• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కన్‌ఫ్యూజన్‌లో మేడం: కెసిఆర్ సతీమణీపై లోకేష్, కుంభకర్ణ నిద్ర వల్లే

By Srinivas
|

హైదరాబాద్: తన తల్లి నారా భువనేశ్వరి టిఆర్ఎస్‌కు ఓటు వేస్తానని చెప్పారన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలను టిడిపి నేత నారా లోకేష్ ఆదివారం నాడు తిప్పికొట్టారు. అంతపెద్ద భారీ సభలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత పెద్ద అబద్దం ఆడటం దారుణమని విమర్శించారు.

జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో చివరిరోజు తెదేపా భారీ ర్యాలీ నిర్వహించింది. హైటెక్‌ సిటీ నుంచి నిర్వహించిన భారీ ద్విచక్రవాహన ర్యాలీని నారా లోకేశ్‌ ప్రారంభించారు. లక్ష బైకులతో హైటెక్ సిటీ నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మియాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో లోకేశ్‌ మాట్లాడారు.

Also Read: కెసిఆర్ వ్యాఖ్యకు నారా భువనేశ్వరి రిప్లై: అమ్మ మాటను ట్వీట్ చేసిన లోకేష్

కెసిఆర్ తన సతీమణికి ఏం చెప్పారంటే...

కెసిఆర్, కెటిఆర్, కవితక్కల నేపథ్యంలో మేడంకే (కెసిఆర్ సతీమణి) ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు. లోకేష్ మాట్లాడుతూ... 'మేడంను ఓటు ఎవరికి వేస్తావని అడిగితే.. కెసిఆర్ మజ్లిస్‌తో పొత్తు అంటారు. కవిత పొత్తు లేదంటారు. కెటిఆర్ భీమవరంలో పోటీ చేస్తానంటారు. దీంతో నాకేం అర్థం కావడం లేదని' మేడం (కెసిఆర్ సతీమణి) అంటున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు.

Nara Lokesh counter to KCR comments on Bhuvaneswari

'గ్రేటర్ ఎన్నికలలో ఎందుకు ప్రచారం చేయడం లేదని కెసిఆర్‌ను మేడం అడిగారని, దానికి కెసిఆర్ మాట్లాడుతూ... ఎక్కడ చూసినా టిడిపి అభివృద్ధి కనిపిస్తోందని, ఇక నేను ఏం ప్రచారం చేయాలి' అని అన్నారట అని లోకేష్ వ్యాఖ్యానించారు.

ఎక్కడ చూసినా టిడిపి అభివృద్ధే కనిపిస్తోందని, సైబరాబాద్ వెళ్తే హైటెక్ సిటీ కనిపిస్తోందని, ఫ్లై ఓవర్ కింద నిలబడి మాట్లాడితే అది టిడిపి హయాంలో కట్టిందేనని, మెట్రో కింద నిలుచుంటే అది చంద్రబాబు ప్రభుత్వం వల్ల వచ్చిందేనని, మహాత్మా గాంధీ ఆసుపత్రి వద్ద నిలబడితే రూ.150 కోట్లతో టిడిపి అభివృద్ధి చేసిందని ఇలా ఎక్కడ చూసినా టిడిపి కనిపిస్తోందని, అందుకే నేను ప్రచారం చేయడం లేదని మేడం గారికి కెసిఆర్ చెప్పారట అన్నారు.

అందుకే ఓ సభను పెట్టి వదిలేశారని విమర్శించారు. లోకేష్ ఇంకా మాట్లాడుతూ... మాకు విశ్వనగరం వద్దని, స్కైవేలు వద్దని, హుస్సేన్ సాగర్ చుట్టూ స్టార్ హోటళ్లు కూడా వద్దని, తమకు రోజు నీళ్లు కావాలని, మన పక్కన ఉన్న చెత్త తీయాలని.. ఇవన్నీ చేస్తారా అని నిలదీశారు.

మాయమాటలు చెప్పి కెసిఆర్, కెటిఆర్, కవితక్కలు తప్పించుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది దారుణం అన్నారు.

వారిది కాలుష్యం గుర్తు, మాది పర్యావరణ

తెరాసది కారు గుర్తు అని, అది వాతావరణాన్ని కాలుష్యం చేస్తుందని లోకేష్ అన్నారు. తమ సైకిల్ గుర్తు పర్యావరణ హితం అన్నారు. అలాగే మేం హైదరాబాదీల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. గత మూడు దశాబ్దాలుగా హైదరాబాదులో హాయిగా బతికామని, అలాగే బతకాలంటే టిడిపి - బిజెపిని గెలిపించాలన్నారు.

జాగో... బాగో అన్నారు

గతంలో తెరాస నేతలు జాగో, బాగో అన్నారని, కానీ ఈ నగరం అందరిదీ అని లోకేష్ అన్నారు. కేంద్రంలో మోడీ ఉన్నారని, హైదరాబాద్ అభివృద్ధికి నిధులు తీసుకు వస్తామన్నారు.

కేంద్రంపై నిందలు కవితక్క, కెటిఆర్ గారి నిందలు

కవితక్క, కెటిఆర్ గారు పదేపదే కేంద్రం సహకరించడం లేదని నిందలు వేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. మీకు ఎన్ని ఇళ్లు కావాలని కేంద్రం అడిగితే.. కెసిఆర్ మాట్లాడలేదని, నివేదిక ఇవ్వలేదని, ముఖ్యమంత్రే పట్టించుకోలేదు కాబట్టి కేంద్రం పదివేల ఇళ్లు మాత్రమే ఇచ్చిందన్నారు.

ఈ విషయం తెలియగానే టిడిపి ఎమ్మెల్యేలు చంద్రబాబును కలిసి మొరపెట్టుకున్నారని, చంద్రబాబు ప్రధాని మోడీకి ఒక్క ఫోన్ చేయడంతో మరిన్ని ఇళ్లు వచ్చాయని చెప్పారు. కెసిఆర్ ఓ కుంభకర్ణుడిలా పాలనను గాలికొదిలి నిద్రపోతున్నాడన్నారు.

తెలంగాణకు ఎన్ని ఇళ్లు కావాలని కేంద్రం అడిగితే కేసీఆర్ నిద్రపోతూ, దానికి సమాధానం చెప్పలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతే, చంద్రబాబు స్వయంగా మోడీకి ఫోన్ చేసి తెలంగాణ ప్రజలను అన్యాయం చేయవద్దని చెప్పగా, అప్పటికప్పుడు 50 వేల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందన్నారు.

తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ఘనత కచ్చితంగా ఎన్డీయే ప్రభుత్వానిదే అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి, టిడిపి అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలన్నారు. స్మార్ట్ సిటీల తొలి జాబితాలో తెలంగాణ నగరాలు లేకపోవడానికి కారణం కూడా కేసీఆర్ కుంభకర్ణ నిద్ర మాత్రమే కారణమన్నారు.

కేంద్రానికి రాష్ట్రాలన్నీ సమానమేనని, వారు కోరినప్పుడు స్పందించకుండా, ఆ తర్వాత నోటికొచ్చినట్టు మాట్లాడటం కేసీఆర్‌కు అలవాటయిందన్నారు. మాయమాటలు చెప్పి తప్పించుకునే టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయవద్దన్నారు.

ఒక్క వారం రోజుల్లో తెలుగుదేశం పార్టీ జోష్ ఎలా ఉందో చూపించామని, మరో ఐదు రోజుల్లో గ్రేటర్ పీఠం కైవసం కానుందన్నారు. స్మార్ట్ సిటీ రాకపోవడానికి కెసిఆర్ కుంభకర్ణుడిలా ఉండటం వల్లే అన్నారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే అని చెప్పారు.

2019లో ముఖ్యమంత్రి మనవాళ్లే

తనకు ఎలాంటి సందేహం లేదని, 2019లో టిడిపి, బిజెపి గెలుస్తుందని, ముఖ్యమంత్రి సీటు మనదే అని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ సభ చూస్తే నాకే నవ్వు వచ్చిందని, ఆ సభ పెట్టింది.. చంద్రబాబును, టిడిపి నేతలను తిట్టేందుకే అన్నారు.

మా అమ్మపై కెసిఆర్ ఓ మాట చెప్పారు.

ఆ సభలో కెసిఆర్ ఓ మాట చెప్పారని, తమ అమ్మ తెరాసకు ఓటేస్తానని చెప్పిందని కెసిఆర్ వ్యాఖ్యానించడం దారుణం అన్నారు. ఇంత పెద్ద సభలో కెసిఆర్ అంత పెద్ద అబద్దం ఘోరమన్నారు. ఓ ముఖ్యమంత్రి బహిరంగ సభ పెట్టి అంత పెద్ద మాట చెప్పడమా అన్నారు. ఇక విశ్వనగరం ఏం చేస్తారన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబుల వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. ఈ హైదరాబాద్ అందరిదీ అన్నారు.

English summary
Nara Lokesh counter to KCR comments on Bhuvaneswari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X