మంత్రి ఎర్రబెల్లి వర్సెస్ నన్నపునేని నరేందర్; రైతు దీక్షలో బయటపడ్డ టీఆర్ఎస్ నేతల అంతర్గతపోరు
తెలంగాణ రాష్ట్ర రైతాంగం సాగుచేసిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా కేంద్రాలలో టిఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కొనసాగిన ఆందోళన కార్యక్రమాలలో టిఆర్ఎస్ పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. రైతు దీక్ష సాక్షిగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్సెస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వివాదం కొనసాగింది.
రేపు జిల్లాకేంద్రాలలో ఉధృతంగా ధర్నాలు; ప్రతి రైతు ఇంటిపై నల్లజెండాలు: మంత్రి ఎర్రబెల్లి

రైతు దీక్ష సాక్షిగా బయటపడ్డ అంతర్గత విబేధాలు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలు ఈరోజు నిర్వహించిన రైతుదీక్ష సాక్షిగా మరోమారు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు. ఇతర పార్టీల నుండి వచ్చిన నాయకులందరూ టిఆర్ఎస్ పార్టీ లోనే చేరడంతో జిల్లావ్యాప్తంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఒకరిని మించి ఒకరు జిల్లాపై పట్టుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

మంత్రి ఎర్రబెల్లి వర్సెస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఇక తాజాగా వరంగల్ తూర్పు నియోజకవర్గం లో నిర్వహించిన రైతు దీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు రైతు దీక్షలో పాల్గొంటున్న నేపథ్యంలో స్థానిక ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. రైతు దీక్షలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమంలో మాట్లాడి వెళ్ళిపోయే వరకు కూడా దీక్షా స్థలానికి ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ రాలేదు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్లిపోయిన తర్వాత వచ్చిన ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ రైతు దీక్షలో పాల్గొన్నారు.

మంత్రి వెళ్ళిపోయే దాకా రైతు దీక్షలో పాల్గొనని నన్నపునేని నరేందర్
ఇక ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య అంతర్గత పోరాటం కొనసాగుతుందని, మంత్రి వైఖరిపై నిరసనగానే నన్నపనేని నరేందర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్న రైతు దీక్షలో పాల్గొనకుండా ముఖం చాటేశారని చర్చ జరుగుతుంది. వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న నన్నపనేని నరేందర్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పెత్తనం చెలాయిస్తున్నారు అన్న అభిప్రాయం మొదట్నుంచీ నన్నపనేని వర్గీయుల లో ఉంది.
