వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకసభ ఎన్నికలు 2019: పెద్దపల్లి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

By Staff
|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : Peddapalli Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో ఆది నుంచి కాంగ్రెస్ హవానే నడుస్తోంది. మధ్యలో టీడీపీ ప్రభంజనం కనిపించింది. బీజేపీ మాత్రం ఇంతవరకు బోణీ కొట్టలేదు. 1962 నుంచి 2009 వరకు కాంగ్రెస్ అభ్యర్థులే అత్యధికంగా గెలుపొందారు. 2014 లో తెలంగాణ ఉద్యమ నేపథ్యం కారణంగా కారు జోరు కొనసాగింది. 1962 లో ఏర్పడ్డ పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గానికి తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎం.ఆర్.కృష్ణ విజయం సాధించారు. ఇవి మూడవ లోక్ సభకు జరిగిన ఎన్నికలు. తిరిగి 1967లోనూ ఆయనే గెలిచారు. 1971లో వి.తులసీరాం తెలంగాణ ప్రజాసమితి తరపున గెలిచారు. తిరిగి 1977లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగి విజయం సాధించారు. 1980, 84 లో జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు టీడీపీ తరపున జి.భూపతి గెలుపొందారు. 1989, 1991, 1996 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున జి.వెంకట స్వామి హ్యాట్రిక్ కొట్టారు. 1998, 1999లో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ సుగుణ కుమారి టీడీపీ తరపున గెలిచారు. 2004లో మళ్లీ జి.వెంకటస్వామి గెలిచారు. 2009లో ఆయన తనయుడు జి.వివేకానంద విజయం సాధించారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ జయకేతనం ఎగురవేశారు.

1962లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. నాటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటలా ఉంది. ఆ పార్టీలో సీనియర్ నేతగా వ్యవహరించిన వెంకటస్వామి కుటుంబానికి తిరుగులేని విజయాలు కట్టబెట్టింది. 2014లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడంతో కాంగ్రెస్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. 1971లో కూడా తొలిదశ తెలంగాణ ఉద్యమం... కాంగ్రెస్ విజయాలకు గండి కొట్టింది. ఈ పార్లమెంటరీ సెగ్మెంట్ లో పెద్దపల్లి, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, మంథని అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో చెన్నూర్, బెల్లంపల్లి, ధర్మపురి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు.

పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో 14 లక్షల 25 వేల 361 మంది ఓటర్లున్నారు. అందులో 7 లక్షల 25వేల 767 మంది పురుష ఓటర్లు, 6 లక్షల 99 వేల 594 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే 2014 ఎన్నికల్లో 5 లక్షల 20 వేల 598 మంది పురుష ఓటర్లు, 5 లక్షల ఒక వేయి 586 మంది మహిళా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

#LokSabhaElection2019: All about Peddapalli Constituency

దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ 1952లో ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు పదహారు సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అయితే పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం మాత్రం 1962లో ఏర్పడింది. అంటే మూడవ లోక్‌సభ నుంచి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ లెక్కన పెద్దపల్లి పార్లమెంటరీ స్థానానికి ఉపఎన్నికలతో కలుపుకొని ఇప్పటివరకు పధ్నాలుగు సార్లు ఎలక్షన్లు జరిగాయి. ఎనిమిది సార్లు కాంగ్రెస్, తెలంగాణ ప్రజా సమితి ఒకసారి, టీడీపీ నాలుగుసార్లు, టీఆర్ఎస్ ఒకసారి విజయం సాధించాయి.

పెద్దపల్లి లోక్‌సభకు 2014లో జరిగిన ఎన్నికలను కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వ్యాపారవేత్త, సీనియర్ లీడర్ ఒకవైపు.. విద్యార్థి నాయకుడు మరోవైపు బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ నుంచి వెంకటస్వామి అలియాస్ కాకా తనయుడు జి.వివేకానంద నిలబడితే.. టీఆర్ఎస్ నుంచి విద్యార్థి ఉద్యమ నాయకుడు బాల్క సుమన్ పోటీ చేశారు. అయితే వందల కోట్లున్నా వివేకానందను గెలిపిస్తారా? తెలంగాణ కోసం ఉద్యమించి వందల కేసులు నమోదైన తనను గెలిపిస్తారా అంటూ నిర్వహించిన ప్రచారం బాల్క సుమన్ కు కలిసొచ్చింది. అంతేకాదు కారు జోరు కూడా కొనసాగడంతో ఆయన గెలుపు ఈజీ అయింది. వివేకానందపై 2 లక్షల 91వేల 158 ఓట్ల మెజార్టీతో బాల్క సుమన్ గెలుపొందారు. 5 లక్షల 65వేల 496 ఓట్లు సుమన్ కు రాగా, 2 లక్షల 74 వేల 338 ఓట్లు దక్కించుకున్నారు వివేకానంద. అయితే తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సుమన్.. చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పెద్దపల్లి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో పదవీకాలానికి దాదాపు ఆరు నెలల ముందే గుడ్ బై చెప్పాల్సి వచ్చింది.

పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో 18 లక్షల 91 వేల 579 మంది జనాభా నమోదైంది. స్త్రీ, పురుషుల నిష్పత్తి 1000 : 964 గా ఉంది. 50.93 శాతం పురుషులు, 49.07 శాతం స్త్రీలు ఉన్నారు. గ్రామీణ ప్రాంత జనాభా 65.22 శాతం కాగా, పట్టణ ప్రాంత జనాభా 34.78 గా కనిపిస్తుంది. ఎస్సీలు 22.39 శాతముండగా ఎస్టీలు 4.57 శాతంగా ఉన్నారు.

2014 లో ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన బాల్క సుమన్ విద్యావంతుడు. అంతేకాదు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. ఆయనకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ సమస్యలపై అవగాహన ఉంది. అయితే తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టిన సుమన్ మొదట్లో ఉత్సాహంగా పనిచేసినా రానురాను నెమ్మదించారనే ఆరోపణలున్నాయి. ఎక్కువశాతం హైదరాబాద్ లోనే ఉంటూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారనే వాదనలున్నాయి. ఇక పనితీరు విషయంలో ప్లస్ మైనస్సులు సమానమని చెప్పొచ్చు. మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి 5వేల కోట్ల రూపాయలు మంజూరు చేయించి పునరుద్ధరణ పనులు వేగవంతం చేశారు. నిజామాబాద్ - జగదల్ పూర్ జాతీయ రహదారికి 246 కోట్లు, మంచిర్యాల - చంద్రపూర్ జాతీయ రహదారికి ఒక వేయి 504 కోట్లు శాంక్షన్ చేయించారు. కేతనపల్లి బ్రిడ్జి పనులను స్పీడప్ చేశారు. రైల్వే లైన్ల విషయంలోనూ చొరవ చూపారు. సింగరేణిలో కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా సుమన్ కు కలిసొచ్చినట్లైంది. పెద్దపల్లి పార్లమెంటరీ పరిధిలో 6500 కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటు కాబోతుందని ప్రకటించిన సుమన్.. 3వేల మందికి ప్రత్యక్షంగా మరో 3వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ అది ఎన్నటికీ కార్యరూపం దాల్చుతుందో చూడాలి. ఈ సెగ్మెంట్ లో సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీనికోసం ఎంపీగా సుమన్ చేసిందేమీ లేదనే ఆరోపణలున్నాయి.

పెద్దపల్లి ఎంపీగా సుమన్ పార్లమెంటులో ఏం చేశారనే లెక్కలు చూసినట్లయితే ఆయన హాజరుశాతం 52 శాతంగా నమోదైంది. 9 చర్చల్లో పాల్గొన్న సుమన్ 2 ప్రైవేట్ బిల్స్ పెట్టడంతో పాటు 272 ప్రశ్నలు లెవనెత్తారు. ఇక ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో 13 కోట్ల రూపాయలు మాత్రమే వినియోగించుకున్న సుమన్... ఎక్కువగా సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు. అయితే బస్టాండులలో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి యంత్రాలు ఒక బెల్లంపల్లిలో తప్ప మిగతా ఎక్కడా కూడా పనిచేయడం లేదనే ఆరోపణలున్నాయి. బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు ఉపయోగపడుతున్నాయి. దత్తత గ్రామం గూడెంలో సీసీ రోడ్లు, సోలార్ లైట్లు, ఇంటింటికీ మరుగుదొడ్లు పూర్తి చేయించారు. అయితే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయని, దీనికోసం ఎంపీ చొరవచూపడం లేదనే వాదనలున్నాయి.

పెద్దపల్లి పార్లమెంటరీ పరిధిలో సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉంటారు. ఎన్నికల్లో వీరి ఓట్లే కీలకంగా మారుతాయి. అయితే సింగరేణి ప్రాంతంలో కొత్త రైళ్లతో పాటు వ్యాపార అవసరాల కోసం గూడ్స్ కంటెయినర్స్ పెంచాలనే డిమాండ్ బాగా వినిపిస్తోంది. గోదావరి నది పక్కనే ఉన్నా.. రామగుండం ప్రాంతవాసులను తాగునీటి సమస్య వేధిస్తోంది. అదలావుంటే హార్టికల్చర్ యూనివర్సిటీతో పాటు కేంద్రీయ విద్యాలయాలను తీసుకురావాలనేది ఇక్కడి ప్రజల ఆకాంక్ష. మొత్తానికి 2019 పెద్దపల్లి లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ గట్టి పోటీ ఉండదేమో అనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి ఇన్నాళ్లు ఏకఛత్రాధిపత్యం కొనసాగించిన వివేకానంద టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఆయన కారు గుర్తు మీద పోటీచేయనున్నారు. దీంతో కాంగ్రెస్ తరపున ఆయనకు సరిపడా లీడర్ లేనట్లే కనిపిస్తుంది. ఇంతవరకు ఈ సెగ్మెంట్ లో ఖాతా తెరవని బీజేపీకి కూడా సరైన నాయకుడు లేడని చెప్పొచ్చు. అలా 2019 ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటరీ స్థానం టీఆర్ఎస్ అకౌంట్ లో పడినట్లేననే టాక్ వినిపిస్తోంది.

English summary
Lok Sabha Election 2019: Know detailed information on Peddapalli Lok Sabha Constituency of Telangana. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Peddapalli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X