కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయితీ: ఆ నేతలపై అధిష్టానానికి ఫిర్యాదు; ఏం మారలేదుగా!!
రామాయణమంతా విని రాముడికి సీత ఏమైంది అన్నట్టు, అంతర్గత కలహాలు పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయాలని రాహుల్ గాంధీ సూచించినప్పటికీ కాంగ్రెస్ పార్టీల నేతలు ఏమాత్రం మారలేదు. మళ్ళీ మొదటికే వచ్చారు. అంతా కలిసి పని చేస్తామని నేతలు చెప్పి పట్టుమని పది రోజులైనా కాకముందే అంతర్గత కుమ్ములాటలతో బాహాటంగా రచ్చకు దిగుతున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోమారు వర్గ విభేదాలు బయటపడ్డాయి.

ముగ్గురు సీనియర్ పార్టీ నాయకులపై అధిష్టానానికి ఫిర్యాదు
కాంగ్రెస్ పార్టీ గ్రూప్ వార్ లో కొత్తగా అద్దంకి దయాకర్ పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాం రెడ్డి దామోదర్ రెడ్డి పై ఆరోపణలకు దిగారు. ఈ ముగ్గురు పార్టీ సీనియర్ నేతలపై అధినేత్రి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ఏఐసిసి పెద్దలందరికీ ఫిర్యాదు చేశారు. తనను రాజకీయంగా అంతం చేయడం కోసం ఈ ముగ్గురు కలిసి కుట్రలు చేస్తున్నారని సోనియా గాంధీకి రాసిన లేఖలో ఆయన ఆరోపణలు గుప్పించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో తన వ్యతిరేక వర్గాన్ని వారు ప్రోత్సహిస్తున్నారని అద్దంకి దయాకర్ ఆరోపించారు.

రాహుల్ గాంధీ చెప్పిన మాట వినని రవిని మళ్లీ ఎట్లా పార్టీలోకి తీసుకుంటారు
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి రెబల్ గా పోటీచేసిన వడ్డేపల్లి రవిని మళ్ళీ పార్టీలో చేర్చుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన లేఖలో ఆరోపణలు గుప్పించారు. గత ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ చెప్పిన మాట వినని రవిని మళ్లీ ఎట్లా పార్టీలోకి తీసుకుంటారు అంటూ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో రెబల్ గా పోటీ చేసి పార్టీ ఓటమికి కారణం అయ్యాడు అని అప్పుడు పార్టీ అధినాయకత్వం ఆరేళ్లపాటు రవిని సస్పెండ్ చేసిందని, మళ్లీ అటువంటి వ్యక్తిని పార్టీ లోకి తీసుకురావడం కోసం కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.

ముగ్గురు సీనియర్ పార్టీ నాయకులు తనపై కుట్ర చేస్తున్నారు: అద్దంకి దయాకర్
అప్పుడు తన ఓటమికి వడ్డేపల్లి రవి కారణమని అద్దంకి దయాకర్ ఆరోపించారు. గత ఎన్నికల్లో తనను ఓడించడం కోసం టిఆర్ఎస్ పార్టీ తో డీల్ కుదుర్చుకుని కాంగ్రెస్ రెబల్ గా రవి పోటీ చేశాడని ఆయన పేర్కొన్నారు. ఇక అతని కోసం ముగ్గురు సీనియర్ పార్టీ నాయకులు తనపై కుట్ర చేస్తున్నారని అద్దంకి దయాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతర్గత కలహాలు మానుకోవాలని రాహుల్ గాంధీ చెప్పినా మారని నేతల తీరు
ఇటీవల రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో రెండుమార్లు భేటీ అయ్యారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని, వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా క్షేత్రస్థాయిలో బలంగా వెళ్లాలని పార్టీ శ్రేణులకు రాహుల్ గాంధీ తెలిపారు. చిన్న చిన్న మనస్పర్ధలు, పొరపొచ్చాలు పక్కన పెట్టి అందరూ కలిసి పని చేయాలని చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో నేతలు ఒకరిమీద ఒకరు ఫిర్యాదులతో, ఆరోపణలతో, రకరకాల పంచాయతీలతో అంతర్గత కలహాలకు దిగుతూనే ఉన్నారు. ఇక ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తాయన్న భావన వ్యక్తమవుతుంది.