కేసీఆర్ కుటుంబ పాలనకు ఇక అంతమే, టీఆర్ఎస్ కార్యకర్తల్లా పోలీసులు: బీజేపీ నేతల వార్నింగ్
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తల అరెస్టుపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. బీజేపీఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కరోనా నిబంధనలు బీజేపీ నేతలకు మాత్రమేనా? అధికార పార్టీ నేతలకు ఉండవా? అని ప్రశ్నించారు.

అధికార పార్టీ పెద్దలకు లేని నిబంధనలు.. బండి సంజయ్ ఎందుకు?
డిసెంబర్ 25న కోవిడ్‌పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు తర్వాత కేసీఆర్ నల్గొండ పర్యటనకు వెళ్లారు.. మాస్క్ లేదు.. వేల మంది హాజరయ్యారన్నారు.
ఆ తర్వాత కేటీఆర్ నల్గొండ జిల్లాకు వెళ్లారు.. నిబంధనలు ఉల్లంఘించారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. కేటీఆర్‌కు మాస్క్ లేదు.. ఆదివారం కరీంనగర్లో గంగుల కమలాకర్ ప్రెస్‌మీట్ పెట్టాడు మాస్క్ లేదు... వీరికి వర్తించని నిబంధనలు తన కార్యాలయంలో బండి సంజయ్ జాగరణ కార్యక్రమం తలపెడితే వర్తిస్తుందా? అంటూ ధ్వజమెత్తారు. కరీంనగర్ సీపీ వివాదాస్పదుడని, కరీంనగర్ సీపీ ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షించబడదని ఆరోపించారు. ఓల్డ్ సిటీలో హైదరాబాద్ ఎంపీ వేల మందితో కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఎంత మంది మీద కేసు పెట్టారని ప్రశ్నించారు రఘునందన్ రావు.

‘డీజీపీ.. మీరు కూడా సోకు ఉంటే రాజకీయాల్లోకి రండి...': రఘునందన్
'డీజీపీ.. మీరు కూడా సోకు ఉంటే రాజకీయాల్లోకి రండి...' అంటూ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులకు కూకట్పల్లి కమిషనర్‌గా పనిచేసేందుకో... భర్తలకు ఉద్యోగ పొడగింపు కోసమో... ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్న అంటూ రఘునందన్ రావు అన్నారు. పదవుల కోసం పెదవులు మూయకండి అంటూ.. ఉద్యోగ సంఘాల నేతలను, ఉద్యోగులను కోరారు రఘునందన్‌రావు.

కేసీఆర్ సర్కారు పతనానికి నాంది ఇదే: లక్ష్మణ్
మరోవైపు, బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. బండి సంజయ్ ప్రజాస్వామ్య యుతంగా జాగరణ దీక్ష చేపట్టారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇది పతనానికి నాంది అని అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే స్థానికత అంశం మీద అని, స్థానికతకు ఈ ప్రభుత్వం చరమ గీతం పాడిందని లక్ష్మన్ మండిపడ్డారు. కేసీఆర్ ఉద్యమకారులను వదిలి ఉద్యమ ద్రోహులను దగ్గర చేర్చుకున్నాడని, మూడు సంవత్సరాలు నిద్రపోయిన ప్రభుత్వం మూడు రోజుల్లో అదరబదరగా ఉద్యోగ విభజన చేయాలని అనుకుందని ధ్వజమెత్తారు. ఉద్యోగ సంఘాల నేతల నోళ్లు మూత పడ్డాయన్నారు. కరోనా నిబంధనలు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఉండవా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి ఘాతుకాలు చూడలేదని ఆయన అన్నారు. బీజేపీ కార్యకర్తల చేతులు, కాళ్ళు విరిగాయని, పోలీసుల దౌర్జన్యాలతో బీజేపీ బెదిరిపోదన్నారు. ఎఫ్ఐఆర్లో 333 సెక్షన్ లేదు... బెయిల్ వస్తుందని చివరలో 333ని యాడ్ చేశారు... పాత కేసులన్ని పెట్టారు. గ్యాస్ కట్టర్, గడ్డపారలతో క్యాంప్ ఆఫీసు డోర్లు కిటికీలు కమిషనర్ సమక్షంలో పగల గొట్టారు.. ఇదేనా ప్రజా స్వామ్యం. రాజకీయంగా, న్యాయ పరంగా పోరాడుతాం. బెంగాల్, కేరళ లాగా ప్రభుత్వమే హింసాత్మక సంఘటనలకు పాల్పడటం కరెక్ట్ కాదని లక్ష్మణ్ మండిపడ్డారు.

కేసీఆర్ సర్కారుకు చరమగీతమంటూ డీకే అరుణ
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పతనం ప్రారంభమైందని, కేసీఆర్ సర్కారుకు ప్రజలు చరమ గీతం పాడుతారని డీకే అరుణ అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించడం సిగ్గు మాలిన చర్య అని అన్నారు. కరోనా నిబంధనలు కేవలం బీజేపీ కు మాత్రమే వర్తిస్తాయా అని ప్రశ్నించారు డీకే అరుణ.

టీఆర్ఎస్ కార్యకర్తల్లా పోలీసులు.. పాతాళానికే: డీకే అరుణ ఫైర్
టీఆర్ఎస్ నాయకులు బహిరంగ సభలు, సమావేశాలు పెట్టినప్పుడు ఏ నిబంధనలు గుర్తు రాలేదా అని డీకే అరుణ పోలీసులను ప్రశ్నించారు. కండువా వేసుకొని టీఆర్ఎస్ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. ఎప్పటికీ టీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉండదన్న విషయాన్ని పోలీస్ అధికారులు గుర్తు పెట్టుకుంటే మంచిదని డీకే అరుణ హితవు పలికారు. కేసీఆర్ నియంత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, టీఆర్ఎస్ను పాతాళానికి తొక్కెందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ మండిపడ్డారు. ఈ విషయంపై కరీంనగర్ కమిషనర్ సత్యనారాయనతో డీకే అరుణ మాట్లాడగా.. కరోనా నిబంధనలు అతిక్రమించినందుకు బండి సంజయ్‌పై కేసులు నమోదు చేశామని చెప్పడంతో, కేవలం బీజేపీకి మాత్రమే నిబంధనలు వర్తిస్తాయా? అని డీకే అరుణ కమిషనర్‌ను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. ఇంకా, ఎంత మంది నాయకులను అరెస్ట్ చేస్తారో చేయండని, అరెస్టులు కేసులతో భయపడే ప్రసక్తే లేదని, ప్రజల శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనని డీకే అరుణ స్పష్టం చేశారు. అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపినంత మాత్రాన ప్రజల కోసం తమ పోరాటం ఆగదని డీకే అరుణ హెచ్చరించారు.