మీ బోగస్ రైతుడిక్లరేషన్ ఎవరూ నమ్మరు రాహుల్.. కాంగ్రెస్ ఎంపీకి మంత్రి ఎర్రబెల్లి సూటిప్రశ్నలు
కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభ పై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీకి మంత్రి ఎర్రబెల్లి పలు సూటి ప్రశ్నలను సంధించారు

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రుణ మాఫీ చేశారా..?
రైతు డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్ గాంధీని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రుణ మాఫీ చేశారా..? అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. మీరు అధికారం వున్నప్పుడు రైతు బంధు, రైతు బీమా ఎందుకు ఇవ్వలేదు..? అని నిలదీశారు. మీ బోగస్ మాటలు రైతులు నమ్మరు అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి ఎందుకు అనుసంధానం చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని నిలదీశారు.

పరిశ్రమలు మూసేసింది కాంగ్రెస్ పార్టీ కాదా..?
మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ధాన్యం కొనకపోవడం వల్లే తెలంగాణకు తీసుకువచ్చి అమ్ముకుంటున్నారు అంటూ విరుచుకుపడ్డారు. అంతేకాదు చెరుకు పరిశ్రమలు మూసేసింది కాంగ్రెస్ పార్టీ కాదా..? అని ప్రశ్నించిన ఎర్రబెల్లి పోడు భూముల సమస్య తలెత్తింది కాంగ్రెస్ పాలనలోనే అంటూ ధ్వజమెత్తారు. మీరు అధికారంలో వున్నప్పుడు పోడు భూముల సమస్యను ఎందుకు పరిష్కరించలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి ఒక సక్సెస్ స్కీం అని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి, ధరణి పోర్టల్ పై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

రైతులను మోసం చేసే బోగస్ సభ
నకిలీ విత్తనాల సృష్టికర్తలే మీరు అంటూ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. రైతులను మోసం చేసే బోగస్ సభ ఇది, సిగ్గులేకుండా రైతులను తప్పుడు హామీలతో మోసం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీతో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి.. మీ పతనం ఖాయం అంటూ తేల్చి చెప్పారు. మీరు వచ్చి కాళ్లు పట్టుకున్నా మిమ్మల్ని ఎవరు నమ్మరు అన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీరు దేశానికి చేసిందేమీ లేదని నిప్పులు చెరిగారు. కేవలం స్వతంత్రం తెచ్చిన కుటుంబమని మీకు పాలించే స్వేచ్ఛ ఇచ్చారన్నారు. తెలంగాణ కు స్వతంత్రం తెచ్చిన మహానుభావుడు కేసీఆర్ అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు

రాహుల్ అంత సమర్ధులైతే యూపీలో ఎందుకు ఓడిపోయారు
కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను పెండింగ్ పెడితే, ఆ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పుకొచ్చారు. దేశంలో రైతుల కోసం పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కితాబిచ్చారు. 24 గంటల కరెంటు ఎక్కడైనా ఇస్తున్నారా చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముందు మీరు చేసినవి చెప్పండి.. చేయగలిగేది చెప్పండి అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను మసిపూసి మారేడుకాయ చేయొద్దని హితవు పలికారు. రాహుల్ అంత సమర్ధులైతే యూపీలో ఎందుకు ఓడిపోయారు చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మా కార్యకర్తలు నిర్వహించే సభ స్థాయిలో కూడా సభ లేదంటూ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏనాడో చచ్చుబడిపోయింది
రాష్ట్రంలో మొత్తం 50 వేల మంది కూడా సభకు రాలేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఇక రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన ఎర్రబెల్లి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలీదు అంటూ వ్యాఖ్యానించారు. ఆయన మాటలను ఎవరూ నమ్మరు అంటూ తేల్చి చెప్పారు. 70 ఏళ్లపాటు రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని రాహుల్ గాంధీ ఒప్పుకున్నారు అంటూ వ్యాఖ్యానించారు. బిజెపి రైతుల కోసం వ్యతిరేకంగా తీసుకువచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకించడం వల్ల బీజేపీతో తమకు తగాదా మొదలైందని, రైతు సంక్షేమం కోసం బిజెపితో పోరాటం చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానూ పోటీ కాదని, ఆ పార్టీ ఏనాడో చచ్చుబడి పోయిందని, ప్రజలు ఎవరూ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు.