Police Alert: వాగు దాటుతూ డ్రోన్ కెమెరాలకు చిక్కిన మావోలు..ఇదిగో వీడియో..!
మావోయిస్టుల కదలికలు కనిపెట్టేందుకు పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా డ్రోన్ కెమెరా ద్వారా పోలీసులు మావోయిస్టుల కదలికలను కనిపెట్టారు. వందలాది మంది వరుసగా ఒక వాగును దాటుతున్న దృశ్యాన్ని పోలీసుల డ్రోన్ కెమెరా చిత్రీకరించింది. వారిలో చాలామంది మావోయిస్టులు ఉన్నట్లుగా గుర్తించారు. చత్తీస్ గడ్ నుండి తెలంగాణ వైపు మావోయిస్టులు వస్తున్నట్లుగా ఈ వీడియో ద్వారా గుర్తించిన పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.
ఏపీ టూ హైదరాబాద్ ..కారులో సీక్రెట్ లాకర్స్ ... భారీగా హవాలా దందా

డ్రోన్ వీడియోలో మావోల కదలికలు ... తెలంగాణా పోలీసులు అలెర్ట్
ఈ వీడియో ఆధారంగా అటు చత్తీస్ గడ్ పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య నిరంతరం పోరు నడుస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ మావోయిస్టుల కదలికలు ఉన్నాయి. కానీ పోలీసులు ఎప్పటికప్పుడు మావోయిస్టులకు చెక్ పెడుతున్నారు. ఇటీవల భద్రాద్రి జిల్లా గుండాల మండలం లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, చర్ల మండలం లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టుల మృతి చెందారు. మరికొందరు మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమైనట్లుగా వార్తలొచ్చాయి.

తెలంగాణా ఏజెన్సీ గ్రామాలలో , అటవీ ప్రాంతంలో పోలీసుల జల్లెడ
ఈ నేపథ్యంలో తాజాగా వీడియోలో మావోలు వాగు దాటే దృశ్యాలు పోలీస్ శాఖను అలెర్ట్ చేశాయి. తాజాగా వందల సంఖ్యలో వాగు దాటుతూ తెలంగాణ వైపు వస్తూ ఉండడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ములుగు, భద్రాచలం, పినపాక, మంథని అటవీ ప్రాంతాలలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని పెదనల్లబెల్లి అతి సమీపంలో గల ఛత్తీస్ గడ్ సుక్మా జిల్లా కిష్టారం ప్రాంత అడవుల్లో గిరిజనులతో కలిసి మావోలు ఒక వాగును దాటినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
కిష్టారం అటవీ ప్రాంతంలో గిరిజనులతో సమావేశం నిర్వహించినట్టు అనుమానం
గిరిజనులను సమీకరించి సమావేశం నిర్వహించిన తర్వాత వారు వాగు దాటుతున్న దృశ్యాలు డ్రోన్ కెమెరా లో చిత్రీకరించబడ్డాయి. అయితే వాగు దాటుతున్న వారిలో ఎంతమంది నక్సలైట్లు ఉన్నారు? వందలాది మంది ప్రజలు వారిని ఎందుకు కలిశారు? అన్న అంశంపై పోలీసులు, నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఇదే సమయంలో కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలోడి, కాసారం గ్రామాల మధ్య నిర్మించిన రహదారిని నక్సలైట్లు ఈనెల 9వ తేదీన ధ్వంసం చేయటం, 31 ప్రాంతాలలో రోడ్డును ప్రయాణించడానికి వీలు కాకుండా ధ్వంసం చేయటంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మావోలు వాగు దాటే డ్రోన్ వీడియో లీక్ .. అడుగడుగునా అటవీప్రాంతంలో పోలీసుల నిఘా
సెప్టెంబర్ 9న గ్రామస్తులతో నక్సలైట్స్ సమావేశం నిర్వహించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు అత్యంత రహస్యంగా ఉండాల్సిన వీడియో కూడా లీక్ అవ్వడం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి చత్తీస్ గడ్ , తెలంగాణ రాష్ట్రాలు మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టడం మాత్రమే కాకుండా, ప్రస్తుతం అనుమానం ఉన్న అటవీ ప్రాంతాలలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలు ఎప్పుడు యేని జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటున్నారు .