• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గ్రేటర్ మేయర్ పీఠంపై ఉత్కంఠ: విజయలక్ష్మి వైపే మొగ్గు, పౌరసత్వమే అడ్డవుతుందా?

|

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టిఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు మేయర్ పదవిని ఎవరికి కట్టబెట్టాలన్న అంశంపై తీవ్రంగా చర్చిస్తోంది. ఈ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను టిఆర్‌ఎస్ 99 డివిజన్లను సొంతం చేసుకుని సింగిల్ మెజారిటీ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరిని వరిస్తాయనేది ఉత్కంఠగా మారింది.

కాగా, ఈసారి మేయర్ పీఠం బీసీ జనరల్‌కు రిజర్వు అయింది. పరోక్ష పద్ధతిలో కార్పొరేటర్లే మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకుంటారు. ఎక్స్‌అఫీషియో ఓట్లు కూడా అవసరం లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకునే స్థాయిలో టిఆర్‌ఎస్ మెజారిటీ సాధించింది. దీంతో కార్పొరేటర్లుగా గెలిచిన పలువురు నేతలు మేయర్ పీఠంపై ఆశలు పెంచుకున్నారు.

ఎన్నికల ప్రచారం సమయంలోనే టిఆర్‌ఎస్ మేయర్ అభ్యర్థులుగా పార్టీ యువజన విభాగం నేత బొంతు రామ్మోహన్, టిఆర్ఎస్ సెక్రెటరీ జనరల్, ఎంపీ కె కేశవరావు(కేకే) కుమార్తె విజయలక్ష్మిల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే గ్రేటర్ మేయర్ పీఠం విజయలక్ష్మినే వరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, పలువురు టిఆర్ఎస్ నేతలు విజయలక్ష్మి పౌరసత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Mayor post: Vijayalakshmi's citizenship under scrutiny

హైదరాబాద్ నగరానికి చెందిన విజయలక్ష్మి 2004 వరకు అమెరికాలో అక్కడి పౌరురాలిగా ఉన్నారు. 26ఏళ్లపాటు అమెరికాలో ఉన్న ఆమె.. 1988లో గ్రీన్ కార్డ్ పొందారు. వివాహ అనంతరం కూడా అక్కడే ఉన్నారు. 1999లో ఆమె అమెరికన్ పౌరసత్వం తీసుకున్నారు. ఆ తర్వాత దాన్ని వదులుకుని మనదేశానికి వచ్చి 2009లో భారత పౌరసత్వాన్ని పొందారు విజయలక్ష్మి.

‘మేయర్ ఎన్నికలకు కొన్ని సాంకేతిక సమస్యలున్నాయి. అయితే ఎన్నికలు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయి' అని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పుల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కాగా, పౌరసత్వ చట్టం 1955, సెక్షన్ 5 ప్రకారం భారతదేశానికి చెందిన వ్యక్తి విదేశాలకు వెళ్లి అక్కడి పౌరసత్వం తీసుకున్న తర్వాత.. మళ్లీ భారత పౌరసత్వం పొందాలంటే కనీసం ఐదేళ్లు భారతదేశంలో ఉంటే సరిపోతుంది.

కాగా, 2009 డిసెంబర్‌లోనే విజయలక్ష్మి భారత పౌరసత్వాన్ని పొందారు. అంటే దాదాపు ఐదేళ్లు పూర్తయ్యాయి. కానీ, ఆమె ప్రత్యర్థులు ఈ అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ అధిష్టాన నిర్ణయానికి వారందరూ కట్టుబడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

‘భారత పౌరసత్వం పొందాలంటే కనీసం ఐదేళ్లపాటు ఇక్కడ నివాసం ఉండాలి. అది నేను పూర్తి చేశాను. కాబట్టి మేయర్ పదవి చేపట్టేందుకు నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రస్తుతం నేను ప్రజలు ఎన్నుకోబడిన కార్పరేటర్‌ను' అని విజయలక్ష్మి తెలిపారు. చాలా మంది ఆశావాహులున్నప్పటికీ సీఎం కెసిఆర్ నిర్ణయమే శిరోధార్యమని టిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు తెలిపారు.

ఇది ఇలా ఉండగా, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఆయన తనయుడు, మంత్రి కెటి రామారావు తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. కాగా, డిప్యూటీ మేయర్ పదవిని ముస్లిం కార్పొరేటర్ అయిన బాబా ఫసియుద్దీన్‌కు కట్టబెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎన్నిక జరగాల్సిన ఫిబ్రవరి 11వ తేదీ దాకా మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల విషయంలో ఇదే గోప్యత కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Even as the Telangana Rashtra Samithi (TRS) basks in victory after the just-concluded GHMC polls, the mayoral race has gathered steam with contenders lobbying hard for the post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X