తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా వైరస్: 3వేలు దాటిన యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని వారాల క్రితం వరకు 50 నుంచి 150 వరకు నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య.. ఇప్పుడు ఏకంగా 500కు చేరువయ్యాయి. గురువారం 28,865 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 494 మంది కరోనా బారినపడినట్లు తేలింది.
ఈ కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 315 కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా బారి నుంచి గత 24 గంటల్లో 126 మంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 3048 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ నేటి బులిటెన్లో వెల్లడించింది.

మరోవైపు, దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం వరకు ఒక్కరోజే 13,313 మంది వైరస్ బారినపడగా.. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 10,972 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.60 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.19 శాతం వద్ద ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.03 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.81 గా నమోదైంది.
మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,44,958కి చేరగా, మరణాల సంఖ్య
5,24,941కి చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 83,990కి పెరిగింది. కోలుకున్నవారి సంఖ్య 4,27,36,027కి చేరింది. మరోవైవు, భారతదేశంలో బుధవారం 14,91,941 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,62,11,973 కోట్లకు చేరింది.
కరోనా కేసుల పెరుగుతున్న క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం పలు సూచనలు చేసింది. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి సారించాలని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ అధికారులను ఆదేశించారు. కరోనా మ్యూటేషన్లను నిశితంగా పరిశీలించాలని సూచించారు. రాష్ట్రాలు కరోనా పరీక్షలు పెంచడంతోపాటు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.