ఖతం..గుడ్ బై..గయా.!అనే పదాలు లేవ్.!పరిణతి చెందిన రాహుల్ ప్రసంగం.!జోష్ లో టీపిసీసీ.!
హైదరాబాద్ : ఏఐసిసి మాజీ అద్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటన కాంగ్రెస్ నేతలు ఊహించినదానికంటే ఎక్కువగా విజయవంతం అయినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పర్యటనలో నేతల మధ్య నెలకొన్న సఖ్యత, కాంగ్రెస్ అగ్ర నేతలందరూ విభేదాలను పక్కన పెట్టి రాహుల్ పర్యటనను విజయవంతం చేసే ప్రక్రియలో చూపిన ఏకాగ్రత కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసినట్టు చర్చ జరుగుతోంది. అన్నిటికి మించి గతంలో కన్నా భిన్నంగా రాహుల్ గాంధీ ప్రసంగం, బాడీ లాంగ్వేజ్ ఉన్నట్టు పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

సూటిగా సుత్తి లేకుండా.. రాహుల్ రెండు రోజల పర్యటన సక్సెస్ అంటున్న శ్రేణులు
రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటన విజయవంతం కావడంలో ఎవరు ప్రధాన పాత్ర పోషించారనే అంశం కాసేపు పక్కన పెడితే పర్యటన విజయవంతం కావడానికి దోహదపడ్డ అంశాలను పరిగణలోకి తీసుకుంటే శ్రేయస్కరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ గత పర్యటనల్లో కనిపించిన దానికి భిన్నంగా కనిపించడంతో పాటు, నేతలతో వ్యవహరించిన తీరు, బాడీ లాంగ్వేజ్, ప్రసంగించిన విధానం, ఎందుకున్న అంశం అన్నీ పార్టీకి పెద్ద ఎత్తున ఉపయుక్తంగా మారినట్టు తెలుస్తోంది.

రాటు దేలిన రాహుల్.. ప్రసంగంలో వాడివేడిని పెంచిన రాహుల్
గత వేదికల మీద రాహుల్ గాంధీ ప్రసంగించినప్పుడు కొంత కంగారు, అస్పష్టత, అనువాదంలో జాప్యం, పదజాలం సరిగా వినియోగించలేకపోవడం వంటి అంశాలతో రాహుల్ గాంధీ ప్రసంగం పేలవంగా సాగేది. అసలు ప్రసంగంలో కీలక అంశం కనుమరుగయ్యేది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో రాహుల్ ప్రసంగించిన అంశాల పట్ల కాస్త అయోమయం నెలకొనేది. కాని తాజా పర్యటనలో ఈ పొరపాట్లకు టీపిసిసి సమర్ధవంతంగా చెక్ పెట్టింది. రాహుల్ గాంధీకి ముందస్తుగా ఫీడ్ బ్యాక్ ఇచ్చిన నేత సమగ్ర సమాచారం ఇచ్చారని, ప్రసంగం కూడా తెలంగాణ ప్రజలను తట్టే విధంగా తయారు చేసి వివరించారని, ఇది పార్టీకి బాగా ప్లస్ అయ్యిందనే చర్చ జరుగుతోంది.

శ్రేణుల్లో రాహుల్ స్పూర్తి నింపారు.. ఖఠినంగా కూడా వ్యవహరించారు
అంతే కాకుండా రెండు రోజుల పర్యటనలో రాహుల్ గాంధీ ఎంతో హుందాగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అకారణంగా నేతలకు విష్ చేయడం, అసందర్బంగా నవ్వడం, చేయకూడని ప్రసంగం చేయడం, ఇవ్వకూడని హామీలు ఇవ్వడం వంటి అంశాల జోలికి వెళ్లడం రాహుల్ చాలా వరకు నియంత్రించుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇద్దరు ముగ్గురు సీనియర్ నేతలతో పాటు పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి కి ప్రాదాన్యతనిస్తూ, ఇతర నేతలను ఎంటర్టెయిన్ చేయడం తగ్గించారు రాహుల్ గాంధీ.
దీంతో నేతలు ఒకరిమీద ఒకరు ఫిర్యదులు చేసుకోకుండా రాహుల్ పర్యటన ముగిసేంత వరకూ అటెన్షన్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

అయోమయం లేదు.. తడబాటు లేదు.. అంతా హుందాతనమే..
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఎంత స్పూర్తి నింపారో అంతే కఠినంగా కూడా వ్యవహరించారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడని వారు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించొద్దని, ఢిల్లీ వచ్చి టికెట్ల గురించి ఒత్తిడి తేవద్దని, కోవర్ట్ రాజకీయాలకు పాల్పడే వారు, క్రమశిక్షణ ఉల్లంఘించే వారు ఎంతటి సీనియర్లైనా పార్టీలో కొనసాగాల్సిన అవసరం లేదని, వారు నిర్బయంగా పార్టీనుండి వెళ్లిపోవచ్చని రాహుల్ గాంధీ సూటిగా స్పష్టం చేసారు. దీంతో నేతలందరూ ఒక్కసారిగా అలర్ట్ అయిన సందర్బం కనిపించింది. బాస్ అనే వాడు అప్పుడప్పుడు బాసిజమ్ చూపించకపోతే ఉద్యోగుల్లో చులకన అవుతారనే సిద్దాంతాన్ని రాహుల్ గాంధీ ఖచ్చితంగా పాటించారని తెలుస్తోంది. మొత్తానికి రాహుల్ గాంధీ గతంలో తడిబడినట్టు ఎక్కడా తడబడకుండా కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్టు చర్చ జరుగుతోంది.