
బిజీబిజీగా మంత్రి కేటీఆర్: నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇదే!!
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల చాలా బిజీబిజీగా గడుపుతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి వ్యూహాత్మకంగా పర్యటనలను సాగిస్తున్నారు. ఒకపక్క రాష్ట్రంలోని అనేక జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూనే, పార్టీని బలోపేతం చెయ్యాటానికి కృషి చేస్తున్నారు. మరోపక్క కేంద్ర మంత్రులను కలవడానికి ఢిల్లీ బాట పడుతున్నారు. ఒక్క రోజు కూడా విశ్రమించకుండా కేటీఆర్ ఇప్పటినుండే భవిష్యత్ ఎన్నికలకు చాప కింద నీరులా పని చేసుకుపోతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి మూడోసారి గులాబీ జెండా ఎగురవెయ్యాలని మంత్రి కేటీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన జిల్లాల పర్యటన సాగుతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న ఢిల్లీ పర్యటన చేసి కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసి నిధుల కోసం విజ్ఞప్తి చేసిన మంత్రి కేటీఆర్ తాజాగా నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, సిరిసిల్ల లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మంత్రి కేటీఆర్.

ఇక మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలు చూస్తే ఉదయం 11 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని రెడ్డి సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. 11 గంటల 30 నిమిషాలకు జిల్లా రెడ్డి సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు కలెక్టరేట్ లో జిల్లా న్యాయవాదులతో మంత్రి కేటీఆర్ సమావేశమవుతారు. మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై నిమిషాలకు ఎల్లారెడ్డిపేట కు చేరుకుంటారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు గంభీరావుపేటలో జగదాంబ దేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముస్తాబాద్ మండలం లో యాదవ సంఘం భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటన నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.