కాంగ్రెస్ లో చేరాలని రేవంత్ రెడ్డిని కలిసిన ఆ నేతలు సైలెంట్ .. వారి చేరికలకు బ్రేక్ వెనుక పెద్ద కథే !
తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోగానే కాంగ్రెస్ పార్టీలో ఎక్కడలేని జోష్ వచ్చింది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న చాలామంది నేతల చూపు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీపై పడింది. కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ప్రచారం సైతం జరిగింది. కొంతమంది కీలక నేతలు సైతం రేవంత్ రెడ్డిని కలిసి ఆయనతో మాట్లాడి పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. మంచి రోజు చూసుకుని త్వరలోనే పార్టీలో చేరుతామని చెప్పిన సదరు నేతలు ఇప్పుడు సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారు. ఇప్పటివరకు ఆ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడం వెనుక ఉన్న అసలు కథేంటి ? అనేది తెలుసుకోవాలంటే వన్ ఇండియా అందించే ప్రత్యేక కథనాన్ని చదవాల్సిందే.
ఇంటిదొంగలకు రేవంత్ డెడ్ లైన్ .. వెళ్లకుంటే వదిలేదే లేదు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలనం

రేవంత్ రెడ్డిని కలిసిన గండ్ర సత్యనారాయణ, ధర్మపురి సంజయ్, ఎర్ర శేఖర్ లు
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున మార్పులు జరగబోతున్నాయి అన్న చర్చ జరిగింది. ఇక రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని విశ్వసించేవారు కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా అంతా భావించారు. అందుకు తగ్గట్టే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకున్న తొలి నాళ్ళలోనే వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు కీలక నేతలు రేవంత్ రెడ్డిని కలిశారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అప్పుడు కలిసినవారిలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే బిజెపి జిల్లా అధ్యక్షులు ఎర్ర శేఖర్, భూపాలపల్లి సీనియర్ లీడర్ గండ్ర సత్యనారాయణలు ఉన్నారు.

పార్టీలో త్వరలో చేరతామని చెప్పి సైలెంట్ అయిన నేతలు
రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత మంచి రోజు చూసుకొని పార్టీలో చేరతామని వారంతా చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని, పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నామని వెల్లడించారు. త్వరలో బహిరంగ సభలు పెట్టి మరీ పార్టీలో చేరతామని వారు పేర్కొన్నారు. ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పిన నేతలు పార్టీలో ఇప్పటివరకు చేరకపోవడం వెనుక ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారిని కాంగ్రెస్ పార్టీలో స్థానికంగా ఉన్న నాయకులు అడ్డుకుంటున్నట్టు చర్చ జరుగుతుంది.

భూపాలపల్లిలో గండ్ర సత్యన్నారాయణను అడ్డుకుంటున్న కొండా సురేఖ
భూపాలపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించిన గండ్ర సత్యనారాయణను పార్టీలోకి రాకుండా కొండా సురేఖ దంపతులు అడ్డుకున్నట్లు గా సమాచారం. భూపాలపల్లి నియోజకవర్గంలో మంచి పేరున్న గండ్ర సత్యనారాయణకు భూపాలపల్లి నియోజకవర్గం నుండి బలమైన పోటీ ఇచ్చారు. సరైన పార్టీ నుండి ఆయన ఎన్నికల బరిలోకి దిగకపోవడంతో ఓటమి పాలయ్యారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న గండ్ర వెంకటరమణా రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో, భూపాలపల్లి నియోజకవర్గం నుండి తనకు లైన్ క్లియర్ అవుతుందని భావించిన గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

భూపాలపల్లి టికెట్ తమకే కావాలని కోరుతున్న కొండా సురేఖ
అయితే భూపాలపల్లి నియోజక వర్గానికి సంబంధించిన టికెట్ కొండా సురేఖ తమకు కావాలని పట్టుబడుతున్న క్రమంలో, గండ్ర సత్యనారాయణ పార్టీలో చేరకుండా సురేఖ అడ్డు పడుతున్నట్లుగా సమాచారం. గతంలో టీడీపీలో పని చేసిన గండ్ర సత్యనారాయణకు, రేవంత్ రెడ్డికి మధ్య సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో రేవంత్ సారధ్యంలో పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేసిన గండ్ర సత్యనారాయణ కొండా సురేఖ వర్గం అడ్డుపడుతున్న క్రమంలో సైలెంట్ గా ఉన్నారు.

ధర్మపురి సంజయ్ పై గతంలో ఉన్న కేసులను చూపి రాకుండా అడ్డుకుంటున్న స్థానిక నాయకులు
నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత చూపించిన నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పై గతంలో ఉన్న కేసులను కారణంగా చూపించి స్థానిక కాంగ్రెస్ నాయకులు పార్టీలోకి రాకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు అర్బన్ నాయకులు అడ్డుకుంటున్నారు. గతంలో ధర్మపురి సంజయ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో అతనికి క్లీన్ చిట్ వచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో చేరకుండా స్థానిక నాయకులు అడ్డుకుంటున్న ట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ధర్మపురి అరవింద్ బిజెపిలో ఉండటంతో, ధర్మపురి సంజయ్ ను పార్టీలోకి తీసుకుంటే ఇబ్బంది వస్తుందని స్థానిక నేతలు అడ్డు పడుతున్నారు.

ఎర్ర శేఖర్ రాకుండా పాలమూరు స్థానిక నేతల యత్నం ..
ఇక ఇదే సమయంలో బిజెపికి పాలమూరు జిల్లాలో గట్టి షాక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరదామని భావించిన ఎర్ర శేఖర్ బిజెపిలో తన పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ఇచ్చిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డిని కలిసిన ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. గతంలో టీడీపీ నేత అయిన ఎర్ర శేఖర్ రేవంత్ రెడ్డితో ఉన్న పరిచయాలతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎర్ర శేఖర్ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సమాచారం.ఇంతకాలం జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్న మల్లురవి ఎర్ర శేఖర్ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇదే సమయంలో ఎందుకైనా మంచిదని నాగర్ కర్నూల్ లోకసభ స్థానంపై కూడా దృష్టి పెట్టారని సమాచారం.

పార్టీలో వీరి చేరిక ఎప్పుడో .. నియోజకవర్గాల్లో ఆసక్తికర చర్చ
ఏది ఏమైనా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీలో చేరతామని ప్రకటించిన సీనియర్ నాయకులు, స్థానిక నాయకుల కారణంగా ప్రస్తుతానికి పార్టీలో చేరకుండా సైలెంట్ గా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరదామని భావిస్తున్న నాయకులు కచ్చితంగా ఆయా నియోజకవర్గాలలో వారికి ఎన్నికల బరిలోకి దిగేందుకు కాంగ్రెస్ పార్టీ నుండి అవకాశం కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే పార్టీలో చేరే పరిస్థితి ఉంది. మరి వీరి విషయంలో భవిష్యత్తులో ఏం జరగబోతోంది అన్నది ఆయా నియోజకవర్గాలలో జరుగుతున్న ఆసక్తికర చర్చ.