వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేరెళ్లకు మీరా కుమార్: కెటిఆర్ ఇలాకాలో ఇదీ అసలు కథ...

రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో బాధితులను కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ సోమవారం పరామర్శిస్తారు. హైకోర్టు అనుమతి ఇస్తే నేరెళ్లలో బహిరంగ సభ నిర్వహించాలని..

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో బాధితులను కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ సోమవారం పరామర్శిస్తారు. హైకోర్టు అనుమతి ఇస్తే నేరెళ్లలో బహిరంగ సభ నిర్వహించాలని.. లేకుంటే బాధితులను పరామర్శించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. నేరెళ్ల పర్యటన నేపథ్యంలో మీరాకుమార్‌ ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చి కరీంనగర్‌ చేరుకున్నారు.

నేరెళ్ల, జిల్లెల, రామచంద్రాపూర్‌ గ్రామాలకు చెందిన 8 మంది దళితులను పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ టీపీసీసీ ఇప్పటికే ఈ ఘటనపై ఆందోళనలు నిర్వహించింది. నేరెళ్లలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించగా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో అనుమతి కోసం పార్టీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. కార్యక్రమాన్ని వాయిదా వేయకూడదని భావించిన కాంగ్రెస్‌.. నేరెళ్ల బాధితుల పరామర్శకు సిద్ధమైంది.

హైకోర్టులో సోమవారం బహిరంగ సభకు అనుమతి వస్తే సభ నిర్వహించాలని నిర్ణయించారు. అనుమతి రాకుంటే మీరాకుమార్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇతర కాంగ్రెస్‌ నేతలు నేరెళ్ల, జిల్లెల, రామచంద్రాపూర్‌ గ్రామాల్లో పర్యటించి బాధితులను పరామర్శిస్తారు.

మానేరు ప్రాజెక్టు మునక ప్రాంతంలో ఇసుక తరలింపు ఇలా

మానేరు ప్రాజెక్టు మునక ప్రాంతంలో ఇసుక తరలింపు ఇలా

రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులపై జరిగిన దాడి అమానుషమని, సభ్య సమాజం తలదించుకునేలా ఉందని లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ అన్నారు. దళితులపై దాడులు ప్రభుత్వానికి మంచిది కాదని మీడియాతో అన్నారు. అమాయకులను అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. బాధితులను పరామర్శించి భరోసా ఇవ్వడానికే నేరెళ్లకు వెళ్తున్నట్లు తెలిపారు. మీరాకుమార్‌తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లుభట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు సంపత్‌, రామ్మోహన్‌రెడ్డి ఉన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో మానేరు నదిపై మధ్య మానేరు జలాశయాన్ని నిర్మిస్తున్నారు. దీని పరిధిలో ఇసుక తరలిస్తున్న లారీలతో స్థానికులు గజగజ వణికిపోతున్నారు. ఆయా లారీలు హద్దుల్లేని వేగంతో దూసుకెళ్లుతుండంతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. ఇసుక రవాణాపై సీనరేజీ చెల్లింపునకు.. తరలిస్తున్న దానికీ పొంతనే కుదరకపోగా, అధికార యంత్రాంగం పర్యవేక్షణ కూడా లేకపోవడంతో ఇసుక మాఫియా పరిమితికి మించి ఇసుక తరలిస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పరిమితి లేకుండా ఇసుక రవాణా

పరిమితి లేకుండా ఇసుక రవాణా

రాజన్న- సిరిసిల్ల జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో మగ్గుతున్నారు. పరిమితికి మించి ఇసుక.. పగలూ రాత్రీ తేడా లేకుండా ఇరుకైన రోడ్లపై వాయువేగంతో ప్రయాణం.. వెరసి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కాదు.. అసలు వినే నాథుడే లేడు. ఫలితంగా రెండు నెలల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రహించిన మూడు గ్రామాల ప్రజలు మూడు వాహనాలను దహనం చేశారు. ఈ క్రమంలో కొందరు పోలీసులపైనా దాడికి దిగారు. కేసులు నమోదు చేసిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్న వారితో వ్యవహరించిన తీరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. సరైన పర్యవేక్షణ లేకే ఈ ఇసుక రవాణా తీవ్ర విపరిణామాలకు దారితీస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అనుమతి ఎంత? తరలించేదెంత?

అనుమతి ఎంత? తరలించేదెంత?

ప్రాజెక్టు ముంపు ప్రాంతంలోని ఇసుకను రాజన్న- సిరిసిల్ల జిల్లాతోపాటు సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌, జనగాం జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న జలాశయాలు, కాలువలు, రెండు పడక గదుల ఇళ్లకు కేటాయించారు. ఇందుకోసం మానేరు నదిలో ముంపు గ్రామమైన చింతల్‌ఠాణా సమీపంలో ఇసుక క్వారీ ఏర్పాటు చేశారు. రెండు పడక గదుల ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తోంది. ప్రాజెక్టుల పనులకు సీనరేజీని నీటి పారుదలశాఖ గుత్తేదారుల నుంచి తీసుకొని నేరుగా గనుల శాఖకు చెల్లిస్తోంది. దీంతో ఈ జిల్లాల్లో ఆయా పనులు దక్కించుకున్న గుత్తేదారులు ఇక్కడి నుంచి ఇసుక తరలింపునకు అనుమతి పొందారు. ఆయా పనులకు నిత్యం 500లకు పైగా లారీలతో ఇక్కడి నుంచి ఇసుక తరలిస్తున్నారు. ఈ తరలింపు పైకి సక్రమంగా కనిపిస్తున్నా.. ఇష్టారాజ్యంగా ‘దందా' సాగుతోంది. మధ్య మానేరు జలాశయం ముంపు ప్రాంతంలో 2.16 కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు టీఎస్‌ఎండీసీ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు గుత్తేదారులు 24 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తీసుకెళ్లినట్లు గనుల శాఖాధికారులు చెబుతున్నారు. గుత్తేదారులు సీనరేజీ చెల్లిస్తున్న దానికి.. తరలిస్తున్న దానికి పొంతనలేదు. 12 టైర్ల లారీలో 31 టన్నులకు మించి ఇసుక తరలించకూడదు. కానీ, ఇక్కడ 40 టన్నులకు పైగానే ఇసుక తరలిస్తున్నారు. లారీలు రావడం.. పొక్లెయిన్లతో పరిమితికి మించి నింపుకొని వెళ్లడం సాధారణమైంది.

ఇష్టారాజ్యంగా రవాణా ఇలా

ఇష్టారాజ్యంగా రవాణా ఇలా

చింతల్‌ఠాణా క్వారీ నుంచి కేటాయించిన ఇసుక ఎంత? వారెంత తీసుకెళ్తున్నారు. పోవాల్సిన చోటుకే ఇసుక పోతోందా..? ఇలా ఏ ఒక్క అంశాన్నీ పర్యవేక్షించే వ్యవస్థే లేదు. కనీసం వేబ్రిడ్జి ఏర్పాటు చేయలేదు. సీనరేజీ తీసుకోవడంతోనే తమ పని ముగిసిందని నీటి పారుదల శాఖ.. ఉచితంగా ఇస్తున్నదాన్ని ఏం పర్యవేక్షిస్తామని రెవెన్యూ శాఖ.. ముంపు ప్రాంతంలోని ఇసుక కావడం, తమ శాఖ పరిధిలో పనులకే వినియోగిస్తున్నారనే కారణంతో నీటి పారుదల శాఖ.. ఇలా ఎవరికి వారు మిన్నకుండడంతో ఇసుక తరలింపు ఇష్టారాజ్యంగా మారింది. ఇసుక లారీలు సామర్థ్యానికి మించిన బరువుతో అతి వేగంగా వెళుతున్నాయనే దానికి రవాణా శాఖ చేసిన తనిఖీలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్‌ నెలాఖరు వరకు రవాణాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి 300 కేసులు నమోదు చేశారు. ఓవర్‌లోడ్‌ విషయంలో రూ.40 లక్షల జరిమానాలు విధించారు.

అతి వేగం, ఓవర్‌లోడుకు సంబంధించి 200 మంది డ్రైవర్ల లైసెన్సులను సస్పెండ్‌ చేశారు. లారీల అతి వేగం ప్రమాదభరితంగా తయారైంది. చింతల్‌ఠాణా క్వారీ నుంచి లారీలు గోపాల్‌రావుపల్లి, తాడూరు మీదుగా సిరిసిల్ల-సిద్దిపేట ప్రధాన రహదారిపైకి చేరుతాయి. ప్రధాన రహదారి ఎక్కిన వెంటనే అపరిమిత వేగంతో దూసుకెళ్తున్నాయి. ప్రధాన రహదారిపై తంగెళ్లపల్లి, సారంపల్లి, బద్దెనపల్లి, నేరెళ్ల, జిల్లెల గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో మూలమలుపుల వద్ద ఎక్కడా ప్రమాద సూచికలు లేవు. గతంలో ఇసుక అక్రమ రవాణా సమయంలో ఎవరికీ కంటపడకూడదనే భావనతో వేగంగా వాహనాలు నడిపేవారు. ఇప్పుడేమో ఎక్కువ ట్రిప్పులు వేస్తే ఎక్కువ కిరాయి వస్తుందనే ఆశతో వేగంగా నడుపుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సిరిసిల్ల-సిద్దిపేట రహదారిలో లారీల వేగంతో రెండేళ్లలో 12 మంది మృత్యువాతపడ్డారు. మృతులంతా దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలే.

ఎదురు తిరిగినందుకు చిత్రహింసలు?

ఎదురు తిరిగినందుకు చిత్రహింసలు?

నేరెళ్లకు చెందిన బదనపురం భూమయ్య (65) పందుల వ్యాపారి. ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం తన ఇంటి నుంచి పొరుగున ఉన్న జిల్లెలకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఇసుక లారీ ఢీకొని చనిపోయారు. ఇసుక లారీల విషయంలో అప్పటికే పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రజల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. జిల్లెల, నేరెళ్ల, సమీపంలోని రామచంద్రాపూర్‌కు చెందిన వందల మంది అక్కడకు చేరుకున్నారు. ఇసుక లారీలను ఆపి మూడింటికి నిప్పు పెట్టారు. ఆందోళన చేయి దాటిపోతుండడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆగ్రహించిన ఆందోళనకారులు ఎదురుదాడికి దిగారు.

ఆందోళనను చిత్రీకరించిన పోలీసులు 12 మందిపై కేసులు నమోదు చేశారు. 8 మందిని ఠాణాలకు పిలిచి నాలుగు రోజులపాటు రహస్యంగా విచారించారు. తర్వాత న్యాయస్థానంలో హాజరుపర్చారు. అక్కడి నుంచి కరీంనగర్‌ జైలుకు తరలించారు. కానీ, గాయపడి నడవలేని స్థితిలో ఉన్న వారిని జైలు అధికారులు కారాగారంలో చేర్చుకునేందుకు నిరాకరించారు. విషయం బయటకు పొక్కడంతో వారిని కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారు వివిధ వ్యాధులతో బాధపడుతున్నారని, తాము థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తే న్యాయస్థానంలోనే చెప్పేవారని పోలీసులు వాదిస్తున్నారు. తమవారిని చిత్రహింసలు పెట్టారనీ, కోర్టులో చెబితే ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరించినందునే వాళ్లు ఏమీ చెప్పలేదని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసులు నమోదైన మరో నలుగురు పరారీలో ఉన్నారు.

మరమ్మత్తులు చేశాకే అనుమతిస్తామని గ్రామస్తులు ఇలా

మరమ్మత్తులు చేశాకే అనుమతిస్తామని గ్రామస్తులు ఇలా

లారీల విపరీత వేగం, ఓవర్‌ లోడుతో గ్రామాల్లో, బయట రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గోపాల్‌రావుపల్లిలో మంచి నీటిపైపులైన్లు ధ్వంసం కావడం, రహదారి గుంతలమయం కావడంతో వాటికి మరమ్మతులు చేయించాకే లారీల రాకపోకలకు అనుమతిస్తామని ఇటీవల గ్రామస్థులు వాటిని నిలిపివేశారు. రాత్రివేళ్లలో లారీల వేగం ధాటికి ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. లారీ ఢీ కొట్టడంతో తమ తండ్రి చనిపోయాడని నేరెళ్ల భూమయ్య కూతురు లక్ష్మీ వాపోయింది. పోలీసులు కేసులు నమోదు చేయడంతో తన తమ్ముడు ఎక్కడికో వెళ్లిపోయాడని, వీటన్నింటితో తమ అమ్మ ఆరోగ్యం పాడై దవాఖానాలో చేరిందని, తమ్ముడైనా క్షేమంగా ఉంటే చాలునంటున్నారు.

‘నా కొడుకు ఈశ్వర్‌ (26) ఆ రోజు గొడవ జరుగుతుంటే అందరితోపాటు వెళ్లాడు. పోలీసులు తీసుకెళ్లి కాళ్లు, నడుముపై బాగా కొట్టారు. దవాఖానాలో ఉన్నా మమ్మల్ని చూడనివ్వడం లేదు. నా భర్త ఏ పనీ చేయలేడు. ఇప్పుడు కొడుకూ పోలీసు దెబ్బలకు ఏ పనీ చేయలేనివాడయ్యాడు. మా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? ' నేరెళ్ల వాసి పీ కళావతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలపై రాజన్న - సిరిసిల్ల జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తనయుడు, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు ఎదురు దాడికి దిగారు.

కాంగ్రెస్ పార్టీ రక్తాలు పారిస్తే తాము నీరు పారిస్తున్నామని పేర్కొన్నారు. అంతటితో ఆగక టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేశారు. కానీ నేరెళ్ల ఘటనలో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తి చేసి ఉండవచ్చు.. కానీ రెండేళ్లలో 12 మంది మరణానికి కారణమైన ఇసుక తరలిస్తున్న లారీల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదన్నదని మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

English summary
Lok Sabha ex Speaker Meira Kumar would visit Nerella and adjacent villages and meets with dalits who tortured with police recently. 12 members people died in last Two years because of over speed of Sand lorries and Trucks. Recently also one person Bhumaiah died in accident. With this incident angered by locals and they took agitation part. But Telangana Govt hasn't to save these people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X