కేసీఆర్కు నాపై కోపం లేదు! వాటిని పట్టించుకోరు: జూ. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య
హైదరాబాద్: కరోనా లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సహా టాలీవుడ్ పెద్దలు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పలు కీలక సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినిమాలకు చిత్రీకరణకు అనుమతి లాంటి విషయాలపైనా చర్చించారు.

సీఎంతో భేటీకి ఎందుకు పిలవలేదో.?
అయితే, ఈ సమావేశానికి ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరుకాలేదు. ఈ అంశంపై తాజాగా బాలకృష్ణ స్పందించారు. తెలంగాణ సీఎంను కలిసిన సమయంలో తనను ఎందుకు పిలవలేదో తెలియదని తాజాగా, ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సీఎం కేసీఆర్పై గతంలో విమర్శలు చేసినా..
ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవడానికి వాళ్ళంతా(సినీ ప్రముఖులు) వెళ్లినప్పుడు తననెందుకు పిలువలేదో తెలియదన్నారు. ఒక వేళ గతంలో తాను రాజకీయ కోణంలో ఆయన(కేసీఆర్)పై చేసిన విమర్శల కారణంగా తనను పిలవకపోతే ఆ విషయం తనకు చెప్పాల్సిందని బాలకృష్ణ అన్నారు.

కేసీఆర్కు నాపై ఎప్పుడూ కోపం లేదు: బాలయ్య
అంతేగాక, సీఎం కేసీఆర్కు తనపైన ఎప్పుడూ కోపం లేదని.. రాజకీయం వేరు, ఇది వేరు అని బాలయ్య వ్యాఖ్యానించారు. రామారావుగారి అభిమానిగా తానంటే కేసీఆర్కు పుత్ర వాత్సల్యం ఉందన్నారు. ఇక మిగిలిన వాటి గురించి తాను మాట్లాడదల్చుకోలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు.

జూ. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం అతనిష్టమే..
ఇది ఇలావుండగా, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపైనా బాలకృష్ణ స్పందించారు. ఎన్టీఆర్కు సినీనటుడిగా ఎంతో భవిష్యత్ ఉందన్న ఆయన.. రాజకీయాల్లోకి రావడం, రాకపోవడం అనేది అతని ఇష్టమని చెప్పారు. సినీ వృత్తిని వదులుకుని రమ్మని చెప్పలేమని అన్నారు. ఇప్పుడు తాను, ఒకప్పుడు తన తండ్రి ఒకేసారి సినిమా, రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నట్లు బాలయ్య తెలిపారు.

నాగబాబు వర్సెస్ బాలయ్య
కాగా, సీఎం కేసీఆర్ సమావేశంలో బాలకృష్ణ లేకపోవడంతో ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. బాలకృష్ణపై ఇటీవల నాగబాబు చేసిన వ్యాఖ్యలు మరింత దుమారానికి దారితీశాయి. సీఎంతో సమావేశంపై తనకు సమాచారం ఇవ్వలేదన్న బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరంటే టాలీవుడ్ పరిశ్రమ కాదని, మీరు అందులో ఒకరు మాత్రమేనని నాగబాబు అన్నారు. దీనికి బాలయ్య కౌంటర్ కూడా ఇచ్చారు. తనకు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాల్సిందేనని.. తాను ఎవరికీ, దేనికీ భయపడనని బాలకృష్ణ తేల్చి చెప్పారు.