మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు ఒత్తిడి తేవడం లేదు. దీంతో యాజమాన్యం మెడికల్‌ బోర్డు పరీక్షలను ఏర్పాటు చేయడం లేదు. గెలిచిన సంఘాలు యాజమాన్యంపై ఒత్తిడి తేవడంతోనే యాజమాన్యం మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రతి నెలా ఒక మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాని కార్మిక సంఘాలు ఈ విషయంలో యాజమాన్యంపై ఒత్తిడి తేలేకపోతున్నాయి.

English summary
Singereni union recogntion elections here on Octber 5th 2017. But clear indications will be in last 3 or 4 days on union elections. Already CM KCR give double bonanza for employees with Dussera advance and Diwali bonus. With AITUC, INTUC and other trade unions HMS also key union. This's n't affliated to any political party. Special representitive in Delhi for Telangana Samudrala Venugopala chary pressure on Union leader ship to join TBGKS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more