సోనియాకు రోశయ్య ఆప్తుడు- మల్లిఖార్జున ఖర్గే నివాళి : చిరంజీవి- ఏపీ మంత్రులు..!!
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణంపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. హైదరాబాద్ వచ్చి మాజీ సీఎం మృతదేహానికి నివాళులు అర్పించిన ఆయన.. రోశయ్య సేవలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నేతను కోల్పోయిందన్నారు. సోనియాగాంధీ ఫోన్ చేసి ఏఐసీసీ పక్షాన నివాళులు అర్పించడానికి తనను ఇక్కడికి పంపించారని తెలిపారు. 'రోశయ్యతో నాకు మంచి అనుబంధం ఉంది. 16 ఏళ్లు ఆర్ధికమంత్రిగా అద్భుతంగా పని చేశారు. రోశయ్య వివాద రహితుడుగా పేర్కొన్నారు.

అనేక పదవులకు వన్నె తెచ్చారు
ఏ మంత్రిపదవి ఇచ్చినా దాన్ని సమర్థవంతంగా నిర్వహించేవారు. ఆయన మరణం కాంగ్రెస్కు తీరని లోటు. వారి మృతికి ఏఐసీసీ పక్షాన సంతాపం తెలుపుతున్నాను. రోశయ్య కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. సోనియాగాంధీకి రోశయ్య అత్యంత ఆప్తుడని చెప్పారు. కాంగ్రెస్ లో జాయిన్ అయిన దగ్గర నుండి అనేక పదవులకు వన్నెతెచ్చారని కొనియాడారు. ఎలాంటి కాంట్రవర్సీ లేని నాయకుడు రోశయ్య అని... అందర్నీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని తెలిపారు.

చిరంజీవి..ఏపీ మంత్రుల నివాళి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రోశయ్య అంత్యక్రియలకు మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నారు. ఆర్థికశాఖ అంటే రోశయ్యగారేనన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రోశయ్య లేని లోటు ఎవరూ తీర్చలేనిదన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సైతం రోశయ్య కు నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోశయ్య మరణంతో రాజకీయాల్లో ఒక శకం ముగిసిందని వ్యాఖ్యానించారు.
కిషన్ రెడ్డి పరామర్శ..సానుభూతి
రోశయ్య మృతిపట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన బౌతిక కాయం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం నివాళులర్పించారు. రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని ఆయన చెప్పారు. తాను విద్యార్ధిగా ఉన్న సమయంలో బీజేపీ సీనియర్ నేత వి. రామారావు శాసనమండలి సభ్యుడిగా ఉన్న సమయంలో మండలికి వెళ్లేవాడినని కిషన్ రెడ్డి చెప్పారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కవచంగా రోశయ్య పనిచేశారని కిషన్ రెడ్డి చెప్పారు.
బండి సంజయ్ సంతాపం
తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో కూడా రోశయ్యతో కలిసి అసెంబ్లీలో ప్రతి రోజూ కలిసేవాడినని చెప్పారు. అసెంబ్లీలోనూ వ్యక్తిగతంగా తాను లేవనెత్తే అంశాలపై రోశయ్య అభినందించేవాడని కిషన్ రెడ్డి ప్రస్తావించారు.. ఆర్థిక శాఖ అంటే రోశయ్యే గుర్తుకొస్తాయని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. విపక్షాన్ని తన మాటలతోనే ఆకట్టుకునే నేర్పరి రోశయ్యని..రాజకీయాల్లో ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిదన్నారు. రోశయ్య ఆత్మశాంతికి కలగాలని కోరుకొంటున్నానని తెలిపారు. కుటుంబానికి దేవుడు మనో ధైర్యం కలిగించాలని కోరుకొంటున్నట్టుగా సంజయ్ చెప్పారు.