
ఎమ్మెల్యేల ఎరకేసు: సిట్ చేతికి ఫోరెన్సిక్ నివేదిక.. రామచంద్రభారతిపై నకిలీ పాస్ పోర్ట్ కేసు!!
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న ఫోరెన్సిక్ నివేదిక సిట్ చేతికి చేరింది. ఈ కేసులో నేరం రుజువు చేయడానికి కావలసిన కీలక ఆధారాలను ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం పంపిన క్రమంలో ప్రస్తుతం ఫోరెన్సిక్ నివేదిక సిట్ అధికారుల వద్దకు చేరింది. ఈ నివేదికలో అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ముగ్గురు నిందితుల ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ల నుండి కీలక సమాచారం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహ యాజీ స్వామీజీల నుండి స్వాధీనం చేసుకున్న ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్లను సిట్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపించిన విషయం తెలిసిందే. రామచంద్ర భారతికి సంబంధించిన 2 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు అందులో కొంత సమాచారాన్ని డిలీట్ చేసినట్టుగా గుర్తించారు. దీంతో ఎఫ్ ఎస్ ఎల్ అధికారులు హార్డ్ డిస్క్ ను రిట్రీవ్ చేసి డిలీట్ చేసిన దానిలో ఉన్న సమాచారాన్ని గుర్తించారు.

వాయిస్ రికార్డ్, వీడియో రికార్డ్ లపైనా స్వర పరీక్షలు.. సిట్ చేతిలో ఫోరెన్సిక్ నివేదిక
అంతేకాకుండా ఫాంహౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు లావాదేవీలు జరుగుతున్న సమయంలో రికార్డ్ చేసిన వీడియో లో ఉన్న వాయిస్ నిందితులది అవునా కాదా? ఇక ఫోన్ కాల్ రికార్డింగ్స్ లో ఉన్న వాయిస్ నిందితులదేనా వంటి విషయాలను తీర్చడం కోసం స్వరనమూనా పరీక్షలను కూడా జరిపించారు. ఇక వీటన్నిటికీ సంబంధించిన నివేదిక ప్రస్తుతం సిట్ చేతిలో ఉంది. ఈ నివేదిక ఆధారంగా రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ కు నకిలీ పాస్పోర్టు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

రామచంద్ర భారతికి నకిలీ పాస్ పోర్ట్ .. కేసు నమోదు
దీంతో రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ రామచంద్ర భారతి నకిలీ పాస్ పోర్టు పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామచంద్ర భారతికి కర్ణాటక లోని పుత్తూరు చిరునామాతో శ్రీరామచంద్ర స్వామీజీ పేరుతో మరో పాస్ పోర్టు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయనపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 467, 468, 471 తో పాటు, పాస్ పోర్ట్ చట్టంలోని సెక్షన్ 12(3) క్రింద కేసులు నమోదు చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులకు బిగుస్తున్న ఉచ్చు
రామచంద్ర భారతి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నేపథ్యంలో ఈ కేసులో ఆయనకు బెయిల్ దొరికితే, మరో కేసులో ఆయనను అరెస్టు చేసేలా సిట్ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఒక్క రామచంద్ర భారతి మాత్రమే కాదు నందకుమార్ పై కూడా వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక చీటింగ్ కేసులు నమోదయిన క్రమంలో ఎమ్మెల్యేల ఎర కేసులో ఉన్న నిందితులకు గట్టిగానే ఉచ్చు బిగిస్తున్నట్లుగా కనిపిస్తుంది.

నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరుతున్న సిట్
ఇదిలా ఉంటే ప్రస్తుతం నిందితులు ముగ్గురిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇప్పటివరకు ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన అనేక అంశాల ఆధారంగా మరోమారు నిందితులు ముగ్గురిని విచారించడం కోసం కస్టడీకి ఇవ్వాలని సిట్ ఏసీబీ కోర్టులో అభ్యర్థిస్తోంది. మరి నేడు దీనిపై కోర్టు నిర్ణయం తెలియాల్సి ఉంది.
తెలంగాణాలో ఈడీ, ఐటీ దాడులకు లిస్ట్ రెడీ.. నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే? గులాబీల గుబులు!!