భువనగిరి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం: ఎగిసిన మంటలు, భారీ ఆస్తి నష్టం
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణ శివారులోని పారిశ్రామికవాడలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పారిశ్రామికవాడలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పే వేశాయి. చుట్టుపక్కల ఇతర పరిశ్రమలకు ఈ మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

సాయికృష్ణ కంపెనీలో రాత్రి ఏడుగంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాట్ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్దారించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అగ్ని ప్రమాదంతో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు కంపెనీ యజమాని తెలిపారు.