కేసీఆర్ శకం ముగిసింది, ప్రజలు చాచికొట్టి చెప్పారు: ఈటల గెలుపుపై అరవింద్, విజయశాంతి
హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపుపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ గెలుపుతో టీఆర్ఎస్ పతనానికి నాంది పడిందన్నారు.

టీఆర్ఎస్లో ముసలం.. కేసీఆర్ ఇక చరిత్రలోనే..: అరవింద్
టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున ముసలం పుట్టబోతోందన్నారు అరవింద్. హుజూరాబాద్‌లో డబ్బుతో గెలివాలని బావించిన టీఆర్ఎస్కు ప్రజలు గుణపాటం చెప్పారన్నారు. కేసీఆర్ చేసిన అవినీతి పాపాలే ఆయన్ను చుట్టుముట్టాయని ధర్మపురి అరవింద్ విమర్శించారు. అహంకారమే కేసీఆర్‌ను దహించివేసిందన్నారు. కేసీఆర్ చరిత్రలో మిగిలిపోయే రోజు ఇవాల్టి నుంచి మొదలైందన్నారు అరవింద్. తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వంలో నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి అతి త్వరలో రాబోతున్నారన్నారు. నిజమైన బంగారు తెలంగాణ అన్నది కేవలం నరేంద్ర మోడీ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని అరవింద్ అన్నారు.

కేసీఆర్ శకం ముగిసింది.. కేటీఆర్ వెన్నుపోటు: ధర్మపురి అరవింద్
హుజురాబాద్ ఎన్నికలతో కేసీఆర్ శకం ముగిసిందన్నారు అరవింద్. కేసీఆర్‌కు కేటీఆరే వెన్నుపోటు పొడవబోతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ అస్తవ్యస్తం కాబోతుందన్నారు. కేసీఆర్‌కు ఇవే ఆఖరి ఎన్నికలన్నారు ధర్మపురి అరవింద్. కేటీఆర్ తన తండ్రిని పక్కన పెట్టి తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారన్నారు. దళిత బంధు అమలు చేయకపోతే హుజురాబాద్ ఫలితాలు తెలంగాణ వ్యాప్తంగా రిపీట్ అవుతాయన్నారు. ఇప్పటికైన కేసీఆర్ రాజీనామా చేసి దళితుడికి ముఖ్యమంత్రి పదవి అప్పగించాలన్నారు.

కేసీఆర్ అహంకారానికి ‘మంగళం'.. ప్రజలు చాచికొట్టారన్న విజయశాంతి
హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ గెలుపుపై విజయశాంతి స్పందించారు. 'హుజూరాబాద్‌లో కమలం విరిసింది... తెలంగాణ పాలకుల గుండె అదిరింది. కుట్రలు, వ్యూహాలు, అబద్ధపు ఆరోపణలు, ఫేక్ న్యూస్‌ల పరంపరతో ఎలాగైనా ఈటల గెలుపును అడ్డుకోవాలని అధికార పార్టీ సర్వ శక్తులూ ఒడ్డినా.... అందరినీ అన్నీ సార్లూ మోసం చెయ్యడం సాధ్యం కాదని తెలంగాణ ప్రజలు చాచికొట్టి చెప్పారు. ఈటల ఎదుగుదలను సహించలేక ఆయన్ని పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి బయటకు పంపడంలో మాత్రమే కేసీఆర్ విజయం సాధించారు తప్ప, ప్రజల హృదయాల నుంచి తప్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. దళిత బంధు పథకమంటూ దళితులనే మోసం చేసిన ఈ పాలకుల లోగుట్టేమిటో ఈ గెలుపు రుజువు చేసింది. బీజేపీని... ఈటలని లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ సోషల్ మీడియా కుప్పలు తెప్పలుగా ప్రయోగించిన ఫేక్ న్యూస్‌ను, ఫేక్ లెటర్లను ఓట్ల తూటాలు తునాతునకలు చేశాయి. అధికార పార్టీకి తమ అభ్యర్థి స్వంత మండలంలో సైతం ఓటమి తప్పలేదు. విషప్రచారాలు... దుష్ప్రచారాలతో పాటు లేనిపోని ఆశలు కల్పించి... ఓటర్లను మాయచేసి మభ్యపెట్టిన అధికార పార్టీ అహంకారానికి చెక్ పెట్టిన 'మంగళ'వారం ఇది. ఈ గెలుపు... వచ్చే శాసనసభ ఎన్నికల్లో నూతన చరిత్ర లిఖించేలా బీజేపీకి కొత్త మలుపునివ్వడం పక్కా... ఈ విజయం అమరుల త్యాగాలను సాకారం చేసే సరికొత్త తెలంగాణకు శ్రీకారం చుట్టడం ఖాయం' అని విజయశాంతి సోషల్ మీడియా వేదిక వ్యాఖ్యానించారు.

హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటమి కేసీఆర్‌దే..: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు. హుజరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ వాదులు, ఉద్యమకారులు గెలిచారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ద్రోహులు ఓడిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజరాబాద్లో ఓటమి టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ది కాదని.. సీఎం కేసీఆర్‌కే చెందుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రాంతీయ పార్టీ ఆవిర్భవిస్తేనే తెలంగాణ భవిష్యత్తు బాగుంటుంది కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై ప్రకటించి కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.