స్పీకర్ మాటల్లో భయం; నిజాం రాజులా కేసీఆర్ దౌర్జన్యపాలన: రాజా సింగ్
తెలంగాణ శాసనసభ సమావేశాలలో తమను అనుమతించాలని కోర్టు సూచనలతో స్పీకర్ కు మరోసారి విజ్ఞప్తి చేసిన బిజెపి ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో బిజెపి ఎమ్మెల్యేలు స్పీకర్ అప్రజాస్వామికంగా వ్యవహరించారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాటల్లో భయం కనిపించిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
స్పీకర్ తో భేటీ తర్వాత ఎమ్మెల్యే రాజా సింగ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ స్పీకర్ ను ఎంత టార్చర్ పెడుతున్నాడో ఆయనను చూస్తే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. స్పీకర్ చాలా భయంతో తమ అభ్యర్ధన తిరస్కరించారని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ పోడియం దగ్గరకు రాని ఈటల రాజేందర్ ను, రఘునందన్ రావును సస్పెండ్ చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. కేవలం బీజేపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కడం కోసమే సస్పెన్షన్ జరిగిందని రాజా సింగ్ వెల్లడించారు.

సీఎం కేసీఆర్ తన ప్లాన్ ను స్పీకర్ ద్వారా అమలు చేశారని రాజా సింగ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు స్పీకర్ నడుచుకోవాల్సి వస్తుందని అన్నారు. అసెంబ్లీలో 10మంది ఎమ్మెల్యేలు గొడవ చేసినా అక్కడ స్పీకర్ వారిని సస్పెండ్ చేయలేదని రాజా సింగ్ పేర్కొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అందుకు భిన్నంగా అసెంబ్లీ పర్వం కొనసాగుతోంది అంటూ వ్యాఖ్యానించారు. నిజాం రాజులు ఎంత దౌర్జన్యంగా పరిపాలన సాగించారో కెసిఆర్ ప్రస్తుతం అదే చేస్తున్నారంటూ రాజా సింగ్ వ్యాఖ్యానించారు.
ఈటల రాజేందర్ సభలోకి వస్తే కెసిఆర్ చేసిన పాపాలు బయటపెడతాడని భయంతోనే సభలోకి రానివ్వడంలేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ప్రజల రక్తం తాగుతున్న కేసీఆర్ ను త్వరలోనే గద్దె దించుతామని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. తెలంగాణా సీఎం కేసీఆర్ తీరుకు, తమను శాసన సభ సమావేశాల నుండి సస్పెండ్ చేసిన స్పీకర్ తీరుకు నిరసనగా 17వ తేదీ ఇందిరా పార్క్ లో నిరసన దీక్ష చేస్తామని వెల్లడించారు.