కొడుకు ఆత్మహత్య: మద్యం మత్తులో నాలుగు రోజులైనా గుర్తించని తండ్రి
హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం మత్తులో మునిగి తేలిన ఓ తండ్రి, కన్న కొడుకు ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నా ఆ దారుణాన్ని గుర్తించలేకపోయాడు. రంగారెడ్డి జిల్లా మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
సోమవారం ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటంతో ఇంటి పక్కనే ఉంటున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. వివరాల్లోకి వెళితే, ఛత్రినాక కందికల్ గేట్ సమీపంలో నివాసం ఉండే సత్యనారాయణ రెండు నెలల క్రితం బడంగ్ పేట సాయిప్రభు హోమ్స్ కాలనీకి వచ్చి అద్దెకు ఉంటున్నారు.
ఇతని భార్య గతంలో చనిపోగా, చిన్న కుమారుడు సునీల్ (26)తో కలసి ఉంటున్నాడు. డిసెంబర్ 31వ రాత్రి సునీల్ తన పడకగదిలోకి వెళ్లి కేకు కట్ చేశాడు. అనంతరం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగు రోజులుగా ఇంట్లో మరో గదిలో సత్యనారాయణ మద్యం మత్తులోనే ఉంటున్నాడు.

తన కుమారుడు చనిపోయిన విషయాన్ని సైతం గ్రహించలేకపోయాడు. కాగా నిన్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగు పోరుగు వారు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న సీఐ వెంకట్ రెడ్డి, ఎస్ఐ వెంకటయ్య ఇంటి తలుపులు మృతదేహాన్ని బయటకు తీశారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సునీల్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కుమారుడు చనిపోయినా గ్రహించలేని స్ధితిలో ఉన్నానని తండ్రి సత్యనారాయణ ఎంతో ఆవేదన చెందాడు.