హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మ్యారేజీబ్యూరోల నయా దందా: అద్దెకు పెళ్లికూతుళ్లు, పార్కుల్లో పెళ్లిచూపులు!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పెళ్లికాని యువతీయువకుల అవసరాలను క్యాష్ చేసుకునేందుకు నగరంలో అనేక నకిలీ మ్యారేజీబ్యూరోలు వెలుస్తున్నాయి. పెళ్లి సంబంధాలు, పెళ్లి చూపుల పేరుతో తమ వద్దకు వచ్చే కస్టమర్లకు వేలాది రూపాయలు టోకరా వేస్తూ మాయమవుతున్నాయి. అంతేగాక, తమ వద్దకు వచ్చే కస్టమర్లకు పెళ్లికూతురు ఈమేనంటూ తమ వద్ద పని చేసే వారి ఫొటోలను, లేదా అద్దెకు కొందరు అమ్మాయిలను తీసుకొచ్చి చూపిస్తుండటం గమనార్హం.

ఆ తర్వాత తమకు నచ్చలేదంటూ ఆ అమ్మాయిలతో చెప్పిస్తున్నారు. ఇలా చాలా మంది పెళ్లికాని ప్రసాదులు డబ్బు కట్టి మోసపోతున్నారు. ఈ విషయాలు బయటికి చెబితే తమ పరువే పోతుందని వారు కూడా విషయాన్ని తమలోనే దాచుకుంటుండటంతో ఇలాంటి మోసాలు బయటికి రావడం లేదు. అయితే, కొందరు బాధితులు మాత్రం పోలీసులను ఆశ్రయించడంతో ఈరకమైన మోసాలు వెలుగులోకి వచ్చాయి.

ఇటీవల సీసీఎస్‌లోని మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వింగ్ దాడుల్లో పట్టుబడిన మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుల నిర్వాహకాన్ని చూసి పోలీసులే నివ్వెరపోయారు. మ్యారేజ్ బ్యూరోలు వందల్లో పెట్టుబడి పెట్టి.. వేలల్లో దోచుకుంటున్నారని తేలింది. వీరు ముందుగా పత్రికలు, ఇంటర్‌నెట్‌లో పెళ్లి సంబంధాల ప్రకటనలు ఇస్తారు. ఇవి చూసి వచ్చినవారి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు, తదితర ఖర్చుల నిమిత్తం వేలకు వేలు వసూలు చేస్తారు.

ఆ తర్వాత అద్దెకు లేదా వీరి కార్యాలయాల్లో పనిచేసే అమ్మాయిలను తీసుకువచ్చి పార్కుల్లో పెళ్లి చూపులు చూపిస్తారు. అనంతరం ఎదో ఒక కారణంతో నచ్చలేదని చెప్పిస్తారు. వేలవేలకు చెల్లించి, అడ్డంగా మోసపోయిన చాలా మంది.. బయటకు తెలిస్తే పరువు పోతుందని ఎవరికీ చెప్పకపోవడం గమనార్హం. కాగా, మోసపోతున్న వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటున్నారు.

భర్త చనిపోయి, పిల్లపాపలు లేకుండా కోట్ల రూపాయల ఆస్తి కల్గిన ఒంటరి మహిళలకు వయస్సు, కులం, మతంతో నిమిత్తం లేకుండా వరుడు కావాలంటూ కొన్ని దిన పత్రికలలో మ్యారేజ్ బ్యూరో పేరుతో ప్రకటన వేస్తుంటారు. అందులో ఉన్న నెంబర్‌ను చూసి చాలమంది ఫోన్లు చేస్తారు. ఫోన్ చేసిన వారికి వధువును చూపిస్తామని, అయితే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ బ్యూరో నిర్వాహకులు సూచిస్తారు. రూ. 1000 నుంచి రూ.8 వేల వరకు ఫీజు వసూలు చేస్తారు. అయితే వధువును చూపించడానికి తమ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని కొందరు, అద్దెకు మహిళలను తీసుకొచ్చి పెళ్లి చూపులు పెట్టిస్తున్నారు.

కొన్ని మ్యారేజీబ్యూరోలు తమ కార్యాలయాల్లోనే ఈ ఏర్పాట్లు చేస్తుండగా మరికొందరు పార్కుల్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు. అద్దెకు వచ్చే వధువులకు రోజుకు రూ. 600 నుంచి రూ. 1000 చెల్లిస్తున్నట్లు తెలిసింది. పెళ్లి సంబంధంలో వరుడికి, వధువు నచ్చిందని చెబితే... వధువుకు నచ్చలేదని బ్యూరో నిర్వాహకులు చెబుతారు. మరొక సంబంధం చూస్తామంటూ నమ్మించి, మరొక అద్దె మహిళ ఫోన్ నెంబర్ ఇచ్చేసి రెండు మూడుసార్లు మాట్లాడించి, ఆ డీల్ క్లోజ్ చేస్తుంటారు. ఇలా ఒక్కో ప్రకటన ఇచ్చినప్పుడల్లా 10 మంది వరకు బాధితులను మోసం చేస్తున్నారు.

 marriage bureau frauds in Hyderabad

ఇలా మోసాలకు పాల్పడిన వారి వివరాలను పరిశీలిస్తే.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లికి చెందిన లింగాల వెంకట సుబ్రమణ్యం సైదాబాద్‌లో, మహబూబ్‌నగర్ జిల్లా చిల్కమర్రికి చెందిన గోన సబితారెడ్డి హస్తినాపురంలో నివాసముంటున్నారు. వీరిద్దరు క లిసి దిల్‌సుఖ్‌నగర్‌లో సంకల్ప మ్యాట్రీమోనియల్ సర్వీసెస్ పేరుతో మ్యారేజీబ్యూరో నిర్వహిస్తున్నారు. పెళ్లి చూపులంటూ తెలుగు దినపత్రికలలో ప్రకటనలు ఇచ్చి అమాయకుల వద్ద నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు పేరిట రూ. 6 వేలు వసూలు చేసి, అద్దె పెళ్లి కూతుళ్లతో పెళ్లి చూపులు నిర్వహిస్తున్నారు. ఈ మ్యారేజ్‌బ్యూరోపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి డిసెంబర్ 7న వీరిద్దరినీ అరెస్ట్ చేశారు.

అలాగే, ఉప్పల్‌కు చెందిన బొంతల శ్రీనివాస్ కళ్యాణమస్తూ మ్యాట్రీమోనీ సర్వీసెస్ పేరుతో చైతన్యపురిలో మ్యారేజ్ బ్యూరో నిర్వహి స్తూ, పత్రికలలో వధువు, వరుడు కావాలంటూ ప్రకటనలు ఇస్తుంటాడు. ఈ క్రమంలో అంబర్‌పేట్‌కు చెందిన ఓ వ్యక్తి 52 ఏళ్ల వితంతువు, కోట్ల రూపాయల ఆస్తి ఉందని, వరుడు కావాలంటూ ప్రకటన చూసి బ్యూరోను సంప్రదించాడు. రిజిస్ట్రేషన్ కోసం రూ. 3 వేలు తీసుకొని, కార్యాలయంలో శ్రీలత అనే మహిళను పరిచయం చేశారు. రెండు రోజులు మాట్లాడిన తరువాత, ఫోన్ స్విచాఫ్ చేసింది. బాధితుడి ఫిర్యాదుతో నిర్వాహకుడిని నవంబర్ 15న పోలీసులు అరెస్ట్ చేశారు.

మరో కేసు గురించి.. సైదాబాద్ కాలనీకి చెందిన కట్ట సంధ్యారాణి అలియాస్ సుజాత, సరస్వతినగర్‌లో నందిని మ్యారేజ్ బ్యూరో పేరుతో ఒక సంస్థను నిర్వహిస్తుంది. పెళ్లి సంబంధాల కోసం వీరిని సంప్రదించిన వారితో ముందుగా బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తే, అమ్మా యి, అబ్బాయిల ఫొటోలు చూపిస్తామంటూ చెబుతుంటారు. డబ్బులు చెల్లించిన తర్వాత సెల్‌ఫోన్లు స్విచ్ అఫ్ చేస్తుంటారు. ఈ క్రమంలో లంగర్‌హౌస్‌కు చెందిన ఒక వ్యక్తి రూ. 10 వేలు డిపాజిట్ చేసి మోసపోయాడు. అతని ఫిర్యాదు మేరకు నవంబర్ 8వ తేదీన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా, ఇబ్రహీంపట్నం మండలం నర్రపల్లి గ్రామానికి చెందిన తాళ్ల కృష్ణ వనస్థలిపురంలో మ్యారేజ్ బ్యూరోను నిర్వహిస్తున్నాడు. పత్రికలలో ఇచ్చిన పెళ్లి సంబంధాల ప్రకటనను చూసి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మ్యారేజ్ బ్యూరోను సంప్రదించాడు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 5 వేలు బ్యాంకులో డిపాజిట్ చేయించుకున్నారు, తరువాత మరో రూ. 3 వేలు డిపాజిట్ చేస్తే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తామంటూ చెప్పడంతో అనుమానం వచ్చి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ఇది ఇలా ఉండగా, సూర్యపేట్‌కు చెందిన చిలుమూల మాధవరెడ్డి మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్నాడు. 48 ఏళ్ల వయస్సు, రూ. 15 కోట్ల ఆస్తి ఉన్న ఒంటరి మహిళకు వరుడు కవాలంటూ ఓ దిన పత్రికలో ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చూసిన తార్నాకకు చెందిన ఒక వ్యక్తి చైతన్యపురి, హనుమాన్‌నగర్‌లో ఉన్న శ్రీరస్తూ మ్యారేజ్ బ్యూరోకు వెళ్లి మాధవరెడ్డిని సంప్రదించాడు.

అయితే, వివరాలు చెప్పాలంటే రూ. 6 వేలు కట్టాలని, అప్పుడే వారితో మాట్లాడి మీకు ఫోన్ చేస్తామంటూ నమ్మించాడు. దీంతో బాధితుడు ఆ డబ్బులు చెల్లించాడు. తిరిగి రెండు రోజులకు ఒక మహిళ ఫోన్ చేసి రూ. 5 వేలు బ్యాంకులో డిపాజిట్ చేయాలని అప్పుడే పూర్తి వివరాలు వస్తాయంటూ చెప్పింది. దీంతో తాను మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

ఇలా చాలా మంది మ్యారేజీబ్యూరోల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. యువతీయువల అవసరాలను సొమ్ము చేసుకుంటూ తమ వ్యాపారాన్ని సాగించేస్తున్నారు. కాగా, యువతీ, యువకులు ఇలాంటి మ్యారేజీబ్యూరోలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

English summary
Police arrested some persons for Marriage bureau frauds in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X