ఎంపీ అర్వింద్‌కు లోక్ సభ స్పీకర్ ఫోన్.. దాడిపై ఆరా.. ఢిల్లీకి పిలుపు
నిజామాబాద్ ఎంపీ దర్మపురి అర్వింద్‌పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి ఘటన మరో మలుపు తిరిగేలా కన్పిస్తోంది. ఈ వ్యవహరం ఢిల్లీకి చేరింది. తాజాగా బీజేపీ ఎంపీ అర్వింద్‌కు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఫోన్ చేశారు. ఆర్మూర్‌లో అర్వింద్‌పై జరిగిన దాడి గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన సమయంలో రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరును అర్వింద్ స్పీకర్‌కు వివరించారు.

ఢిల్లీకి రావాలని అర్వింద్‌కు లోక్‌సభ స్పీకర్ పిలుపు
తెలంగాణ పోలీసుల సహకారంతోనే తనపై దాడి జరిగిందని అర్వింద్.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులు కలిసి తనపై హత్యాయత్నం చేశారని తెలిపారు. ఈ దాడి ఘటనపై మరింత చర్చించేందుకు వెంటనే ఢిల్లీకి రావాలని అర్వింద్‌కు స్పీకర్ సూచించారు. దీంతో మరో రెండు రోజుల్లో అర్వింద్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీకి వెళ్లిన అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, పోలీసుల తీరుపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నారు ఎంపీ అర్వింద్..

ఆర్మూర్‌లో అర్వింద్‌పై దాడి..
ఈనెల 25న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని నందిపేట్ మండలం, నూత్‌పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ అర్వింద్ వెళ్తుండగా ఇస్సపల్లి సమీపంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

పోలీసులే దగ్గరుండి దాడి చేయించారు..
కానీ, పోలీసులే దగ్గరుండి ఈ దాడి చేయించారని ఎంపీ ఆర్వింద్ ఆరోపించారు. టీఆర్ఎస్కు తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదనే కేసీఆర్ బీజేపీ నేతలు, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

బండి సంజయ్ విషయంలోనూ స్పీకర్ రియాక్షన్
ఇటీవల ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలపై కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 317 జీవోకు వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా కరీంనగర్‌లోని తన కార్యాలయంలో సంజయ్ జాగరణ దీక్షకు దిగారు. అయితే పోలీసులు దీక్షకు అనుమతి లేదన్నారు. ఆయన కార్యాలయంలోకి చొరబడి తలుపులు బద్దలు కొట్టి బండి సంజయ్‌ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెంటనే స్పందించి చర్యలకు పూనుకున్నారు. తెలంగాణ డీజీపీ , కరీంనగర్ సీపీలకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ప్రివిలేజ్ కమిటీ విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా ఎంపీ అర్వింద్‌పై జరిగిన దాడి ఘటనపై లోక్ సభ స్పీకర్ బిర్లా రియాక్ట్ అయ్యారు. తాజా ఘటనపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో చూడాలి.