ఓపిక నశిస్తే మోదీని కూడా వదలం.. అడ్డగోలు మాటలు బంద్ చేయండి... బీజేపీకి కేటీఆర్ వార్నింగ్..
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్‌కే పట్టం కడుతున్నారని చెప్పారు. దుబ్బాకలో కాంగ్రెస్,టీఆర్ఎస్‌లు డిపాజిట్ కోల్పోయినా ఆశ్చర్యం లేదన్నారు. బీజేపీది వట్టి డొల్ల ప్రచారమని... ఉన్నది లేనట్లు చూపెట్టడం ఆ పార్టీకి అలవాటేనని విమర్శించారు. బుధవారం(అక్టోబర్ 28) హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

మోదీ సహా ఎవరినీ వదిలిపెట్టం..
దుబ్బాక ప్రజా చైతన్యం ఉన్న గడ్డ అని... కచ్చితంగా ప్రజలు మరోసారి టీఆర్ఎస్‌కే పట్టం కడుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట పోలీసులపై బీజేపీ నేతలు మాట్లాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని... దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తమకూ మాటలు వచ్చునని... ఓపిక నశిస్తే ప్రధాని మోదీ సహా ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బీజేపీ నేతలు అడ్డగోలు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ నేతలను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. బీజేపీ జనంలో తక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ అంటూ విమర్శించారు.

ఆ ఘనత టీఆర్ఎస్ సర్కారుదే...
రైతాంగానికి పంట పెట్టుబడి సాయం కింద నేరుగా డబ్బులు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని... ఆర్‌బీఐ నివేదికలో కూడా ఇదే స్పష్టమైందని కేటీఆర్ అన్నారు. ఆర్థిక నివేదిక ప్రకారం ఇప్పటివరకూ అత్యధిక వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. ఇప్పటివరకూ రూ.27వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామన్నారు. రైతు బంధు పథకం కింద రూ.28వేల కోట్లు ఇచ్చామన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యల రేటు గణనీయంగా తగ్గిందని... తలసరి ఆదాయం రెట్టింపు అయిందని తెలిపారు. దివాళాకోరు ప్రతిపక్షాలు ఆర్బీఐ నివేదికనైనా గుర్తిస్తాయో లేదో చూడాలన్నారు.

దుబ్బాకలో పెరిగిన పొలిటికల్ హీట్
ఇక దుబ్బాకలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గరపడ్డ సమయంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాలు ఓటింగ్‌ను ప్రభావితం చేస్తాయా అన్న చర్చ జరుగుతోంది. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు,ఆయన బంధువుల ఇళ్లల్లో సోదాలు... బీజేపీ నేత బండి సంజయ్ అరెస్ట్,దీక్ష నేపథ్యంలో దుబ్బాక రాజకీయాలపై వాడి వేడి చర్చ జరుగుతోంది. దుబ్బాకతోనే టీఆర్ఎస్ పతనానికి నాంది అని బీజేపీ సవాల్ చేస్తుండగా... మీకు డిపాజిట్లు కూడా రావంటూ టీఆర్ఎస్ వారిని ఎద్దేవా చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ... బీజేపీ,టీఆర్ఎస్‌లు కుమ్మక్కై దుబ్బాకలో డ్రామా ఆడుతున్నారని ఆరోపిస్తుండటం గమనార్హం. ఈ త్రిముఖ పోటీలో దుబ్బాక ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో తేలాలంటే నవంబర్ 10 వరకు ఆగాల్సిందే.