రూటు మార్చిన ఎమ్మెల్సీ కవిత: ఆ నియోజకవర్గంలో పర్యటన, నిజామాబాద్ పై ఫోకస్ వెనుక పెద్ద కథే!!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తనయ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూటు మార్చారా? నిజామాబాద్ జిల్లాలో నేతల మధ్య విబేధాలు అంటూ జరుగుతున్న చర్చకు చెక్ పెట్టారా? ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాక ఒకే నియోకవర్గానికి రెండు సార్లు పర్యటించి గులాబీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారా? నిజామాబాద్ జిల్లాలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కొద్ది రోజులుగా కనపడుతున్న మార్పు వెనుక కవిత భవిష్యత్తు ప్రణాళిక ఉందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

కొత్త పంథా ఎంచుకున్న కవిత
నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన టిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత జిల్లా పై మరింత పట్టు సాధించడం కోసం కొత్త పంథా ఎంచుకున్నారని తాజాగా ఆమె వేస్తున్న అడుగులతో అర్థమవుతుంది. ఇప్పటికే నిజామాబాద్ నియోజకవర్గంలో ఎంపీ ఘోర ఓటమి పాలైన కవిత, ఆ తర్వాత జిల్లాలో గ్రూపు రాజకీయాలకు కారణమయ్యారని పెద్ద చర్చ జరిగింది.
ఇక ఆ చర్చకు ఫుల్స్టాప్ పెట్టడానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా జిల్లాను క్లీన్ స్వీప్ చేయడానికి ఇప్పటి నుంచే కల్వకుంట్ల కవిత పావులు కదుపుతున్నారని తెలుస్తుంది. ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలను ఏకతాటి పైకి తెచ్చి టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య ఐక్యత చాటే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.

మంత్రి ప్రశాంత్ రెడ్డి తో గ్యాప్ ప్రచారానికి కవిత చెక్
గులాబీ పార్టీలో కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ కవితకు.. రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం జోరుగానే జరిగింది. ఆ నోటా ఈ నోటా మంత్రికి, ఎమ్మెల్సీకి విషయం తెలియడంతో ఆ విబేధాల చర్చకు పుల్ స్టాప్ పెట్టేందుకు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొద్ది రోజుల్లోనే మంత్రి నియోజకవర్గంలో రెండు సార్లు పర్యటించారు కల్వకుంట్ల కవిత. భీంగల్ లో కోట్లాది రూపాయల అభివృద్ది పనులకు మంత్రితో కలిసి శంకుస్ధాపనలు చేశారు .
మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఆమెకు ఎలాంటి విభేదాలు లేనట్టుగా గంట పాటు ఊరంతా కళ్యాణి గారు. భీంగల్ పర్యటనతో.. మా మధ్యలో విబేధాలు లేవనే సంకేతాలను పార్టీ క్యాడర్ కు పంపించే ప్రయత్నం చేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత. బాల్కొండ నియోజకవర్గంలో కవిత పర్యటనలతో ఈ మెసేజ్ కార్యకర్తల్లోకి బలంగా వెళ్లేలా చేశారని తెలుస్తుంది.

నిజామాబాద్ జిల్లాపై పట్టు కోసం కవిత వ్యూహం
ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నికయ్యాక.. కవిత వ్యూహం మార్చినట్టుగా తాజాగా ఆమె వేస్తున్న అడుగులతో అర్థమవుతుంది. త్వరలో కీలక బాధ్యతలు చేపడతారంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో జిల్లాలోను మరింత పట్టు పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కడుతున్నారని సమాచారం.
అందరూ కలిసి పనిచేయాలని సంకేతాలు ఇస్తూనే, పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు తీసుకువెళ్లడానికి, గులాబీ క్యాడర్ నయా జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు కవిత. ఉమ్మడి జిల్లాలో అన్ని నియోకవర్గాలను సాధ్యమైనంత ఎక్కువ సార్లు పర్యటించి.. అభివృద్ది పనులను ప్రారంభించాలని డిసైడ్ అయ్యారని సమాచారం.

జిల్లాపై స్పెషల్ ఫోకస్, బీజేపీకి చెక్ పెట్టే ప్లాన్
ఇటు ప్రతిపక్షాల విమర్శలకు, క్షేత్ర స్దాయి నుంచే తన దైన స్టైల్ లో కౌంటర్ లు ఇవ్వాలని ఫిక్స్ ఫిక్స్ అయ్యారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. స్దానికంగా చేపట్టిన అభివృద్ది పనులను సైతం పరుగులు పెట్టించేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రయత్నాలు సాగిస్తున్నారు. జిల్లా అభివృద్దికి కావాల్సిన నిధుల విడుదల చేయించడంలోను ఎమ్మెల్సీగా ఆమె కీ రోల్ పోషిస్తున్నారని సమాచారం.
జిల్లాలో ఇప్పటికే ప్రారంభించిన అభివృద్ది పనులను స్పీడప్ చేయడం తో పాటుగా మరికొన్ని పనులకు కొత్తగా శంకుస్దాపన చేయనున్నారని తెలుస్తుంది. ఇందుకోసం జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డిని,స్దానిక ఎమ్మెల్యేలను కలపుకుని వెళ్తూ తన స్టైల్లో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కవిత. అందరిని కలుపుకుని వెళ్తూ కవిత నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి, బిజెపికి చెక్ పెట్టడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

నిజామాబాద్ లోవచ్చే ఎన్నికలే టార్గెట్ గా కవిత చక్రం
పార్టీలో నాయకుల మద్య విభేదాలకు చెక్ పెడుతూ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు అంతా ఒకటే అనే సంకేతాన్ని క్షేత్ర స్థాయిలో కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ కార్యకర్తల్లో జోష్ పెంచుతూ ముందుకు సాగుతున్న కవిత వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో కారు ప్రభంజనం సృష్టించేలా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారని చర్చ జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. కష్టం అన్న వారికి అండగా నిలబడుతూ, కార్యకర్తలకు నేనున్నాను అనే భరోసా ఇస్తున్న కవిత మళ్లీ నిజామాబాద్ జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. భవిష్యత్ ఎన్నికల అందరి ముందున్న లక్ష్యం అని పార్టీ శ్రేణులను ముందుకు నడిపిస్తున్నారని సమాచారం.