నీరజ్ పన్వార్‌ను హత్య చేసింది సంజన పెద్దనాన్న కుమారులే: ఆరుగురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని బేగంబజార్‌లో జరిగిన పరువు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నీరజ్ పన్వార్ హత్య కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం డీసీపీ జోయల్ డేవిస్ మీడియాకు వెల్లడించారు. సంజన పెద్దనాన్న కుమారులే నీరజ్‌ను హత్య చేశారని తెలిపారు.
డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. నీరజ్‌ను హత్య చేసేందుకు 15 రోజులుగా కుట్ర చేశారు. నిందితులు జుమేరాత్ బజార్లో కత్తులు కొన్నారు. నీరజ్ కదలికలను గత కొన్ని రోజులుగా పరిశీలించారు. ప్రేమ వివాహం చేసుకున్న నీరజ్ దంపతులు షంషేర్‌నగర్‌లో ఉంటున్నారు. నీరజ్, సంజన ప్రేమ వివాహం యువతి ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. పెళ్లి అనంతరం సంజనతో ఎలాంటి సంబంధం లేదని ఆమె కుటుంబసభ్యులు వదిలేశారు.

అయితే, పెద్దనాన్న కుమారులు మాత్రం పరువు పోయినట్లు భావించారు. కాగా, ప్రాణాపాయం ఉందని గత ఏడాది పెళ్లి చేసుకున్న సమయంలోనే నీరజ్, సంజన ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. అప్పుడే ఇరువర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు చెప్పారు. నీరజ్ వాళ్లకు పల్లీల వ్యాపారం ఉంది. నీరజ్ ఎక్కువ షాపునకు రావడం.. నిందితుల ఇల్లు కూడా సమీపంలోనే ఉండటంతో తరచూ వారు ఎదురుపడటం జరిగింది. ఈ క్రమంలోనే నిందితులు నీరజ్‌ను చూడటం ఇష్టంలేక చంపేయాలనుకున్నారు.
ఆవేశం, తాగిన మత్తులో తీసుకున్న నిర్ణయం ప్రకారం నీరజ్‌ను హతమార్చారు నిందితులు. నిందితుడిగా గుర్తించినవారిలో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసులో సంజన కుటుంబసభ్యుల ప్రమేయం ఇప్పటి వరకు బయటపడలేదని చెప్పారు. ప్రస్తుతం ఆరుగురు నిందితులు అభినందన్, విజయ్, సంజయ్, రోహత్, మహేశ్, ఒక బాలుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులను విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని డీసీపీ చెప్పారు.