Rains in Telangana : తెలంగాణకు ఇవాళ,రేపు భారీ వర్ష సూచన-ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శని,ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందునా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉత్తర, వాయవ్య దిశల నుంచి రాష్ట్రంలోకి వీస్తున్న గాలుల ప్రభావంతో భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.
శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవగా.. శనివారం కూడా పలుచోట్ల వర్షాలు కురిశాయి. పెద్దపల్లి,మంచిర్యాల సహా పలు ఉత్తరాది జిల్లాలో ఒక మోస్తరు వర్షం కురిసింది.హైదరాబాద్ నగరంలో శనివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే.దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వర్షాల వల్ల ఇబ్బందులు పడే ప్రజల కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంను అందుబాటులోకి తీసుకొచ్చారు. వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగిన జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం ఫోన్ నంబర్ 040 2111 1111లో సంప్రదించవచ్చు.

అటు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. వాతావరణ పరిస్థితులను బట్టి పౌరులు తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. నగరంలోని పలు కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
శుక్రవారం హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్,ఆర్టీసీ క్రాస్ రోడ్,విద్యానగర్,నల్లకుంట,రాంనగర్ శంషాబాద్, రాజేంద్రనగర్, కిస్మత్‌పురా, పాతబస్తీ, గోల్కొండ, చంపాపేట్, సైదాబాద్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం,జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, బీఎన్‌రెడ్డి నగర్, హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్ మెట్, అనాజ్‌పూర్‌లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.దీంతో చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన అత్యవసర విభాగాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. పాతబస్తీలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మెట్రో స్టేషన్ల కింద భారీగా వర్షపు నీరు నిలిచింది. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్నాయి.
హైదరాబాద్ లోని జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ చెరువులకు వరద ప్రవాహం పోటెత్తింది.దీంతో అధికారులు రెండు చెరువుల నుంచి మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తి 1,400 క్యూసెక్కులు, ఉస్మాన్‌సాగర్ 4 గేట్లు ఎత్తి 960 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.హైదరాబాద్ వాతావరణ విభాగం చెప్పిన వివరాల ప్రకారం, నగరంలోని లింగోజిగూడలో 10.6 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, కుర్మగూడలో 10 సెంమీ, హస్తినాపురం 8.8, ఆస్మాన్‌ఘడ్ 8.7, సర్దార్ మహల్ 8.6, కంచన్‌బాగ్ 8.4, జూ పార్క్ 8, అల్కాపురి కాలనీ 7.1, అత్తాపూర్ 7, రాజేంద్రనగర్‌లో 6.6 సెం.మీ వర్షపాతం నమోదైంది.