కీచకపర్వం: యువతిపై గ్యాంగ్ రేప్, వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో అత్యంత నీచమైన సంఘటన జరిగింది. మానవత్వం తలవంచుకునే ఈ ఘటన జిల్లాలోని రామడుగు మండలం గోపాల్రావుపేటలో జరిగింది. ఈ సంఘటన కాస్తా ఆలస్యంగా వెలుగు చూసింది. ఇద్దరు యువకులు, ఓ వృద్ధుడు కలిసి మతి స్థిమితం లేని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దాంతో ఆగకుండా వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం - గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని యువతి(18)ని 15 రోజుల కిందట ఇద్దరు యువకులు, ఓ వృద్ధుడు పంటపొలాల్లోకి లాక్కెళ్లి నగ్నంగా నృత్యం చేయిస్తూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను తరచు మొబైల్లో చూస్తూ ఇతరులకు పంపారు.

దీంతో ఈ దృశ్యాలు ఒకరి నుంచి మరొకరికి చేరాయి. విషయం తెలుసుకున్న యువతి బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తిర్మలాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు, వృద్ధుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.
రాజయ్య అనే 57సంవత్సరాల వృద్ధుడు, ఆయనతోపాటు 20 ఏళ్ల వయసున్నలక్ష్మణ్, రాకేష్‌లు అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీడియో 31నుంచి 5వ తేదీ వరకు వాట్సాప్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలో వీడియో ప్లే అయింది. చివరికి వీడియో కరీంనగర్ పోలీసులకు చేరడంతో వారు కేసును సుమోటోగా తీసుకున్నారు. ఈ ముగ్గురిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.