దుబ్బాక ఫలితంపై కేసీఆర్ రియాక్షన్... టార్గెట్ గ్రేటర్... ఓవైసీతో భేటీలో ఏం చర్చించారు..?
దుబ్బాక ఉపఎన్నిక ఫలితం తర్వాత అధికార టీఆర్ఎస్ ఆచీతూచీ వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉపఎన్నిక ఏదైనా తిరుగులేకుండా దూసుకుపోతున్న కారుకు కమలం షాకివ్వడంతో టీఆర్ఎస్ నేతల్లో కాస్త ఆందోళన మొదలైంది. దుబ్బాక ఉపఎన్నికను తేలిగ్గా తీసుకుని బొక్కబోర్లా పడటం... ఉపఎన్నిక గెలుపు ప్రభావాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు బీజేపీ సిద్దమవడంతో... ఈసారి టీఆర్ఎస్ కాస్త ముందుగానే అప్రమత్తమైంది. దుబ్బాకలో గెలిచినరోజే గ్రేటర్ మేయర్ పీఠాన్ని ఎక్కుపెట్టిన బీజేపీని ఎదుర్కొనేందుకు ముందు నుంచే అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకునే పనిలో పడింది.

'దుబ్బాక'పై కేసీఆర్ రియాక్షన్...
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ,ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ చేశారు. గురువారం(నవంబర్ 12) అందుబాటులో ఉన్న మంత్రులు,ముఖ్య నేతలను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని గ్రేటర్ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా దుబ్బాక ఉపఎన్నిక ఫలితంపై కూడా కేసీఆర్ స్పందించినట్లు తెలుస్తోంది. దుబ్బాకలో బీజేపీ విజయంపై ఎక్కువ ఆందోళన అవసరం లేదని... అక్కడ రఘునందన్ రావుకు సానుభూతి కలిసొచ్చిందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. 'ప్రజల్లో ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదు... దుబ్బాకలో సానుభూతి తప్ప బీజేపీ బలం కాదు.. బీజేపీ గాయి గాయి చేయాలని చూస్తోంది. మనం ఆగం కావద్దు. సర్వేలు మనకు అనుకూలంగా ఉన్నాయి. తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదు. బీజేపీ పట్ల దూకుడుగా వ్యవహరించాలి. బీజేపీ చేస్తున్న అబద్దపు ప్రచారాలను గట్టిగా తిప్పి కొట్టాలి. గ్రేటర్ ఎన్నికలకు ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చు. అతివిశ్వాసానికి పోకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలి.' అని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.

ఓవైసీతో ఏం చర్చించారు...
మంత్రులు,పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం కొనసాగుతున్న సమయంలోనే హైదరాబాద్ ఎంపీ,మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రిని కలిశారు. దీంతో ఈ ఇద్దరి భేటీ చర్చనీయాంశంగా మారింది.
భేటీకి సంబంధించి వివరాలేవీ బయటకు రానప్పటికీ... గ్రేటర్ ఎన్నికల పైనే చర్చించినట్లు తెలుస్తోంది. గత గ్రేటర్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడి విడిగానే పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 స్థానాల్లో గెలవగా 40 స్థానాల్లో ఎంఐఎం గెలిచింది. అయితే కేసీఆర్-ఓవైసీ తాజా భేటీతో... ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్-మజ్లిస్ పొత్తు దిశగా ఏమైనా ఆలోచిస్తున్నాయా అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. లేదా.. ఫలితాల అనంతరం పొత్తు కుదుర్చుకునే ఆలోచనలో ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది.

పొత్తు ఉంటుందా...?
హిందుత్వ ఓటు బ్యాంకును ఏకం చేసి గ్రేటర్‌లోనూ టీఆర్ఎస్ను దెబ్బకొట్టే ప్లాన్‌లో బీజేపీ ఉన్న నేపథ్యంలో... టీఆర్ఎస్ పార్టీ మజ్లిస్‌తో ఎన్నికల పొత్తు ఆలోచన చేయకపోవచ్చు. గత గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించిన టీఆర్ఎస్... ఈసారి కూడా ఒంటరిగానే బరిలో దిగే అవకాశాలున్నాయి. అయితే ఎన్నికల తర్వాత ఒకవేళ అవసరమైతే మజ్లిస్‌తో చేతులు కలిపే అవకాశాన్ని పరిశీలించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఓవైసీ-కేసీఆర్ భేటీ జరిగి ఉండవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

భారీ విజయంపై కన్నేసిన టీఆర్ఎస్...
దుబ్బాక ఉపఎన్నిక ఫలితం టీఆర్ఎస్ కార్యకర్తలను కాస్త ఢీలా పడేసింది. ఉపఎన్నిక ఫలితంపై పెద్దగా ఆందోళన చెందవద్దని కేసీఆర్ చెప్తున్నప్పటికీ... క్షేత్ర స్థాయిలో కార్యకర్తల్లో నిరుత్సాహం ఆవహించింది. దీంతో ఢీలా పడ్డ టీఆర్ఎస్ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం నింపాలంటే... ఒక భారీ విజయం అవసరమని కేసీఆర్ భావిస్తున్నారు. దుబ్బాక ఫలితాన్ని మరిపించాలంటే గ్రేటర్లో రికార్డు విజయాన్ని సాధించాలని భావిస్తున్నారు.ఇందుకోసం గ్రేటర్ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి.. గతంలో మిస్సయిన సెంచరీ మార్క్‌ను ఈసారి ఎలాగైనా అందుకోవాలని భావిస్తున్నారు. ఆలస్యం చేయకుండా గ్రేటర్ ఎన్నికలను ఎదుర్కోవడమే మంచిదన్న అభిప్రాయంలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నిర్వహించే కేబినెట్ భేటీ తర్వాత గ్రేటర్ ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.