ఘోరం: వ్యక్తి గొంతుకోసిన గాలిపటం మాంజా, పండగపూట భార్య కళ్లదుటే విషాదం
ఆదిలాబాద్: సంక్రాంతి పండగ సందర్భంగా ఎగరేసిన గాలిపటం ఒకరి ప్రాణం తీసింది. అతని కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. గాలిపటం మాంజా వల్ల గొంతు తెగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

బైక్ పై వెళుతున్న వ్యక్తి మెడను కోసేసని గాలిపటం మాంజా
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మంచిర్యాలతో దంపతులు బైక్ పై వెళ్తుండగా.. గాలిపటం మాంజా వాహనం నడుపుతున్న వ్యక్తి మెడకు చుట్టుకుంది. బైక్ వేగంగా వెళ్తుండటంతో.. ఆ మాంజా మెడకు బిగుసుకుపోయి గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో భార్య దిగ్భ్రాంతికి గురైంది. కళ్లెదుటే భర్త చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. మంచిర్యాల జాతీయ రహదారిపై లక్షెట్టిపేట వైపు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.

చైనా మంజాపై నిషేధం ఉన్నప్పటికీ..
సరదాగా సాగాల్సిన పతంగుల(గాలిపటాలు) పండుగ.. ప్రాణాలు తీసుకుంటోంది. ప్రమాదకరమైన చైనా మాంజాను వినియోగించొద్దని ప్రభుత్వాలు ఎంత చెప్పినా జనాలు మాత్రం వినిపించుకోవట్లేదు. చైనా మాంజాపై ఇప్పటికే నిషేధం విధించినా వాటినే కొనుగోలు చేస్తున్నారు. ప్రాణాలను తీసే చైనా మాంజానే నిర్లక్ష్యంగా ఉపయోగించి.. పలువురి మరణాలకు కారణమవుతున్నారు. కాగా, గతంలోనూ చైనా మాంజా కారణంగా పలువురి ప్రాణాలు పోయాయి. అనేక పక్షులు కూడా మృతి చెందాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించింది. అయినప్పటికి కొందరు వాటిని అక్రమంగా విక్రయిస్తున్నారు. నైలాన్, చైనీస్, గ్లాస్ కోటెడ్ ఉన్న కాటన్ మాంజాలపై నిషేధం ఉంది. ఎందుకంటే.. వీటి కారణంగా పక్షులు, జంతువులకే కాదు మనుషులకూ ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.

చైనా మంజా.. పక్షులపాలిట యమపాశమే
చైనా మాంజా పక్షుల పాలిట యమపాశమే అవుతోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నిబంధనల మేరకు పతంగుల యాజమాన్యాలు సాధారణ దారాలనే విక్రయించాలి. గాలిపటాలు ఎగురవేసినప్పుడు అత్యధికంగా భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలకు చుట్టుకుంటాయి. అందువల్ల పక్షులతోపాటు మనుషులూ ఇబ్బందులకు గురవుతున్నారు. చైనా మాంజా వల్ల అనేక పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. పతంగులను సాధారణ ధారాలతోనే ఎగురవేస్తే జీవవైవిధ్యాన్ని కాపాడిన వారమవుతామని అధికారులు సూచించారు.

చైనా మంజా విక్రయాలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు
కాగా, ప్రతి సంవత్సరం చైనా మాంజా కారణంగా ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో మాంజా కారణంగా ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆ సంఘటన తర్వాత స్థానికులు మాంజా వాడకానికి వ్యతిరేకంగా గళమెత్తారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం మాంజాను నిషేధించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) కూడా గతంలోనే.. గాజు పూతపూసిన నైలాన్ లేదా సింథటిక్ చైనా మాంజాను అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మాంజా అమ్మిన వారికి, కొన్న వారికి ఒకటి నుంచి ఐదేళ్ల జైలుశిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా, లేదంటే రెండూ విధించేలా చట్టం చేసింది. సంబంధిత అధికారులు తనిఖీలు చేసి చైనా మంజాను అమ్మే విక్రయదారులపై చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ప్రమాదాలు తగ్గుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.