రామాలయ విరాళాలపై చల్లా వ్యాఖ్యల చిచ్చు .. ఓరుగల్లులో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ దాడుల పర్వం
అయోధ్య రామాలయం నిధుల సేకరణకు సంబంధించి విరాళాల విషయంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఓరుగల్లులో రాజకీయ వేడి పుట్టించాయి. వివాదాలకు కారణం గా మారాయి. దాడులు, ప్రతి దాడులతో ఓరుగల్లులో తాజా పరిస్థితి అధికార టీఆర్ఎస్ కు, బిజెపికి మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలకు కారణంగా మారింది .

విరాళాల వివాదం .. ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ నేతల దాడి
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రామమందిర నిర్మాణం కోసం బీజేపీ నేతలు చందాలు వసూలు చేస్తున్నారని వాటి లెక్కలు చూపాలని చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడికి దిగారు బిజెపి నాయకులు. కోడిగుడ్లు , టమాటాలు , రాళ్ళతో దాడి చేసి ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు . బయట ఉన్న కుర్చీలను విరగ్గొట్టారు . బిజెపి నాయకుల చర్యకు ప్రతిచర్యగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా బీజేపీ నాయకుల ఇళ్ళపై , ఆఫీసులపై ఎదురుదాడికి దిగారు.

బీజేపీ ఆఫీసులపై టీఆర్ఎస్ దాడి .. నేడు పరకాల పట్టణ బంద్ .. టీఆర్ఎస్ నిరసన
హనుమకొండలోని బీజేపీ జిల్లా కార్యాలయంపై దాడి చేశారు. అలాగే పరకాలలోని బీజేపీ కార్యాలయం పై కూడా దాడి చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. దీంతో ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడిని టిఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది . ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పై జరిగిన దాడిని టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఖండించారు. అంతేకాదు ఈ రోజు చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బిజెపి కార్యకర్తల దాడికి నిరసనగా పరకాల పట్టణ బందుకు కూడా పిలుపునిచ్చారు . బిజెపి కార్యకర్తల దాడికి నిరసనగా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నారు.

టిఆర్ఎస్ కార్యకర్తలు ఓపిక నశిస్తే బిజెపి కార్యకర్తలు బయట తిరగలేరన్న కేటీఆర్
పరకాల ఎమ్మెల్యే ఇంటిపై బిజెపి కార్యకర్తల దాడిని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో దాడికి పాల్పడటాన్ని సీరియస్ గా తీసుకున్న కేటీఆర్ బిజెపి భౌతిక దాడులను ఎదుర్కొనే సత్తా టిఆర్ఎస్ పార్టీకి ఉందని కానీ బాధ్యతాయుతమైన పార్టీగా సమయం పాటిస్తున్నామని వెల్లడించారు .ఇదే సమయంలో టిఆర్ఎస్ కార్యకర్తలు ఓపిక నశిస్తే మాత్రం బిజెపి కార్యకర్తలు బయట తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. టిఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని మర్చిపోయి బిజెపి నేతలు ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్.

ఎమ్మెల్యే ఇంటి పైన దాడి చేస్తారా.. ఖబడ్దార్ అంటూ ఎర్రబెల్లి హెచ్చరిక
అధికార పార్టీ నేతల సహకారంతో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి ఆరోపిస్తుంటే, ప్రశ్నించినందుకు ఇంటిపై దాడి చేస్తారా అని టిఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిని సందర్శించి దాడిని ఖండించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే ఇంటి పైన దాడి చేస్తారా ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు . ప్రశాంతంగా ఉన్న నగరంలో బీజేపీ నేతలు చిచ్చు పెడుతున్నారు అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ గుండా గిరికి పాల్పడుతోంది అంటూ విమర్శించారు.

బీజేపీ కార్యాలయాలపై దాడితో బీజేపీ ఛలో ఓరుగల్లు .. బీజేపీ నేతల అరెస్ట్
ఈ సమయంలో బిజెపి కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడి పై బిజెపి సైతం చలో వరంగల్ కు పిలుపునిచ్చింది. అందులో భాగంగా పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు వరంగల్ కి వెళ్తున్న క్రమంలో పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అరెస్ట్ చేశారు ఘట్ కేసర్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, జనగామ వద్ద బిజెపి నేతలు ఎండల లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ని అరెస్ట్ చేశారు.
మరి రామాలయ విరాళాల విషయంలో చెలరేగిన వివాదం మరే రూపం తీసుకుంటుందో వేచి చూడాలి .