ఆస్పత్రి నుండి మధులిక డిశ్చార్జ్ .. భరత్ ను కఠినంగా శిక్షించాలన్న మధులిక
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన మధులిక ఆరోగ్యం కాస్త మెరుగుపడడంతో ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు వైద్యులు. ప్రస్తుతం మధులిక హైదరాబాదులోని ఆమె బంధువుల ఇంటికి చేరింది. మలక్ పేట యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందిన మధులిక క్రమంగా కోలుకోవటంతో డాక్టర్లు ఆమెను డిశ్చార్జ్ చేశారు. అయితే పూర్తిగా గాయాలు మానడానికి, పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని భావిస్తున్నారు. మెదడుకు గాయం కావడంతో పలుమార్లు సర్జరీలు చేసిన డాక్టర్లు ఎట్టకేలకు ఆమెను సాధారణ స్థితికి తీసుకు రాగలరు. మధులిక ప్రాణాలు కాపాడటం లో యశోద వైద్యులు సక్సెస్ అయ్యారు.
తనపై జరిగిన దాడి విషయంలో స్పందించిన మధులిక భరత్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతగా తనను క్షోభకు గురిచేసిన అతడ్ని వదిలి పెట్టొద్దని మధులిక కోరుతోంది. మెజిస్ట్రేట్ కు ఇచ్చిన వాంగ్మూలంలో మధులిక భరత్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, కనిపించినప్పుడు మాట్లాడేదాన్నిఅని అయితే ప్రేమ పేరుతో ఇంత ఘాతుకానికి ఒడిగడతాడని తనకు తెలియదని చెప్పింది.భరత్ ను కఠినంగా శిక్షించాలంటూ మెజిస్ట్రేట్ కు ఇచ్చిన వాంగ్మూలంలో మధులిక పేర్కొంది.
కొబ్బరి బొండాలు నరికే కత్తితో మధులిక పై విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను తీవ్ర గాయాల పాలు చేశాడు ప్రేమోన్మాది భరత్. ఈనెల 6న బర్కత్ పురా వద్ద జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. యశోద ఆసుపత్రి వైద్యులు మధులిక ప్రాణాలు కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు మధులికను కాపాడారు. ప్రస్తుతం కోలుకుంటున్న మధులిక తను బాగా చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ చేస్తానని అంటోంది. మధులిక పై దాడికి పాల్పడిన భరత్ ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. గత 15 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన మధులిక నేరేడ్మెట్ భగత్ సింగ్ నగర్ లోని బంధువుల ఇంటికి చేరింది. ఆమె పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పట్టనుంది.ఆమె కోలుకున్న తర్వాత ఆమెకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.