కవిత వ్యాఖ్యలతో జీహెచ్ఎంసీ సమావేశంలో బీజేపీ, టీఆర్ఎస్ రచ్చ రచ్చ: నో రికార్డ్, బడ్జెట్ ఎంతంటే?
హైదరాబాద్: జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. జీహెచ్ఎంసీ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్ భేటీ అయ్యింది. అయితే, ప్రజా సమస్యలను లేవనెత్తుతూ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ నేతలకు వరికి గోధుమలకు తేడా తెలియదంటూ టీఆర్ఎస్ కార్పొరేటర్ కవిత చేసిన వ్యాఖ్యలతో బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు చర్చకుండా పక్కదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. సమావేశంలో ఆందోళనలను సద్దుమణిగించేందుకు టీఆర్ఎస్ కార్పొరేటర్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని మేయర్ తెలిపారు.

టీఆర్ఎస్ కార్పొరేటర్ కవిత వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్, వాగ్వాదం, ఘర్షణ
వివరాల్లోకి వెళితే.. మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. టీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ నేతలకు వరికి, గోధుమలకు తేడా తెలియదని టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎద్దేవా చేయటంతో.. సభలో గందరగోళం నెలకొంది. అభివృద్దిపై చర్చించకుండా సమావేశాన్ని పక్కదారి పట్టిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు మేయర్ పొడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ పనికిమాలిన పార్టీ అంటూ టీఆర్ఎస్ కార్పొరేటర్ కవిత చేసిన వ్యాఖ్యలు సభలో మరింత దుమారం లేపాయి. బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కవిత చేసిన ఆ వ్యాఖ్యలను రికార్డుల్లోంచి తొలగిస్తామని మేయర్ విజయలక్ష్మి ప్రకటించారు. అయినప్పటికీ.. బీజేపీ సభ్యులు శాంతించలేదు.

జీహెచ్ఎంసీ అధికారుల పనితీరుపై ఎంఐఎం కార్పొరేటర్ ఆగ్రహం
అంతకుముందు ఎంఐఎం కార్పొరేటర్ ఆగ్రహం..జీహెచ్ఎంసీ అధికారుల పనితీరుపై ఎంఐఎం కార్పొరేటర్ మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందన్నారు. పన్నులు కట్టేవారికి జరిమానాలు విధిస్తున్నారని, చెల్లించని వారి జోలికి పోవడం లేదన్నారు. దీనిపై స్పందించిన మేయర్.. చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు, చట్టానికి వ్యతిరేకంగా.. చాలా ఆలస్యంగా బడ్జెట్ సమావేశం పెడుతున్నారని మాజీద్ హుస్సేన్ మండిపడ్డారు. 2021-22 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2600 కోట్లు జీహెచ్ఎంసీకి కేటాయించిందని.. అందులో ఒక్క రూపాయి కూడా బల్డియాకు రాలేదన్నారు. జీహెచ్ఎంసీ ఫైనాన్స్ విభాగం అధికారులు ప్రభుత్వాన్ని ఎందుకు అడగడంలేదని నిలదీశారు..? ప్రజల కోసం పనిచేయాలని ఉందా.. లేదా..? అని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాకుండా ప్రజలపై భారం వేయడం హీనమైన చర్య అని మండిపడ్డారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం అంకెల గారడీగా కనిపిస్తుందని విమర్శించారు.

రూ. 6150 కోట్లతో జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్
ఇది ఇలావుండగా, హైదరాబాద్ మహానగర పాలక మండలి 2022-23కు గానూ రూ.6150 కోట్ల వార్షిక బడ్జెట్ను మేయర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పనలో ఫలప్రదమైన పురోగతి సాధిస్తోందని తెలిపారు. జీహెచ్ఎంసీని సరికొత్త హంగులతో విశ్వనగరంగా మార్చుకునే దిశలో 2022-23వార్షిక బడ్జెట్ను రూపొందించినట్లు మేయర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో రెవెన్యూ ఆదాయం రూ.3434 కోట్లు కాగా.. వ్యయం రూ.2800 కోట్లు.. రెవెన్యూ మిగులు రూ.634 కోట్లుగా బడ్జెట్లో చూపించారు. అదే విధంగా మూలధన ఆదాయం రూ. 3350 కోట్లు.. మూలధన వ్యయం కూడా రూ. 3350 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్లో ప్రధానంగా అభివృద్ది మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించినట్టు మేయర్ వివరించారు. హైదరాబాద్ నగర అభివృద్దికి సిటిజన్ సమస్యల పరిష్కారానికి ఉపయుక్తంగా ఉండేలా రూపొందించినట్లు తెలిపారు.

హైదరాబాద్ అభివృద్ధి, సుందరీకరణ కోసం నిధులు: మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్ నగరంలో రోడ్ల అభివృద్ది, స్కైవేలు, అండర్ పాస్లు , ప్లైఓవర్లు, ప్రధాన రోడ్ల మెయింటెనెన్స్ కోసం రూ.1500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. వ్యుహాత్మక నాలాల అభివృద్ది పథకం ఎస్ఎన్డీపీలో భాగంగా చేపడుతున్న పనులకు రూ. 340 కోట్లు, ఇతర నాలా పనుల నిర్వహణ కోసం రూ.200 కోట్లు.. మొత్తంగా వరద నివారణ కోసం రూ.540 కోట్లు ఈ ఏడాది ఖర్చు చేయనున్నాం. ప్రజా అవసరాలు, మౌలిక సదుపాయాల కోసం రూ.146 కోట్లు ఖర్చు చేస్తాం. నగరంలో థీమ్ పార్కుల అభివృద్ది కోనసాగుతుండగా.. గ్రీనరీ మరింతగా పెంచడమే లక్ష్యంగా ఈ వార్షిక బడ్జెట్లో 332.23 కోట్లతో గ్రీన్ బడ్జెట్ కేటాయించాం. ప్రతి భోజనంపై రెండు రూపాయల అదనపు భారాన్ని సైతం భరించి నగరంలో అభాగ్యుల ఆకలి తీర్చడం కోసం జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసిందని మేయర్ విజయలక్ష్మి తెలిపారు.