వ్యవసాయాభివృద్ధిపై బీజేపీకి విజన్ లేదు; వారిది కేవలం రాజకీయకాంక్ష: మంత్రి నిరంజన్ రెడ్డి
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్రంలోని బిజెపి సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బీజేపీకి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే విజన్ లేదని ఆయన పేర్కొన్నారు. కేవలం రాజకీయ కాంక్షతో మాత్రమే బిజెపి పనిచేస్తుందని పేర్కొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన బిజెపికి ఏమాత్రం లేదని ఆయన పేర్కొన్నారు. దేశంలో 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటే, కేంద్రం మాత్రం ఆర్థిక లాభాలు బాగా లేవని వ్యవసాయాన్ని చిన్న చూపు చూస్తోంది అంటూ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలుగు కోట్ల జనాభా ఉన్న స్పెయిన్ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో 16శాతానికి ఎగబాకింది. కానీ 140 కోట్ల జనాభా 40కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న భారతదేశం మాత్రం ఎగుమతుల్లో కేవలం రెండు శాతానికి దగ్గరలో నిలిచిపోవడం సిగ్గుచేటని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రానున్న రోజుల్లో పెరుగుతున్న జనాభా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆహార కొరత తీవ్రతరం అవుతుందని, వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం కోసం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ 2 సంవత్సరాలలో 3.75 లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్టు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మూడు సార్లు గుజరాత్ సీఎంగా పనిచేసిన ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయ రంగానికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలంటూ వ్యవసాయ శాఖ మంత్రి డిమాండ్ చేశారు. ఇక వ్యవసాయంలో ఎరువులకు కేంద్రం భరిస్తున్న సబ్సిడీలు కూడా నాలుగైదు రాష్ట్రాల నుంచి వచ్చే పన్నుల మొత్తం అంటూ వ్యవసాయ శాఖ మంత్రి పేర్కొన్నారు.
వ్యవసాయ రంగం బాగుండాలని పేర్కొన్న మంత్రి వ్యవసాయ రంగానికి మేలు చెయ్యటం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు నీటి రంగం లో విప్లవత్మక మార్పులు తీసుకొచ్చారున్నారు. దినదిన గండం గా ఉండే వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి లాభసాటిగా మార్చారని వ్యాఖ్యానించారు. రైతులకు ఎప్పటికప్పుడు పంటలపైన వ్యవసాయ అధికారులు దిశా నిర్దేశం చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.