వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: 'నా ఆక్సిజన్‌ తీసేశారు...నేను చచ్చిపోతున్నా అందరికీ బైబై...' కంటతడి పెట్టిస్తున్న కరోనా పేషెంట్ వీడియో

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రవి కుమార్

"ప్రభుత్వాసుపత్రిలో అయితే ప్రమాదం ఉండదన్నావ్. వద్దన్నా నన్ను ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చావ్‌. డాక్టర్లు చంపేస్తారు, ఇక్కడికి వచ్చిన వాళ్లు బతకరు అని చెప్పినా వినలేదు. నాకు ఊపిరి ఆడటం లేదు. బతిమాలినా ఆపేశారు. నేను చచ్చిపోతున్నా డాడీ, అందరికీ బైబై'' అంటూ మేడ్చల్‌ జిల్లా జవహర్‌ నగర్‌కు చెందిన ఓ యువకుడు చనిపోతూ రికార్డు చేసిన వాట్సప్‌ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని బీజేఆర్ నగర్‌కు చెందిన ఆ 34 ఏళ్ల యువకుడి పేరు రవి కుమార్. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి సిబ్బంది తన కుమారుడికి ఆక్సిజన్‌ ఇవ్వకుండా చంపేశారని తండ్రి ఆరోపిస్తున్నారు. అయితే, ఎర్రగడ్డ ఆసుపత్రి అధికారులు మాత్రం ఆక్సిజన్ ఇవ్వలేదనే ఆరోపణను అంగీకరించడం లేదు. కరోనా వైరస్‌ నేరుగా గుండె మీద ప్రభావం చూపిందని, అందుకే రక్షించలేకపోయామని అంటున్నారు.

రవి కుమార్

రవికుమార్‌ సెల్ఫీ వీడియోకు ముందు ఏం జరిగింది?

జ్వరం,శ్వాస ఇబ్బందులతో రవి కుమార్ జూన్ 24న హైదరాబాద్, ఎర్రగడ్డలోని 'గవర్నమెంట్ జనరల్ అండ్ చెస్ట్ హాస్పిటల్‌‌లో చేరారు. కానీ, రెండు రోజులు తిరక్కుండానే 26న మరణించారు.

చనిపోయే వరకు అతనికి కరోనా ఉన్నట్లు ఎవరికీ తెలియదు. ఈనెల 23న జ్వరం, శ్వాస ఇబ్బందులు తలెత్తడంతో రవికుమార్‌ తండ్రి వెంకటేశ్వర్లు ఆయన్ను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, జ్వరం ఉండటంతో కరోనా కావచ్చని, టెస్టు చేసుకుని వస్తేనే చేర్చుకుంటామని ఆ ఆసుపత్రి వాళ్లు తేల్చి చెప్పారని రవికుమార్‌ తండ్రి వాపోయారు. అక్కడి నుంచి తాను పదికిపైగా ఆసుపత్రులకు వెళ్లానని, ఎవరూ తన కొడుకును ఆసుపత్రి గేటు కూడా దాటనివ్వలేదని వెంకటేశ్వర్లు బీబీసీతో చెప్పారు.

https://www.facebook.com/BBCnewsTelugu/videos/316781066153545/

"టెంపరేచర్‌ చూడటం, జ్వరం ఉందని తెలియడంతో గేట్లు మూసేశారు. చిన్న ఆసుపత్రుల నుంచి కార్పోరేట్ ఆసుపత్రుల వరకు ఎవరూ నా కొడుకును చేర్చుకోలేదు'' అని కన్నీరు పెట్టుకున్నారు వెంకటేశ్వర్లు.

జ్వరం ఉన్నందున పేషెంట్‌గా చేర్చుకోవడానికి కోవిడ్‌ టెస్టు రిపోర్ట్‌ కావాల్సిందేనని హాస్పిటల్స్‌ డిమాండ్‌ చేస్తుండటంతో తాను కరోనా టెస్టు కోసం ప్రయత్నించానని, కానీ, అదొక ప్రహసనంలా సాగిందని రవికుమార్‌ తండ్రి చెప్పారు.

"ఒక్కో టెస్ట్‌ సెంటర్‌ ముందు వైరస్‌ అనుమానితులు వందల్లో బారులు తీరి ఉన్నారు. ఏ సెంటర్‌కు వెళ్లినా ఇవాళ కాదంటున్నారు. అసలు నా కొడుకుకు టెస్టు చేయించగలనా అని భయపడ్డా. చివరకు ఓ వ్యక్తి సలహా ప్రకారం ప్రైవేట్‌ టెస్టు సెంటర్‌లో టెస్ట్‌ చేయించాను. కానీ చనిపోయాక రిపోర్ట్‌ వచ్చింది'' అన్నారు వెంకటేశ్వర్లు.

రవి కుమార్ పాత ఫోటో

'డాడీ ఆక్సిజన్‌ ఆపేశారు...నేను చనిపోతున్నా'

కోవిడ్‌-19 టెస్ట్‌కు శాంపిల్స్‌ ఇచ్చాక ఈ నెల 24న ఎర్రగడ్డ చెస్ట్‌ ఆసుపత్రిలో రవికుమార్‌ను చేర్చారు తండ్రి వెంకటేశ్వర్లు. అప్పటికే రవికుమార్‌ శ్వాససరిగా తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ నెల 26న తాను ఆసుపత్రి దగ్గరే ఉన్నానని, అర్ధరాత్రి 12.45 నిమిషాలకు తనకు రవికుమార్‌ వాట్సప్‌ వీడియో మెసేజ్‌ పంపాడని వెంకటేశ్వర్లు వివరించారు.

"నేను ఆసుపత్రి ఆవరణలోనే పడుకున్నా. రాత్రి 2 గంటల సమయంలో మెలకువ వచ్చి ఫోన్‌ చూసుకున్నాను. నా కొడుకు వీడియో మెసేజ్‌ ఉంది. నేను చనిపోతున్నా డాడీ బైబై అంటూ అందులో రవి అంటున్నాడు. అది చూడగానే నేను చెప్పారు.

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం

ఆసుపత్రి సిబ్బందిని నిలదీసే పరిస్థితి కూడా లేదని, త్వరగా శవాన్ని తీసుకెళ్లాలని తొందర పెట్టారని వెంకటేశ్వర్లు ఆరోపించారు. శవాన్ని తీసుకెళదామంటే అంబులెన్స్‌ వాళ్లు కూడా రాలేదన్నారు. "ఆసుపత్రిలో మమ్మల్ని పిచ్చోళ్లకన్నా ఘోరంగా చూశారు. గట్టిగా అడిగితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో'' అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని వెంకటేశ్వర్లు వాపోయారు.

ఆసుపత్రిలో తనకు కొడుకుకు ఆక్సిజన్‌ ఎందుకు తొలగించారో అర్ధం కాలేదని, పక్కన వేరే పేషెంట్లు కూడా లేరని వెంకటేశ్వర్లు చెప్పారు.

రవికుమార్‌ విషయంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు బీబీసీ ఎర్రగడ్డ చెస్ట్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మెహబూబ్‌ ఖాన్‌ను ఫోన్‌ ద్వారా సంప్రదించింది.

"మేం ఆక్సిజన్‌గానీ, వెంటిలేటర్‌గానీ తీయలేదు. అతని ముక్కుకు ఆక్సిజన్‌ పైప్‌ ఉన్నట్లు మీరు స్పష్టంగా చూడవచ్చు'' అన్నారు మెహబూబ్‌ఖాన్‌.

రవికుమార్‌ ఆసుపత్రిలో చేరిన రెండు రోజులకే చనిపోవడం దురదృష్టకరమని, మా ప్రయత్నాలు మేం చేశామని అయిన అన్నారు. "ఇటీవలి కాలంలో కరోనావైరస్‌ నేరుగా గుండెపై ప్రభావం చూపుతోంది. ఎంత ఆక్సిజన్‌ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. వైరస్‌ ప్రభావం ఒక్కో ఆర్గాన్‌ మీద ఒక్కోరకంగా ఉంటుంది'' అని మెహబూబ్‌ఖాన్‌ వివరించారు. సిబ్బంది ఆక్సిజన్‌ తొలగించారన్న ఆరోపణలను ఆయన ఒప్పుకోలేదు. " రవికుమార్‌కు సరిపడా ఆక్సిజన్‌ ఇచ్చాం. చేరిన దగ్గర్నుంచి మా సిబ్బంది మానిటర్‌ చేస్తూనే ఉన్నారు'' అని మెహబూబ్‌ఖాన్‌ బీబీసీతో అన్నారు.

రవి కుమార్

కరోనా గుండె మీద ప్రభావం చూపిందా? అందుకే రవి కుమార్‌ మరణించాడా?

ఇటీవలి కాలంలో కరోనా వైరస్‌ నేరుగా గుండెపై ప్రభావం చూపుతున్న కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు తాము గమనించామని చెస్ట్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మెహబూబ్‌ ఖాన్‌ చెప్పారు. "యువతలో ఈ తరహా మరణాలు పెరుగుతున్నట్లు మేం గుర్తించాం. మా దగ్గరున్న గణాంకాలలో ఇది స్పష్టంగా తెలుస్తోంది'' అని మెహబూబ్‌ఖాన్‌ అన్నారు. ఇలాంటి కేసులు కనిపిస్తున్న మాట వాస్తవమేనని హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యుడొకరు వెల్లడించారు.

అయితే, ఆక్సిజన్‌ తీసేయలేదన్న వాదనను రవికుమార్‌ తండ్రి కొట్టిపారేస్తున్నారు. ''ముక్కుకు పైపు ఉన్నంత మాత్రాన దానికి సప్లై ఉందని ఎలా చెప్పగలం. మూడు గంటల నుంచి ఆక్సిజన్‌ అందడం లేదని నా కొడుకు వీడియోలో చెప్పాడు'' అని తండ్రి వెంకటేశ్వర్లు అన్నారు.

అంత్యక్రియలు ముగిశాక కోవిడ్‌-19 రిపోర్ట్‌

అయితే రవికుమార్‌కు ఆయన అంత్యక్రియల్లో 30మంది వరకు బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. తర్వాత రిపోర్టు పాజిటివ్‌ అని తేలడంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్నతలెత్తింది. ఈ నెల 26 తెల్లవారుజామున తన కొడుకు రవి కుమార్‌ మరణించాడని, కానీ 27 మధ్యాహ్నం కరోనా రిపోర్ట్‌ వచ్చిందని రవి కుమార్‌ తండ్రి తెలిపారు. "ఇప్పుడు మమ్మల్ని హోమ్‌ క్వారంటైన్‌ కావాలని చెప్పారు. మా పరిస్థితి ఏమీ అర్ధం కావడం లేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. బంగారంలాంటి కొడుకును పోగొట్టుకున్నాను'' అని రవికుమార్‌ తండ్రి చెప్పారు.

చనిపోయే ముందు రవికుమార్‌ రికార్డు చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్ర వైద్య రంగంలో నెలకొన్న పరిస్థితులకు రవికుమార్‌ సంఘటన ఒక ఉదాహరణ అంటూ ఈ వీడియోపై కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియా యూజర్లు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Man dies of Covid-19 in Hyderabad. He made a selfie video hours before his death that went viral
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X