సీసీఐను పునఃప్రారంభించడం లేదంటే.. తెలంగాణ యువతకు ద్రోహం చేయడమే.. కేంద్రానికి కేటీఆర్ లేఖ..
తెలంగాణ ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి మరో లేఖ రాశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తిరిగి ప్రారంభించాలని కోరారు. ఇక్కడ సీసీఐను పున:ప్రారంభించేందుకు అవససరమైన సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గతంలో అనేక సార్లు దీనిపై విజ్ఞప్తులు చేసినా స్పందించలేదన్నారు. సీసీఐ యూనిట్‌ను తిరిగి ప్రారంభించకపోవడమంటే తెలంగాణ యువతకు తీరని ద్రోహం చేసినట్టేనని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆదిలాబాద్‌లోని సీసీఐను పున:ప్రారంభించండి..
ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పున:ప్రారంభించాలని కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండేలకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సీసీఐ యూనిట్‌ను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. నిర్వహణకు అవసరమైన విశాలమైన 772 ఎకరాల ప్రాంగణం, 170 ఎకరాల సీసీఐ టౌన్ షిప్, 1500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
విద్యుత్ సరఫరా పాటు , నీటి లభ్యత పుష్కలంగా ఉందన్నారు. సిసిఐ యూనిట్ తిరిగి ప్రారంభిస్తే తెలంగాణకే కాకుండా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా సిమెంట్ సప్లై చేసేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.

నిర్మాణ రంగం దూకుడు.. సిమెంట్‌కు డిమాండ్..
తెలంగాణతో పాటు దేశీయంగా నిర్మాణ రంగం దూకుడు మీదు ఉంది. భవిష్యత్తులోనూ ఈ రంగం మరింత పురోగతి సాగిస్తుందన్న అంచనాల నేపథ్యంలో సిమెంట్‌కు దీర్ఘకాలిక డిమాండ్ ఉంటుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలోనే కాకుండా దేశంలో కూడా సిమెంట్‌కు భారీగా డిమాండ్ ఉందని.. ప్రైవేట్ సిమెంట్ కంపెనీలు భారీ లాభాలు ఆర్జిస్తున్నాయన్నారు .
ప్రధాని మోదీ ప్రారంభించిన గతిశక్తి-నేషనల్ మాస్టర్ ప్లాన్ పథకం ద్వారా పెద్ద ఎత్తున రహదారి వ్యవస్థ బలోపేతం కోసం పనులు చేపడతామన్నారు. దీంతోపాటు మౌలిక వసతుల కల్పన, పేదల పక్కా గృహాల నిర్మాణంపై కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక శ్రద్ధపెట్టాయి. నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న నిర్మాణ పనుల నేపథ్యంలో సిమెంట్‌కు డిమాండ్ పెరిగిందని లేఖలో ప్రస్తావించారు.

యువతకు ఉపాధి
ఆదిలాబాలోనిని సీసీఐ కంపెనీ పున:ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. కంపెనీ ప్రారంభిస్తామంటే కొత్త కంపెనీలకిచ్చే ప్రొత్సాహకాలు, వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. సీసీఐ తిరిగి ప్రారంభించాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని కలిసి విజ్ఞప్తి చేశామని.. సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరినా ఇప్పటిదాకా ఎలాంటి స్పందన రాలేదని కేటీఆర్ అవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం కృషి వలన అదిలాబాద్ దేవాపూర్ యూనిట్లో ఒరియంట్ సిమెంట్ కంపెనీ సుమారు రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టిందని.. ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తామంటున్నా సీసీఐని తెరవకపోవడం తెలంగాణ యువతకు తీరని ద్రోహం చేయడమే అని లేఖలో పేర్కొన్నారు. సీసీఐ తెరిస్తే ఆదిలాబాద్ మరింత వేగంగా అభివృద్ది చెందుతుందని.. వేంటనే దీనిని పున:ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రులను కేటీఆర్ డిమాండ్ చేశారు.